నాలుగు రోజుల్లో 45 మంది మృతి
♦ వడదెబ్బకు పిట్టల్లా రాలుతున్న జనం
♦ సర్కారుకు విపత్తు నిర్వహణ శాఖ నివేదిక
♦ అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మంది
సాక్షి, హైదరాబాద్: వడదెబ్బకు ప్రజలు పిట్లల్లా రాలుతున్నారు. కేవలం నాలుగు రోజుల వ్యవధిలో రాష్ట్రంలో 45 మంది మృత్యువాత పడినట్లు తెలంగాణ విపత్తు నిర్వహణ శాఖ వెల్లడించింది. ఈ నెల 24 నుంచి 27 వరకు వడదెబ్బ మృతులపై ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి పంపించినట్లు తెలి సింది. అత్యధికంగా నల్లగొండ జిల్లాలో 18 మంది, కరీంనగర్ జిల్లాలో 9 మంది, మహబూబ్‌నగర్ జిల్లాలో ఆరుగురు, వరంగల్ జిల్లాలో ఐదుగురు, ఖమ్మం జిల్లాలో నలుగురు మరణించారు. మార్చి నెలలోనే అసాధారణ ఎండలు ఉండటంతో ఈ పరిస్థితి తలెత్తింది. ఈ నాలుగు రోజుల్లో రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 47 డిగ్రీలకు చేరడంతో ఈ మరణాలు సంభవిం చినట్లు అంచనా. ఏప్రిల్, మేలో ఉష్ణోగ్రత 50 డిగ్రీల వరకు చేరుకునే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ పేర్కొంటున్నారు.
కార్యాచరణ ప్రణాళిక అమలేదీ?
వడదెబ్బ నుంచి ప్రజలను రక్షించేందుకు విప త్తు నిర్వహణ శాఖ జారీ చేసిన ‘వడగాల్పుల కార్యాచరణ ప్రణాళిక’ను అమలు చేయడంలో వైఫల్యం కారణంగానే ఇంతమంది చనిపోయారని సమాచారం. ఇప్పటికీ మూడు జిల్లా లు మినహా మిగిలినవి ఈ కార్యాచరణ అమలుకు కసరత్తు చేయలేదని తెలిసింది. ఖమ్మం, వరంగల్, నల్లగొండ జిల్లాల కలెక్టర్లే ప్రణాళిక అమలుకు కార్యాచరణ సిద్ధం చేసి సంబంధిత నివేదికను రాష్ట్ర విపత్తు నిర్వహణ శాఖకు పంపినట్లు సమాచారం. వరంగల్ జిల్లా కలెక్టర్ అధికారులతో సమావేశం నిర్వహించి పాఠశాలల పని వేళలను సవరించారు. ఉదయం 7 నుంచి 11 గంటల వరకే నిర్వహిం చాలని ఆదేశించారు.
ప్రణాళికను తహసీల్దార్, ఎంపీడీవోలకు పంపించారు. సర్పంచులు, ఎంపీటీసీ, జెడ్పీటీసీలను భాగస్వామ్యం చేయాలని నిర్ణయించారు. నల్లగొండ జిల్లాలో సిటీ కేబుల్, పోస్టర్లు, బ్యానర్ల ద్వారా వడ దెబ్బపై ప్రజలకు అవగాహన కల్పించాలని నిర్ణయించారు. బయట పనిచే సేవారికి ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు సిద్ధంగా ఉంచాలన్నారు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆర్టీసీ బస్సులను నిలిపివేయాలని నిర్ణయించారు. ప్రణాళికను సిద్ధం చేసిన సర్కారు అందుకు సరిపడా నిధులను జిల్లాలకు కేటాయించలేదు. ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, చలివేం ద్రాల ఏర్పాటు, ఐవీ ఫ్లూయిడ్స్, ఐస్ ప్యాక్స్‌కు నిధులివ్వలేదు. నిధులు లేకుంటే ఏమీచేయలేమని సంబంధిత శాఖ అధికారులు చెబుతున్నారు.