‘వైద్యం’లో 5,196 ఖాళీలు
భర్తీ చేసేది దాదాపు 2,400 పోస్టులే
♦ సీఎం ఆదేశాల మేరకు కసరత్తు ప్రారంభించిన వైద్య ఆరోగ్య శాఖ
♦ రెండు మూడు రోజుల్లో సీఎంకు సమగ్ర నివేదిక
సాక్షి, హైదరాబాద్: వైద్య, ఆరోగ్య శాఖలోని ప్రధాన విభాగాల పరిధిలో 5,196 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు ఆ శాఖ ఉన్నతాధికారులు గుర్తించారు. దీంతోపాటు మరికొన్ని విభాగాల్లో మరో వెయ్యి వరకు ఖాళీలు ఉన్నట్లుగా అంచనా వేస్తున్నారు. అయితే ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించిన మేరకు.. సుమారు 2,400 పోస్టుల భర్తీపైనే కసరత్తు చేస్తున్నారు. ఖాళీలన్నింటి లెక్క తేల్చి వాటిలో ముఖ్యమైనవి, తక్షణం భర్తీ చేయాల్సిన వాటిని గుర్తిస్తున్నారు. సోమవారం నాటికి కచ్చితమైన వివరాలు తయారుచేసి సీఎంకు నివేదిక సమర్పించనున్నారు. అందులో భర్తీ చేయాల్సిన 2,400 పోస్టుల జాబితాను జతపరుస్తారు.
వైద్య విద్యా సంచాలకుల(డీఎంఈ) పరిధిలో మొత్తం 4,869 పోస్టులకు... 1,482 ఖాళీలున్నట్లు గుర్తించారు. ప్రజారోగ్యం, కుటుంబ సంక్షేమ సంచాలకుల పరిధిలో 9,321 పోస్టులకు 2,659 ఖాళీలు, వైద్య విధాన పరిషత్‌లో 4,016 పోస్టులకు 1,055 ఖాళీలు ఉన్నట్లు గుర్తించారు. మొత్తంగా ఈ మూడు విభాగాల్లో 18,206 పోస్టులకుగాను 5,196 ఖాళీలున్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ నిర్ధారించింది. వీటికితోడు ఆయుష్, టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ సహా ఇతరచోట్ల కలిపి మరో వెయ్యి వరకు ఖాళీలుండే అవకాశం ఉందని సమాచారం.
ఖాళీలు ఆరు వేల వరకు ఉన్నా సీఎం నిర్దేశించిన ప్రకారం 2,400 పోస్టుల భర్తీకే వైద్య ఆరోగ్యశాఖ కసరత్తు చేస్తోంది. ఖాళీ పోస్టుల్లో అనేకచోట్ల ఔట్‌సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నందున అక్కడ వారి సేవలు కొనసాగించనున్నారు. ప్రధానంగా వైద్యులు, నర్సులు, పారామెడికల్ ఖాళీ పోస్టులను భర్తీ చేయాలని నిర్ణయించారు. నాలుగో తర గతి ఉద్యోగులను, ఎన్‌ఎన్‌వో, ఎఫ్‌ఎన్‌వోలను తీసుకునే అవకాశాల్లేవని ఆ శాఖ వర్గాలు చెబుతున్నాయి. ఉదాహరణకు డీఎంఈ పరిధిలో 1,482 ఖాళీలుంటే అందులో 665 ఖాళీలు నాలుగో తరగతి ఉద్యోగాలే. ఈ ఉద్యోగాల భర్తీ ఉండబోదని వైద్య వర్గాల సమాచారం.
డీఎంఈ పరిధిలో అసిస్టెంట్ ప్రొఫెసర్ల పోస్టులు 206 ఖాళీగా ఉండగా... నేరుగా భర్తీ చేయడానికి అవకాశమున్న పోస్టులు 124 ఉన్నాయి. వీటినే భర్తీ చేస్తారు. ఖాళీగా ఉన్న 279 స్టాఫ్‌నర్సు పోస్టులను భర్తీ చేస్తారు. ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 121, గ్రేడ్-2 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు 121 ఖాళీగా ఉన్నాయి. వీటినీ నేరుగా భర్తీ చేయవచ్చు. కుటుంబ సంక్షేమం, ప్రజారోగ్య విభాగంలో ఖాళీగా ఉన్న 328 సివిల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టులు, 772 స్టాఫ్‌నర్సు పోస్టులను నేరుగా భర్తీ చేయడానికి వీలున్నట్లు అధికారులు నిర్ధారించారు. మిగతా పోస్టులపై స్పష్టత రావాల్సి ఉంది. ఇక వైద్య విధాన పరిషత్‌లో 150 వైద్య పోస్టులను నేరుగా భర్తీ చేయవచ్చని గుర్తించారు.