‘సెర్ప్’ ఉద్యోగినులకూ 6 నెలల ప్రసూతి సెలవులు!
- మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు రూ.20 వేలకు పెంపు
- పాలక మండలికి ప్రతిపాదించనున్న ఉద్యోగ సంఘాలు
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ(సెర్ప్)లోని కాంట్రాక్ట్ ఉద్యోగినులకు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 6 నెలల పాటు ప్రసూతి సెలవులు లభించనున్నాయి. ఉద్యోగ సంఘాల ప్రతిపాదన మేరకు ఉన్నతాధికారులు ఇందుకు సూత్ర ప్రాయంగా అంగీకారం తెలిపినట్లు సమాచారం. ప్రస్తుతమున్న 120 రోజుల ప్రసూతి సెలవును 180 రోజులకు పెంచే విషయమై పాలకమండలి తుది నిర్ణయం తీసుకో వాల్సి ఉంది. ఈ నెల 23న పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన జరగనున్న పాలక మండలి సమావేశం ప్రధాన ఎజెండాలో ఈ అంశాన్ని పొందుపరిచారు.
మరణించిన ఉద్యోగుల అంత్యక్రియల ఖర్చు నిమిత్తం ఇప్పటివరకు ఇస్తున్న రూ.10 వేలను రూ.20 వేలకు పెంచాలనే ప్రతిపా దననూ పాలకమండలి ముందు కు తీసుకు రావాలని సెర్ప్ ఉద్యోగ సంఘాలు భావిస్తున్నా యి. సెర్ప్ ఉద్యోగుల సమస్యల ను త్వరలోనే పరిష్కరిస్తానని ఇటీవల మంత్రి జూపల్లి హామీ ఇచ్చినందున తమ ప్రతిపాద నలకు ఆమోదం లభిస్తుందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. హైదరాబాద్‌లోని ప్రధాన కార్యాలయంతో పాటు సెర్ప్ పరిధిలో రాష్ట్రవ్యాప్తంగా 4,224 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిలో 29 శాతం మహిళలు ఉన్నట్లు అధికారులు లెక్క తేల్చారు. ఉద్యోగుల సమస్యలతో పాటు స్వయం సహాయక సంఘాలకు వడ్డీలేని రుణాలు, అభయ హస్తం, పల్లె ప్రగతి పథకాల అమలు.. తదితర అంశాలు సమావేశంలో చర్చకు రానున్నాయి.