
రెండో రోజూ కదలని క్యాబ్‌లు
గ్రేటర్‌లో నిలిచిన 60 వేల క్యాబ్ సర్వీసులు
సాక్షి, హైదరాబాద్: ఓలా, ఉబెర్ సంస్థలకు వ్యతి రేకంగా తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసి యేషన్ చేపట్టిన క్యాబ్‌ల బంద్ ప్రభావం రెండో రోజైన ఆదివారం కూడా కనిపించింది. గ్రేటర్ హైదరాబాద్‌లో ఓలా, ఉబెర్‌క్యాబ్ సర్వీ సులు దాదాపు 60 వేల వరకు నిలిచిపోయాయి. దీంతో కొత్త సంవత్సర వేడుకలకు హాజరైనవారితో పాటు పర్యాటకులు, శంషాబాద్ విమానాశ్రయానికి రాకపోకలు సాగించేవారు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇదే అదనుగా మేరు, గ్రీన్ క్యాబ్స్, డాట్ తదితర క్యాబ్ సర్వీసులు చార్జీలు భారీగా పెంచి అందినకాడికి ప్రయాణికుడి జేబు గుల్ల చేశాయి. కాగా, అసోసియేషన్ ఆధ్వర్యంలో నగర వ్యాప్తంగా ఆదివారం ధర్నాలు, నిరసనలు చేపట్టారు. ఇతర క్యాబ్ సర్వీసులను అడ్డుకున్నారు. సమస్య పరిష్కారానికి ఓలా, ఉబెర్ సంస్థలు ఇంతవరకూ క్యాబ్ డ్రైవర్లతో ఎలాంటి చర్చ లూ జరపకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలో తమ ఆందోళన మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ క్యాబ్ డ్రైవర్స్ అండ్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు శివ ఒక ప్రకటనలో తెలిపారు.
ఆర్టీసీ అదనపు బస్సులు...
క్యాబ్ సర్వీసుల రద్దు నేపథ్యంలో గ్రేటర్ ఆర్టీసీ శంషాబాద్‌తో పాటు ప్రయాణికుల రద్దీ అధికంగా ఉన్న ప్రధాన కారిడార్లలో వెయ్యి ట్రిప్పులు అదనంగా నడిపింది. అవసరాన్ని బట్టి రద్దీ రూట్లలో మరిన్ని బస్సులు నడుపుతామని తెలిపింది.