అంబేద్కర్ స్ఫూర్తి ఇంకా రావాలి: వైఎస్ జగన్
హైదరాబాద్: భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బీ ఆర్ అంబేద్కర్ స్ఫూర్తి నీరుకారుతోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో రాజ్యాంగం అమల్లోకి వచ్చి 67 ఏళ్లయినా దళిత క్రైస్తవులకు మతం ఆధారంగా ఎస్సీ సర్టిఫికేట్ మంజూరు కాని పరిస్థితి నెలకొందని తెలిపారు. ఈ పరిస్థితి సిగ్గుతో తలదించుకునేలా ఉందన్నారు. దళితుల సాంఘిక, ఆర్థిక పరిస్థితి ఇప్పటికీ మారలేదని చెప్పారు.
బీఆర్ అంబేద్కర్ స్ఫూర్తి ఇంకా రావాల్సి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. అందరం కలసి ఈ వ్యవస్థను మార్చాల్సిన అవసరం ఉందని వైఎస్ జగన్ ఈ సందర్భంగా ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ వ్యవస్థను మార్చే క్రమంలో తమ పార్టీ ఎప్పుడు ముందుంటుందని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. దేశ ప్రజలందరికి వైఎస్ జగన్ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
మంగళవారం లోటస్పాండ్లోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో 67వ గణతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా జాతీయ పతాకాన్ని వైఎస్ జగన్ ఎగురవేశారు. అనంతరం జాతీయ నేతల చిత్రపటాలకు ఆయన పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.