8 నెలల్లో 7,300 ఎయిడ్స్ కేసులు
నేడు ప్రపంచ ఎయిడ్స్ దినం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎయిడ్స్ రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి నవంబర్ వరకు కొత్తగా 7,308 మంది హెచ్‌ఐవీ బారిన పడ్డారు. డిసెంబర్ 1న ప్రపంచ ఎయిడ్స్ దినం సందర్భంగా బుధవారం వైద్య, ఆరోగ్యశాఖ విడుదల చేసిన పూర్వ జిల్లాల లెక్కల ప్రకారం అత్యధికంగా హైదరాబాద్‌లో 1,348 మంది, రంగారెడ్డి జిల్లాలో 778 మంది హెచ్‌ఐవీతో బాధపడుతున్నారు. పాత ఆదిలాబాద్ జిల్లాలో 285 హెచ్‌ఐవీ కేసులు, నిజామాబాద్ జిల్లాలో 632, కరీంనగర్‌లో 594, మెదక్‌లో 784, మహబూబ్‌నగర్‌లో 766, నల్లగొండలో 768, వరంగల్‌లో 630, ఖమ్మం జిల్లాలో 723 కేసులు కొత్తగా నమోదయ్యాయి.
ఎయిడ్స్ పై ప్రచారం కొన్నాళ్లుగా నిలిచిపోవడంతో ఈ పరిస్థితి తలెత్తిందని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా కొన్నాళ్లు హెచ్‌ఐవీ, సీడీ4 వంటి నిర్ధారణ పరీక్ష కిట్లను పూర్తి స్థాయిలో సరఫరా చేయలేదన్న ఆరోపణలున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 1.7 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులుండగా హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల్లోనే లక్ష మంది వరకు ఉన్నట్లు అంచనా.