
హాంఫట్
- 73 చెరువులు మాయం !
- తాజా సర్వేలో నిగ్గుతేలిన నిజం
- క్షేత్రస్థాయిలో కన్పించని ఆనవాళ్లు
- నగరం చుట్టూ 48 చెరువుల గల్లంతు
- సంరక్షణపై హెచ్‌ఎండీఏ మీనమేషాలు
సాక్షి, సిటీబ్యూరో: సువిశాల చెరువులతో విలసిల్లిన భాగ్యనగరి నేడు కాంక్రీట్ నిర్మాణాల కబంధ హస్తాల్లో ఇరుక్కుపోయింది. నాడు సాగు, తాగునీరు అందించిన నగర చెరువులు నేడు పూర్తిగా మాయమయ్యాయి. జల వనరులు ఉండాల్సిన చోట జనం నిండిపోయారు. గతంలో మాసబ్ ట్యాంకు అనేది ఓ పెద్ద చెరువు. ఇప్పుడక్కడ చెరువే లేదు..! దానిస్థానే పార్కు, ప్రభుత్వ కార్యాలయాలు, కాలనీలు దర్శనమిస్తున్నాయి. ఒకప్పుడు సాగునీటి కుంటగా పేరున్న నల్లకుంటలో ఇప్పుడు ఆకాశహార్మ్యాలు వెలిశాయి.
జలచరాలకు ఆవాసంగా ఉన్న నాటి నాగమయ్య కుంట నేడు బడుగు, బలహీన వర్గాల ఆవాసాలతో కిక్కిరిసిపోయింది. వాస్తవానికి రాష్ట్ర రాజధాని నగరం, దానిచుట్టుపక్కలా గతంలో 500లకు పైగా చిన్నా పెద్ద చెరువులు, కుంటలు ఉండేవని అంచనా. ఎంతపెద్ద వర్షం కురిసినా గొలుసుకట్టుగా ఒక చెరువు నిండగానే మరో చెరువులోకి నీళ్లు వచ్చేవి. అయితే... నగరం అనూహ్యంగా విస్తరిస్తుండటంతో కొందరు అక్రమార్కుల కన్ను చెరువులపై పడింది. దీంతో పెద్ద చెరువులు కాస్త చిన్న చెరువులుగా, చిన్న కుంటలు తటాకాలుగా కుంచించుకుపోయాయి. ఇప్పటికే నగరంలోని అనేక జలాశయాలు మాయమైపోవడం ఆక్రమణల తీరురు అద్దం పడుతోంది. సరస్సులు కళ్ల ముందే కనుమరుగవుతున్నా సర్కార్ కళ్లున్న కబోదిలా వ్యవహరిస్తుండటం గమనార్హం.
హైదరాబాద్ మహా నగరాభివృద్ధి సంస్థ (హెచ్‌ఎండీఏ) పరిధిలోని 5 జిల్లాల్లో సుమారు 73 చెరువులు మాయమైనట్లు తాజా సర్వేలో వెల్లడైంది. రెవెన్యూ రికార్డుల్లో ఆయా చెరువుల పేర్లున్నా... క్షేత్రస్థాయిలో వాటి ఆనవాళ్లు కూడా లేవని రెవెన్యూ యంత్రాంగం తేల్చి చెప్పింది.
ఈ మేరకు ఆయా జిల్లా కలెక్టర్లు లేక్ సర్వే నివేదికను హెచ్‌ఎండీఏకు అందించారు. రెవెన్యూ అధికారులు ‘సాక్షి’కిచ్చిన వివరాల ప్రకారం.. నగరం అనూహ్యంగా విస్తరిస్తుండటంతో చుట్టుపక్కల అనేక చెరువులు కబ్జా కాటుకు గురై కాలనీలుగా వెలిశాయి. ప్రధానంగా రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 40 చెరువులు కనుమరుగవ్వగా హైదరాబాద్ జిల్లా పరిధిలో 8, నల్లగొండ జిల్లాలో 20, మహబూబ్‌నగర్ జిల్లాలో 5 చెరువులు గల్లంతయ్యాయి. వెరసి రాష్ట్ర రాజధాని వేదికగా చుట్టుపక్కల 73 చెరువులు కాలగర్భంలో కలిసిపోవడం ఆక్రమణల తీరుకు అద్దంపడుతోంది. ఒకప్పుడు జలదుర్గంగా పేరొందిన భాగ్యనగరం చుట్టూరా ఇప్పుడు కాగడా పట్టి వెదికినా కనుచూపు మేరలో నీటి వనరులు కన్పించట్లేదు. వాస్తవానికి హెచ్‌ఎండీఏ పరిధిలో 325, గ్రేటర్ పరిధిలో 176, మొత్తం 501 చెరువులు ఉన్నట్లు హెచ్‌ఎండీఏ ఇటీవలి వరకు ఢంకా మోగిస్తూ వచ్చింది. రెవెన్యూ రికార్డుల ఆధారంగా ఆ సంఖ్యను న్యాయస్థానాలు, లోకాయుక్త, ప్రభుత్వానికి సైతం అధికారులు నివేదించారు. అయితే ఇప్పుడు వాస్తవ పరిస్థితి అందుకు భిన్నంగా ఉండటం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.
మాయమైనవి మచ్చుకు కొన్ని
హైదరాబాద్, రంగారెడ్డి, న ల్లగొండ, మహబూబ్‌నగర్, మెదక్ జిల్లాల్లో హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోని చెరువులను లెక్క తేల్చేందుకు రెవెన్యూ యంత్రాంగం క్షేత్రస్థాయిలో పరిశీలన జరిపింది. రెవెన్యూ రికార్డుల్లో ఉన్న ప్రకారం సిబ్బంది ఆయా ప్రాంతాల్లో పరిశీలించగా 73 చెరువులు భౌతికంగా లేవని తేలింది. ముఖ్యంగా హైదరాబాద్ జిల్లాలో బతుకమ్మకుంట (నల్లకుంట), యూసుఫ్‌గూడ చెరువు (కృష్ణకాంత్ పార్కు), ఆసీఫ్‌నగర్ చెరువు, అఫ్జల్‌గంజ్ చెరువు తదితర 8 చెరువులు మాయమైపోయినట్లు రె వెన్యూ సర్వేలో తెలింది.
అలాగే రంగారెడ్డి జిల్లా సరూర్‌నగర్ మండలంలోని కనకయ్య కుంట, జాల్ల కుంట, కుత్బుల్లాపూర్ మండలంలోని మొగుళ్ల కుంట, సర్కారీ శిఖం చెరువు, ఇబ్రహీంపట్నం మండలంలోని రెడ్డికుంట, మేలం కుంట, మొయినాబాద్ మండలంలోని కుంటకింది చలక, గొల్లబావికుంట తదితర 40 చెరువులు భౌతికంగా కనుమరుగైనట్లు తేల్చారు. నల్లగొండ జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో సుమారు 20 చెరువుల ఆచూకీ లభించలేదు.
ముఖ్యంగా చౌటుప్పల్ మండలంలోని పెద్దకొండూరు చెరువు, దేవుని చెరువు, పోచంపల్లి మండలంలోని కొత్తకుంట, ఊరకుంట శిఖం, వందమాని చెరువు, భువనగిరి మండలంలోని కొంగల కుంట తదితర నీటివనరులు గల్లంతైన జాబితాలో ఉన్నాయి. మహబూబ్‌నగర్ జిల్లా కొత్తూరు మండలంలోని 5 చెరువులు మాయమయ్యాయి. వీటిలో తాళ్లకుంట, కౌలుబావికుంట, మల్లెవాని కుంట, చెక్కలవాని కుంట, చెలివెందులగూడ చెరువులున్నాయి. అయితే... మెదక్ జిల్లాలో హెచ్‌ఎండీఏ పరిధిలోకి వచ్చే ప్రాంతాల్లోని చెరువులు మాత్రం క్షేత్రస్థాయిలో యథాతథంగా ఉన్నట్లు తేల్చారు.
కబ్జాలపై చర్యలేవీ?
నగరంలో చాలా చెరువులు కబ్జాల వల్ల సహజ స్వరూపాన్నే కోల్పోయాయి. నగర నడిబొడ్డున ఉన్న హుస్సేన్‌సాగరే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. సుమారు 240 చ.కి.మీ. పరిధిలోని హుస్సేన్‌సాగర్ పరివాహక ప్రాంతంలో మొత్తం 80 చెరువులున్నాయి. ప్రధానంగా వర్షాకాలంలో కూకట్‌పల్లి, యూసఫ్‌గూడ, కుత్బుల్లాపూర్, బోయిన్‌పల్లి, బాలానగర్, జీడిమెట్ల, అల్వాల్ తదితర ప్రాంతాల్లోని చెరువులు నిండి ఆ నీరు నాలాల ద్వారా హుస్సేన్‌సాగర్‌లో కలుస్తాయి. ఆయా ప్రాంతాల్లో ఇప్పుడు కాలనీలు, వాణిజ్య భవనాలు, విద్యాసంస్థలు, అపార్టుమెంట్లు వెలిశాయి.
ముఖ్యంగా కూకట్‌పల్లి ప్రగతినగర్ చెరువు, ఎల్లమ్మ చెరువు, కుత్బుల్లాపూర్ కుంట, పంతులు చెరువు, రంగథాముని చెరువులు చాలావరకు కబ్జాలకు గురయ్యాయి. అలాగే శేరిలింగపల్లి మండల పరిధిలోని గంగారం పెద్దచెరువు, మదీనాగూడ చెరువు, చందానగర్ వద్ద బచ్చుకుంట, మల్లయ్య కుంట, మియాపూర్ పటేల్‌చెరువు, గోపన్‌పల్లి వద్ద నల్లకుంటలో పెద్ద ఎత్తున ఆక్రమణలు పుట్టుకొచ్చాయి. బాలానగర్ మండలాన్ని పరిశీలిస్తే దీని పరిధిలో 16 చెరువులున్నట్లు రెవెన్యూ రికార్డులు సూచిస్తున్నాయి.
అయితే సున్నం చెరువు, కాజాకుంట, ఈదుల కుంట, భీముని కుంట, అలీ తలాబ్, నల్లచెరువులు ఆక్రమణలతో కుచించుకుపోయాయి. అంబరు చెరువులోనైతే.. ఆక్రమణలకు అడ్డూ అదుపూ లేకుండా ఉంది. సరూర్‌నగర్ చెరువులో ఇప్పటికీ ఆక్రమణలు యథేచ్ఛగా సాగుతున్నాయి. కర్మన్‌ఘాట్‌లోని చేపల చెరువు, రామంతపూర్ చెరువు, ఉప్పల్ నల్లచెరువులు చాలావరకు ఆక్రమణదారుల పాలయ్యాయి. ప్రస్తుతం ఉన్న చెరువులనైనా సంరక్షించేందుకు హెచ్‌ఎండీఏ, జీహెచ్ ఎంసీలు మీనమేషాలు లెక్కిస్తుండటం జల వనరులపై అధికారులకున్న చిత్తశుద్ధికి అద్దం పడుతోంది.