అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి.. | A baby boy death in school bus accident | Sakshi
Sakshi News home page

అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి..

Published Wed, Aug 2 2017 3:29 AM | Last Updated on Sat, Aug 11 2018 8:15 PM

అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి.. - Sakshi

అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి..

- స్కూలు బస్సు కింద పడి మరణించిన రెండేళ్ల చిన్నారి 
మీర్‌పేట్‌లో విషాదం
 
హైదరాబాద్‌: అమ్మతో కలసి అక్కను స్కూలు బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చిన రెండేళ్ల చిన్నారి... అదే బస్సు చక్రాల కింద పడి నలిగిపోయాడు. అప్పటివరకూ ఆడుతూ... ముద్దు లొలికించిన బుడతడు అంతా చూస్తుండగానే... క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరం చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. హైదరాబాద్‌ మీర్‌పేట్‌లో మంగళవారం జరిగిన ఈ విషాదం అక్కడున్నవారిని కలచివేసింది. సూర్యాపేట జిల్లా ఎలకారం గ్రామానికి చెందిన రమేశ్‌ యాదవ్‌ చంపాపేట్‌లోని నారాయణ కళాశాలలో వైస్‌ప్రిన్స్‌పాల్‌గా పనిచేస్తున్నారు.

భార్య లలిత, కూతురు మోక్ష(4), కుమారుడు మనీశ్‌(2)తో కలసి మీర్‌పేట్‌ ఠాణా పరిధిలోని శివాహిల్స్‌లో నివాసం ఉంటున్నారు. మోక్ష సమీపంలోని భారతీయ మహావిద్యాలయలో ఎల్‌కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా లలిత తన కుమార్తె మోక్షను పాఠశాలకు పంపే క్రమంలో ఇంటి ముందుకు వచ్చిన బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చింది. ఎప్పటిలానే తల్లి, అక్కను అనుసరిస్తూ మనీశ్‌ బయటకు వచ్చాడు. అయితే ఊహించని విధంగా బస్సు ముందు టైర్‌ కిందకు వెళ్లాడు.

ఇది గమనించని డ్రైవర్‌ బస్సును కదిలించడంతో మనీశ్‌ తల మీద నుంచి ముందు టైర్‌ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దీనిపై కేసు నమోదు చేశామని, బస్సు డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నామని సీఐ రంగస్వామి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీపీ విక్రంరెడ్డి తదితరులు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement