baby killed
-
ఇజ్రాయెల్ దాడుల్లో తల్లి, కూతురు మృతి
గాజా సిటీ: పాలస్తీనాలోని గాజా స్ట్రిప్ నుంచి పదుల సంఖ్యలో రాకెట్ల ప్రయోగం, ప్రతిగా ఇజ్రాయెల్ సైన్యం జరిపిన దాడుల్లో తల్లి, ఆమె కూతురు మరణించగా పలువురు గాయాలపాలయ్యారు. శనివారం మధ్యాహ్నం గాజాలోని హమాస్, ఇస్లామిక్ జిహాదీ సంస్థలకు చెందిన దళాలు సుమారు 150 రాకెట్లు తమ భూభాగంపైకి ప్రయోగించాయని ఇజ్రాయెల్ తెలిపింది. పదుల సంఖ్యలో రాకెట్లను రక్షణ వ్యవస్థలు మధ్యలోనే అడ్డుకోగా మరికొన్ని నిర్జన ప్రాంతంలో పడిపోయాయని పోలీసులు తెలిపారు. వీటి వల్ల ఇద్దరు గాయపడ్డారన్నారు. ఇందుకు ప్రతిగా ఇజ్రాయెల్ బలగాలు గాజాలోని మూడు ప్రాంతాల్లో 30 లక్ష్యాలపై ట్యాంకులు, యుద్ధ విమానాలతో విరుచుకుపడ్డాయి. ఈ ఘటనలో ఒక గర్భవతి(37), ఆమె ఏడాది కూతురు చనిపోగా 10 మంది వరకు గాయపడ్డారు. ఈ పరిస్థితుల్లో ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు సైనికాధికారులతో అత్యవసర సమీక్ష జరిపారు. మరోవైపు, ఈజిప్టు కూడా ఏప్రిల్ 9వ తేదీన ఇజ్రాయెల్, పాలస్తీనా మధ్య కుదిరిన కాల్పుల ఒప్పందం కొనసాగేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. -
కన్నతండ్రే కాలయముడయ్యాడు..
చౌటుప్పల్: ఆ చిన్నారి పాలిట కన్నతండ్రే కాలయముడయ్యాడు.. భార్యపై ఉన్న కోపాన్ని పసిబిడ్డపై చూపించాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కొయ్యలగూడెంలో సోమవారం ఈ సంఘటన చోటు చేసుకుంది. మండలంలోని దేవలమ్మనాగారం గ్రామానికి చెందిన సిలివేరు శివకు హైదరాబాద్‌లోని రామంతపూర్‌కు చెందిన అక్షరతో ఏడాది క్రితం వివాహం జరిగింది. పెళ్లి అయిన నాటినుంచే శివ, భార్యపై అయిష్టంగా ఉంటున్నాడు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈక్రమంలో అక్షర గర్భం దాల్చింది. ఈ విషయం నచ్చని శివ అబార్షన్ చేసుకోవాలంటూ ఒత్తిడి చేశాడు. దీనికి ఆమె ఒప్పుకోక మొదటి కాన్పు కావడంతో ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లింది. 3 నెలల క్రితం పాపకు జన్మనిచ్చింది. ఆ పాపకు నిహారిక అని పేరు పెట్టారు. ఇటీవల అక్షర బిడ్డతో కలసి భర్త వద్దకు వచ్చింది. ఆదివారం భార్యాభర్తలు మళ్లీ గొడవపడ్డారు. కొద్ది సేపటి తర్వాత అక్షర పడక గది నుంచి బయటకు వెళ్లింది. అంతలోనే శివ, పసిపాప నిహారిక గొంతు నులుముతుండటం చూసి వెంటనే బిడ్డను లాక్కుంది. అప్పటికే చిన్నారి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. పాపను హుటాహుటిన చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని కామినేని ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం తెల్లవారుజామున పాప మృతిచెందింది. -
కాన్పు చేసిన నర్సులు
కల్వకుర్తి టౌన్: వైద్యులు లేకుండా నర్సులే ఓ మహిళకు ప్రసవం చేయడంతో వారి ప్రయత్నం వికటించి శిశువు మృతి చెందింది. నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఈ సంఘటన చోటుచేసుకుంది. కల్వకుర్తి ఎస్ఐ రవి కథనం ప్రకారం రంగారెడ్డి జిల్లా మాడ్గుల మండలం ఫిరోజ్‌నగర్‌కు చెందిన మంగమ్మ కాన్పు కోసం సోమవారం ఉదయం కల్వకుర్తి ప్రభుత్వ ఆస్పత్రికి కుటుంబీకులతో కలసి వచ్చింది. ఆమెను పరీక్షించిన వైద్యులు సాయంత్రం సాధారణ కాన్పు కోసం సిద్ధం చేయాలని నర్సులకు సూచించి వెళ్లిపోయారు. మంగమ్మకు నొప్పులు తీవ్రమవుతున్నా వైద్యులు రాకపోవటంతో నర్సులే కాన్పు చేస్తుండగా.. బిడ్డకు పేగు చుట్టుకుని ఉండటంతో ఆందోళన చెందిన నర్సులు వైద్యుడు శివరాంకు ఫోన్ లో సమాచారం ఇవ్వగా ఆయన వచ్చేటప్పటికే మగ శిశువు చనిపోయాడు. నర్సులు కాన్పులు చేయొచ్చా అని శివరాంను అడిగితే.. ‘సాధారణ కాన్పులు చేయొచ్చు, కానీ క్లిష్ట పరిస్థితి ఎదురైతే వైద్యులకు సమాచారం ఇస్తారు’అని పేర్కొన్నారు. ఈ విషయం తెలియగానే కల్వకుర్తి సీఐ సురేందర్‌రెడ్డి, ఎస్సై రవి హుటాహుటిన చేరుకుని బాధితులతో మాట్లాడారు. -
స్కూల్ బస్సులోంచి కింద పడి చిన్నారి మృతి
హైదరాబాద్: స్కూల్‌కని వెళ్లిన ఓ చిన్నారిని మృత్యువు కానరాని లోకాలకు తీసుకెళ్లింది. స్కూల్ బస్సు రూపంలో వచ్చి చిదిమేసింది. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలించింది. ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ద్వారంలోంచి కింద పడి విద్యార్థిని మృతి చెందింది. శనివారం ఉదయం 8 గంటల ప్రాంతంలో హైదరాబాద్ వనస్థలిపురంలోని ప్రశాంతి విద్యానికేతన్ స్కూల్ బస్సు విద్యార్థులను ఎక్కించుకొని వెంకటేశ్వర కాలనీ నుంచి సాహెబ్‌నగర్ మీదుగా బయలుదేరింది. మార్గమధ్యంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ వద్ద డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేకు వేయడంతో ద్వారం పక్కనే ఉన్న అంజలి(6) అనే ఒకటో తరగతి విద్యార్థిని రోడ్డుపై పడిపోయింది. తలకు తీవ్ర గాయాలు కావడంతో వెంటనే వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. అంజలి తల్లిదండ్రులు పావని, నాగయ్య సాహెబ్‌నగర్‌లోని గాయత్రినగర్‌లో కూలీనాలీ చేస్తూ జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు కాగా అంజలి చిన్న కుమార్తె. ఉదయం బస్సు ఎక్కించి టాటా చెప్పిన తమకు అదే చివరిచూపు అవుతుందని అనుకోలేదని కూతురు మృతదేహం వద్ద తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపించారు. బస్సులో క్లీనర్ ఉండి ఉంటే ఈ ఘటన జరిగి ఉండేదికాదని, పాఠశాల సిబ్బంది నిర్లక్ష్యం వల్లే చిన్నారి మృతి చెందారని బీజేపీతోపాటు పలు ప్రజాసంఘాలు ఆందోళన చేశాయి. -
మరుగుదొడ్డిలో ‘పురిటి బిడ్డ’
తిరుపతి (అలిపిరి) : పవిత్రమైన తిరుపతి పుణ్యక్షేత్రంలో దారుణం చోటుచేసుకుంది. పురిటి బిడ్డను అత్యంత దారుణంగా మరుగుదొడ్డి బేసిన్లో దూర్చేశారు. శిశువు తల పట్టకపోవడంతో అలాగే వదిలి వెళ్లారు.. ఈ హృదయ విదారక సంఘటన మంగళవారం తిరుమలలో చోటుచేసుకుంది. తిరుమల ఆర్టీసీ బస్టాండులోని మరుగుదొడ్డికి వెళ్లిన భక్తులకు టాయిలెట్లో మృతిచెంది ఉన్న పురిటి బిడ్డ తల కనిపించింది. దీంతో కంగారుపడ్డ భక్తులు కేకలు వేసుకుంటూ బయటకొచ్చారు. విషయాన్ని భద్రతా సిబ్బంది దృష్టికి తీసుకెళ్లారు. అనంతరం పారిశుద్ధ్య కార్మికులు వచ్చి టాయిలెట్‌లోని మృత శిశువును బయటకు తీశారు. చిన్నారి మృతదేహాన్ని చూసిన భక్తులు చలించిపోయారు. కన్నీళ్లపర్యంతమయ్యారు. అనంతరం శిశువు మృతదేహాన్ని అధికారులు స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరుగుదొడ్డిలో పురిటి బిడ్డ మృతిపై తిరుమల పోలీసులు విచారణ చేపట్టారు. -
అక్కను స్కూలుకు పంపేందుకు వచ్చి..
- స్కూలు బస్సు కింద పడి మరణించిన రెండేళ్ల చిన్నారి - మీర్పేట్లో విషాదం హైదరాబాద్: అమ్మతో కలసి అక్కను స్కూలు బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చిన రెండేళ్ల చిన్నారి... అదే బస్సు చక్రాల కింద పడి నలిగిపోయాడు. అప్పటివరకూ ఆడుతూ... ముద్దు లొలికించిన బుడతడు అంతా చూస్తుండగానే... క్షణాల్లో ప్రాణాలు కోల్పోయాడు. కళ్లముందే జరిగిన ఈ ఘోరం చూసి ఆ తల్లి గుండెలవిసేలా రోదించింది. హైదరాబాద్ మీర్పేట్లో మంగళవారం జరిగిన ఈ విషాదం అక్కడున్నవారిని కలచివేసింది. సూర్యాపేట జిల్లా ఎలకారం గ్రామానికి చెందిన రమేశ్ యాదవ్ చంపాపేట్‌లోని నారాయణ కళాశాలలో వైస్ప్రిన్స్పాల్గా పనిచేస్తున్నారు. భార్య లలిత, కూతురు మోక్ష(4), కుమారుడు మనీశ్(2)తో కలసి మీర్పేట్ ఠాణా పరిధిలోని శివాహిల్స్లో నివాసం ఉంటున్నారు. మోక్ష సమీపంలోని భారతీయ మహావిద్యాలయలో ఎల్కేజీ చదువుతోంది. రోజూ మాదిరిగానే మంగళవారం కూడా లలిత తన కుమార్తె మోక్షను పాఠశాలకు పంపే క్రమంలో ఇంటి ముందుకు వచ్చిన బస్సు ఎక్కించేందుకు బయటకు వచ్చింది. ఎప్పటిలానే తల్లి, అక్కను అనుసరిస్తూ మనీశ్ బయటకు వచ్చాడు. అయితే ఊహించని విధంగా బస్సు ముందు టైర్ కిందకు వెళ్లాడు. ఇది గమనించని డ్రైవర్ బస్సును కదిలించడంతో మనీశ్ తల మీద నుంచి ముందు టైర్ వెళ్లింది. దీంతో చిన్నారి అక్కడిక్కడే మృతి చెందాడు. రక్తపు మడుగులో తమ బిడ్డను చూసి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు భోరున విలపించారు. దీనిపై కేసు నమోదు చేశామని, బస్సు డ్రైవర్‌ను అదుపు లోకి తీసుకున్నామని సీఐ రంగస్వామి తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఎంపీపీ విక్రంరెడ్డి తదితరులు ఘటనా స్థలికి వచ్చి చిన్నారి తల్లిదండ్రులను పరామర్శించారు. -
సిలిండర్ తగిలి బాలుడి మృత్యువాత
- విధ్వంసం సృష్టించిన చిన్న గ్యాస్ సిలిండర్ - గాలిలో ఎగిరి బాలుడిని ఢీ కొట్టిన గ్యాస్ బండ - చిన్నారి మృతి.. అంబర్‌పేటలో ఘటన హైదరాబాద్: చిన్న గ్యాస్ సిలిండర్ పెను విధ్వంసానికి కారణమైంది. మంటలు ఎగజిమ్ముతూ గాలిలో ఎగిరి బీభత్సం సృష్టించింది. బంతిలా దూసుకెళ్లిన సిలిండర్ నాలుగేళ్ల బాలుడిని బలంగా తాకడంతో అతని కుడి చేయి తెగిపడింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆ చిన్నారి కన్నుమూశాడు. అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని కుమ్మరివాడిలో ముంతాజ్ బేగం(55) చిన్న గదిని అద్దెకు తీసుకుని నివసిస్తోంది. ముంతాజ్ కుమార్తె కమ్రాబేగం అకాశ్నగర్లో ఉంటోంది. కమ్రాబేగం మూడో కుమారుడు పర్వేజ్(4) అమ్మమ్మ ముంతాజ్ వద్దకు సోమవారం సాయంత్రం వచ్చాడు. మంగళవారం ఉదయం 6.30 ప్రాంతంలో ముంతాజ్ టీ పెట్టుకోవడానికి ఇంట్లో ఉన్న ఐదు కిలోల చిన్న సిలిండర్‌ను వెలిగించింది. అయితే చిన్నగా గ్యాస్ లీకవుతున్నట్లు శబ్దం చే స్తూ మంట అంటుకుంది. దీంతో సిలిండర్‌ను ఇంటి బయటకు తీసుకొచ్చింది. మంటను అదుపు చేయడానికి సిలిండర్‌పై మట్టి పోసింది. మంటలు తగ్గకపోవడంతో బకెట్‌తో నీళ్లు తీసుకొచ్చి మండుతున్న సిలిండర్‌పై పోసింది. నీళ్లు పోయగానే సిలిం డర్ పెద్దగా శ బ్దం చేస్తూ గాలిలో ఎగిరి ఇంటి ముం దున్న గోడలను, ఓ ఆటోను ఢీకొట్టింది. అదే వేగంతో వెనక్కి వచ్చిన సిలిండర్ ముంతాజ్ పక్కనే ఉన్న పర్వేజ్‌ను తాకింది. ఆ ధాటికి అతని కుడి చెయ్యి తెగిపడింది. ముంతాజ్ కాలునూ బలంగా తాకిన సిలిండర్ ఎగురుతూ వెళ్లి పక్కింటి ముందు ఆడుకుంటున్న షేక్ మహ్మద్ కుమారుడు షేక్ హజీ(18 నెలలు)కి తగిలింది. సిలెండర్లోని గ్యాస్ అయ్యేవరకూ అది బీభత్సం సృష్టిం చింది. పోలీసులు క్షతగాత్రులను గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడే పర్వేజ్ మృతిచెందగా.. ముంతాజ్, షేక్ హజీ తీవ్ర గాయాలతో చికిత్స పొందుతున్నారు. -
గుంటూరు జీజీహెచ్‌లో పసికందు మృతి
- కుటుంబ సభ్యుల ఆందోళన గుంటూరు : గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం ఓ పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు నెహ్రూనగర్ కు చెందిన రోహిణి సోమవారం తెల్లవారుజామున కాన్పుకోసం జీజీహెచ్ కు వచ్చింది. జూనియర్ వైద్యులు పరీక్షలు చేసి వేడి నొప్పులు అని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి వెళ్లమన్నారని, నొప్పులు తగ్గకపోయేసరికి తాము అక్కడే ఉన్నామని రోహిణి తల్లి పద్మ తెలిపింది. కొంతసేపటి అనంతరం సీనియర్ డాక్టర్లు వచ్చి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని, మగ శిశువును బయటకు తీసే సమయంలో కింద పడేయడంతో తలకు గాయమై మృతి చెందినట్టు వారు ఆరోపిస్తున్నారు. వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ మృతిచెందాడని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులో మృతి చెందాడని ఒకసారి, పేగు మెడకు చుట్టుకుని ఉండటం వల్ల మృతి చెందాడని మరోసారి.. పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని ఆరోపించారు. ధర్నా విషయం తెలుసుకున్నపోలీసులు, ఆర్ఎం డాక్టర్ రమేష్ బాధితులతో చర్చలు జరిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శౌరి రాజునాయుడు మాట్లాడుతూ కాన్పు విషయం కష్టంగా ఉన్నట్లు ముందస్తుగా కుటుంబ సభ్యులకు తెలియజేసి ఆపరేషన్ చేశామన్నారు. బాలింతను రక్షించాలనే ప్రయత్నం చేశాం తప్పితే వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. బాధితులు కోరితే పోస్టుమార్టం చేసి దానిపై విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు. -
పసిబిడ్డను కొరికి చంపేసింది
శాన్ డియాగో: అమెరికాలో దారుణం జరిగింది. మూడేళ్ల పసిపాపను ఇంట్లో పెంచుకుంటున్న కుక్క కరిచి చంపేసింది. ఈ సమయంలో ఆ పాప తల్లిదండ్రులు కూడా ఇంట్లోనే ఉన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం అమెరికాలోని శాన్ డియాగోలో స్టాన్ ఫోర్డ్ షైర్ ప్రాంతంలో ఓ దంపతులకు మూడేళ్ల పాప ఉంది. ఆ దంపతులు టీవీ చూస్తుండగా ఆ కుక్క పాపతోపాటే బెడ్ పై ఉంది. అదే సమయంలో టీవీ చూస్తున్న పాప తల్లి ఒక్కసారిగా బలంగా దగ్గడంతో ఆ చప్పుడుకు కంగారుపడిన కుక్క గాబరాతో పసిబిడ్డను కొరకడం ప్రారంభించింది. ఎట్టకేలకు వారు కుక్క నుంచి ఆ బిడ్డను వేరు చేసి ఆస్పత్రికి తరలించినా అప్పటికే ఆ బిడ్డ ప్రాణాలు కోల్పోయింది. ఆ కుక్కకు పిచ్చి తగ్గించి పది రోజులపాటు దాని నడవడికను పరీక్షించేందుకు ప్రత్యేక సెల్ లో పోలీసులు వేశారు. -
డాక్టర్ల నిర్లక్ష్యం: చిన్నారి మృతి
చిత్తూరు: చిత్తూరు జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా ఒక పసికందు మృతి చెందింది. పెనుమూరు మండలం అగ్రహారం గ్రామానికి చెందిన వరదరాజులు భార్య బుధవారం పురిటి నొప్పులు రావటంతో రాత్రి ఆస్పత్రిలో చేర్చారు. డాక్టర్లెవరూ ఆమెను పరీక్షించేందుకు రాలేదు. దీంతో నర్సులే ఆమెకు పురుడు పోయగా మగబిడ్డకు జన్మనిచ్చింది. అయితే గురువారం ఉదయానికి శిశువు చనిపోయాడు. దీంతో వరదరాజులు కుటుంబసభ్యులు ఆస్పత్రి ఎదుట ఆందోళనకు దిగారు. వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యమే తమ చిన్నారి మృతికి కారణమంటూ నిరసన తెలిపారు. పోలీసులు అక్కడికి చేరుకుని, న్యాయం చేస్తామని వారికి నచ్చజెప్పారు. దీంతో గంట అనంతరం వారు ఆందోళన విరమించారు. వివాహమైన ఐదేళ్ల తర్వాత ఓ బిడ్డ పుడితే.. ఆ ఆనందం ఒక్కనపూటలేనే ఆవిరై పోయిందని తల్లిదండ్రులు విలిపించడం ఆసుపత్రిలో అందరినీ కలిచివేసింది.