- కుటుంబ సభ్యుల ఆందోళన
గుంటూరు : గుంటూరు జీజీహెచ్‌లో సోమవారం ఓ పసికందు మృతిచెందింది. వైద్యుల నిర్లక్ష్యం వల్లే తమ బిడ్డ చనిపోయిందంటూ కుటుంబసభ్యులు ఆందోళన చేశారు. బాధితుల కథనం ప్రకారం.. గుంటూరు నెహ్రూనగర్ కు చెందిన రోహిణి సోమవారం తెల్లవారుజామున కాన్పుకోసం జీజీహెచ్ కు వచ్చింది. జూనియర్ వైద్యులు పరీక్షలు చేసి వేడి నొప్పులు అని చెప్పి ఇంజక్షన్ ఇచ్చి ఇంటికి వెళ్లమన్నారని, నొప్పులు తగ్గకపోయేసరికి తాము అక్కడే ఉన్నామని రోహిణి తల్లి పద్మ తెలిపింది. కొంతసేపటి అనంతరం సీనియర్ డాక్టర్లు వచ్చి ఆపరేషన్ థియేటర్‌కు తీసుకెళ్లారని, మగ శిశువును బయటకు తీసే సమయంలో కింద పడేయడంతో తలకు గాయమై మృతి చెందినట్టు వారు ఆరోపిస్తున్నారు.
వైద్యుల నిర్లక్ష్యం వల్ల తమ బిడ్డ మృతిచెందాడని తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. రెండు రోజుల క్రితమే బిడ్డ కడుపులో మృతి చెందాడని ఒకసారి, పేగు మెడకు చుట్టుకుని ఉండటం వల్ల మృతి చెందాడని మరోసారి.. పొంతనలేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నారని ఆరోపించారు. ధర్నా విషయం తెలుసుకున్నపోలీసులు, ఆర్‌ఎం డాక్టర్ రమేష్ బాధితులతో చర్చలు జరిపారు. ఈ విషయంపై ఆస్పత్రి సూపరింటెండెంట్ శౌరి రాజునాయుడు మాట్లాడుతూ కాన్పు విషయం కష్టంగా ఉన్నట్లు ముందస్తుగా కుటుంబ సభ్యులకు తెలియజేసి ఆపరేషన్ చేశామన్నారు. బాలింతను రక్షించాలనే ప్రయత్నం చేశాం తప్పితే వైద్యుల నిర్లక్ష్యం లేదన్నారు. బాధితులు కోరితే పోస్టుమార్టం చేసి దానిపై విచారణ చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు ఆయన స్పష్టం చేశారు.