ఆగక... సాగేలా!
అంతర్జాతీయ రహదారుల దిశగా తొలి అడుగు
కన్సల్టెన్సీల ఎంపికకు సన్నాహాలు
టెండర్లకు జీహెచ్‌ఎంసీ సిద్ధం
కన్సల్టెన్సీలను ఆహ్వానిస్తున్న మార్గాలు
నాగార్జున సర్కిల్ - మెహదీపట్నం- గచ్చిబౌలి- మియాపూర్- ఓఆర్‌ఆర్ వరకు.
నాగార్జున సర్కిల్- కేబీఆర్ పార్కు
(కేబీఆర్ పార్కు చుట్టూ), జూబ్లీహిల్స్ రోడ్డు
నెంబర్ 45, కావూరి హిల్స్.
జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు- హైటెక్‌సిటీ- కొత్తగూడ.
సిటీబ్యూరో: హైదరాబాద్ నగరాన్ని గత పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేశారు. రహదారులు మహా నగరం స్థాయికి తగిన విధంగా లేవు. వర్షం వస్తే నీరు వెళ్లే మార్గం లేదు. ట్రాఫిక్ తిప్పలు చెప్పనవసరం లేదు. ఇకపై ఇలాంటి కష్టాలు లేకుండా అంతర్జాతీయ ప్రమాణాలతో రహదారులను అభివృద్ధి చేస్తాం. అందుకు ఎన్ని వేల కోట్లయినా ఖర్చు చేస్తాం
- ఇదీ ఇటీవల సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ.
ఈ హామీ అమలుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. తొలి దశలో ఎంపిక చేసిన మార్గాల్లో మూడు స్ట్రెచ్‌లుగా దాదాపు 60 కి.మీ.ల మేర సమగ్ర రహదారి అభివృద్ధికి అవసరమైన నివేదికకు కన్సల్టెన్సీ సర్వీసులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఈ మార్గాల్లో ఆటంకాలు లేకుండా సిగ్నల్ ఫ్రీ సదుపాయాలతో గమ్య స్థానాలు చేరుకునేలా చూడాలన్నది లక్ష్యం. ఆ మేరకు ఫీజిబిలిటీ నివేదిక తయారీకి టెండరు పిలిచేందుకు ఇంజినీరింగ్ అధికారులు నోటిఫికేషన్‌ను సిద్ధం చేశారు. కమిషనర్ ఆమోదించగానే నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌లో స్వల్ప మార్పులు ఉండవచ్చు. ప్రస్తుత సమాచారం మేరకు దిగువ పేర్కొన్న మార్గాల్లో సాఫీ ప్రయాణానికి ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు అవసరం? ఎక్కడ ఫ్లై ఓవర్లు/ఆర్‌ఓబీలు/ఆర్‌యూబీలు/స్పైరల్ మార్గాలు/ మల్టిపుల్ ఫ్లైఓవర్లు/గ్రేడ్ సెపరేటర్లు అవసరం..? ఏ జంక్షన్‌లో ట్రాఫిక్ రద్దీ ఎంత.. రద్దీసమయాల్లో ఏ మార్గంలో ఎంత ట్రాఫిక్ ఉంటుం ది? ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా... ఎక్కడా ఆగకుండా ముందుకు సాగాలంటే ఎలాంటి ఏర్పాట్లు చేయాలి..? వంటి వాటిని వివరిస్తూ కన్సల్టెన్సీ సంస్థ సమగ్ర ప్రాజెక్టు రిపోర్టు తయారు చేయాల్సి ఉంటుంది.
సీఎం ఆలోచనలకు అనుగుణంగా తొలిదశలో దాదాపు రూ.4 వేల కోట్ల నుంచి రూ. 5వేల కోట్లతో పనులు చేయాలనే యోచనలో అధికారులు ఉన్నారు. దీనికి సంబంధించిన వ్యయం, ఇతరత్రా వివరాలతో సమగ్ర నివేదిక (డీపీఆర్)కు టెండరు పిలుస్తున్నారు. ప్రస్తుతం డీపీఆర్ పిలుస్తున్న మార్గాలన్నీ బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్ వైపువే కావడం గమనార్హం. జిల్లాల నుంచి శివార్లకు చేరిన వారు నగరం లోపలికి రావడానికే గంట నుంచి రెండున్నర గంటల సమయం పడుతోంది. వారికి సదుపాయంగా రహదారులను అభివృద్ధి చేయనున్నట్లు సీఎం చెప్పారు. అయితే పనులకు ఆటంకాల్లేని మార్గాల్లో తొలిదశ చేపట్టాలని సూచించిన నేపథ్యంలో అధికారులు వీటిపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది.
సీఎం ప్రాధాన్యమిచ్చిన మార్గాలు
ఉప్పల్ జంక్షన్ - సంగీత్ జంక్షన్
బయో డైవర్సిటీ పార్కు జంక్షన్ (గచ్చిబౌలి)- జేఎన్‌టీయూ జంక్షన్, కూకట్‌పల్లి
ట్యాంక్‌బండ్ అంబేద్కర్ విగ్రహం -
అఫ్జల్‌గంజ్
అబిడ్స్ జంక్షన్- చాదర్‌ఘాట్ జంక్షన్ (వయా కోఠి)
హబ్సిగూడ -ఐడీఏ మల్లాపూర్ (వయా నాచారం)
చాదర్‌ఘాట్-పుత్లిబౌలి-జాంబాగ్-
మొజాంజాహీ మార్కెట్-ఏక్‌మినార్ జంక్షన్ (నాంపల్లి)
పురానాపూల్ - ఆరాంఘర్ (వయా జూపార్కు)
వీటితో పాటు కోఠి జంక్షన్, ఆర్‌టీసీ క్రాస్‌రోడ్స్, సికింద్రాబాద్, ఉప్పల్, ఎల్‌బీనగర్, చాదర్‌ఘాట్, పుత్లిబౌలి, బహదూర్‌పురా జంక్షన్‌లలోనూ రద్దీ ఎక్కువని... అక్కడ కూడా ట్రాఫిక్ ఇబ్బందులు లేనివిధంగా ఏర్పాట్లు చేయాల్సిందిగా సీఎం అధికారులకు సూచించడం తెలిసిందే. దానికి అనుగుణంగా జీహెచ్‌ఎంసీ అధికారులు ముందుకెళుతున్నారు.