
అడ్డగోలు దోపిడీని ఓకే చేసేద్దాం!
- నేడు కేబినెట్ ప్రత్యేక భేటీ
- నోటిమాటపై రూ.86 కోట్ల పనులు అప్పజెప్పిన సీఎం
- టెండర్లు లేవు, నిబంధనలు పాటించలేదు
- నామినేషన్లు, కొటేషన్లపై పనులు కుదరదన్న ఆర్థిక శాఖ
- సీఎం సంతకం ఉంటేనే బిల్లులు చెల్లిస్తామని స్పష్టీకరణ
- ఇరుక్కోకుండా ఉండేందుకు ముఖ్యమంత్రి ఎత్తుగడ
- మంత్రివర్గంతో ఆమోదింపచేసేందుకు ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్ర మంత్రివర్గం నేడు ప్రత్యేకంగా భేటీ కానుంది. రైతుల బాధల గురించో, ఆడపడుచుల కష్టాల గురించో, రాష్ట్రాభివృద్ధి గురించో చర్చించేందుకు కాదు... మరెందుకో తెలుసా? ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నోటిమాటపై కృష్ణా పుష్కరాల పనులు చేపట్టిన సోమా కంపెనీకి నామినేషన్‌పై రూ.86 కోట్ల పనులు అప్పగించేందుకు. అదేంటీ... పనులు అప్పగించాలంటే టెండర్లు పిలవాలి కదా.. అనుకుంటున్నారా? బాబు గారి జమానాలో అలా ఉండ దు మరి. పనులేవైనా సరే... టెండర్లు పిలవకుండా తాత్సారం చేయడం, చివరకు గడువు సమీపిస్తున్నప్పుడు నామినేషన్లపై భారీ మొత్తాలకు పనులు అప్పగించి, అందినమేరకు కమీషన్లు తీసుకోవడం చంద్రబాబు సర్కారు శైలి. కృష్ణా పుష్కరాల పనుల విషయంలోనూ ఇదే తీరును అమలుచేస్తున్నారు. అలా పనులు దక్కించుకున్న అస్మదీయ సంస్థ కు బిల్లుల ఆమోదం కోసం నేడు ప్రత్యేకంగా రాష్ట్ర మంత్రివర్గం భేటీ కావడం విశేషం.
నోటిమాటపై రూ.86 కోట్ల పనులు...
పరిపాలనపరమైన అనుమతులు, టెండర్లు, శాఖలతో పని లేకుండా ముఖ్యమంత్రి నోటి మాటతో రూ.86 కోట్ల విలువైన దుర్గా పుష్కర ఘాట్ పనులను సోమా కనస్ట్రక్షన్ సంస్థ చేపట్టిన విషయం తెలిసిందే. ఇందుకు సాగునీటి శాఖ ఎటువంటి అనుమతులను ఇవ్వలేదు. అయితే ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు పుష్కర ఘాట్ పనులను కొటేషన్లు ద్వారా సోమా కనస్ట్రక్షన్‌కు అప్పగిస్తామంటూ ఆర్థిక శాఖ అనుమతికోసం ఫైలు పంపింది. ఇందుకు ఆర్థిక శాఖ ససేమిరా అంది. ఐదు లక్షల రూపాయలకన్నా ఎక్కువ విలువగల పనులకు టెండర్లను పిలవాల్సి ఉందని, పైగా రూ.86 కోట్ల విలువైన పనులను కొటేషన్లపై ఇచ్చేందుకు అంగీకరించబోమని స్పష్టం చేసింది.
నిబంధనల మేరకు టెండర్లను పిలవాల్సిందేనని ఆఫైలును సాగునీటి శాఖకు తిప్పిపంపింది. దీంతో సాగునీటి శాఖ ఇప్పటికే ఆ సంస్థ పనులు ప్రారంభించిందని ఆర్థిక శాఖ దృష్టికి తీసుకువెళ్లింది. పనులు ప్రారంభించడానికి ముందుగా వచ్చిన ఫైళ్లపై ఆర్థిక శాఖ అభిప్రాయాన్ని చెబుతుందని, ఇప్పటికే ప్రారంభించిన వాటికి ఎటువంటి ఆమోదం తెలపదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో సాగునీటి శాఖ ముఖ్యమంత్రి ద్వారా ఫైలు సర్యులేట్ చేసి ఆర్థిక శాఖ నుంచి బిల్లులను పొందాల్సి ఉంటుంది. అంటే ముఖ్యమంత్రి ఆదేశాల మేరకే సోమా సంస్థ పనులు చేపట్టినందున సంబంధిత ఫైల్లో ఆ విషయాన్ని పేర్కొనడంతో పాటు ముఖ్యమంత్రి ఆమోదం పొందాల్సి ఉంటుంది. అయితే తాను సంతకం చేస్తే భవిష్యత్తుల్లో చిక్కుల్లో పడే ప్రమాదం ఉందని పసిగట్టిన సీఎం, ఆ పనులకు మంత్రివర్గంతో ఆమోదింపచేసి అక్రమాన్ని సక్రమం చేయాలని వ్యూహం పన్నారు. ఆ మేరకు మంగళవారం కేబినెట్ సమావేశంలో నామినేషన్‌పై సోమాకు దుర్గా ఘాట్ పనులను అప్పగించేందుకు ఆమోదం తెలుపనున్నారు.
నేడు మంత్రివర్గ ప్రత్యేక సమావేశం...
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఆగస్టు 1వ తేదీ మధ్యాహ్నం మూడు గంటలకు నిర్వహించాలని గతంలోనే నిర్ణయం తీసుకున్నారు. ఆ మేరకు అన్ని శాఖలకు ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే మంగళవారం ఉదయం 10 గంటలకు మంత్రివర్గ సమావేశం ఉన్నట్లు సోమవారం ఉదయం ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి సమాచారం వచ్చింది. వచ్చే నెల 1వ తేదీన మంత్రివర్గ సమావేశం మంగళవారానికి ముందుకు జరిగిందని అధికార యంత్రాంగం భావించారు. అయితే వచ్చే నెల 1వ తేదీ మంత్రివర్గ సమావేశం యధావిధిగా ఉందని, మంగళవారం మంత్రివర్గ సమావేశం ప్రత్యేకించి కృష్ణా పుష్కరాలపైనేనని సీఎం కార్యాలయం సమాచారం అందించింది. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి టక్కర్ సోమవారం పుష్కర పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
సీఎం నోటిమాటపై రూ.86 కోట్ల విలువైన దుర్ఘ ఘాట్ పనులను చేస్తున్న సోమా కంపెనీకి నామినేషన్‌పై పనులు అప్పగించి, గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికే కేబినెట్ సమావేశం అని సమీక్షలో తేలింది. అయితే నామినేషన్‌పైన, కొటేషన్లపైన పనుల అనుమతికి ఎట్టిపరిస్థితుల్లోను అనుమతించలేమని ఆర్థిక శాఖ సీఎస్ నిర్వహించిన సమీక్షలో మరోసారి స్పష్టం చేయడం గమనార్హం. అయితే నామినేషన్‌పై పనులు అప్పగించడాన్ని మంగళవారం మంత్రివర్గంతో ఆమోదింపచేసి, బిల్లులు చెల్లించేందుకు సర్కారు సన్నద్ధమవుతోంది.