
పుట్టిన వెంటనే ఆధార్
హరియాణాలో పైలట్ ప్రాజెక్టు విజయవంతంతో ఏపీలో త్వరలో..
సాక్షి, హైదరాబాద్ : ఆధార్ కార్డు జారీలో వినూత్న విధానానికి కేంద్ర ప్రభుత్వం నాంది పలికింది. త్వరలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో పుట్టే ప్రతి బిడ్డకూ పుట్టిన 48 గంటల్లోనే ఆధార్ కార్డు ఇవ్వనున్నారు. తొలుత హరియాణాలో పెలైట్ ప్రాజెక్టుగా చేపట్టిన ఈ కార్యక్రమం విజయవంతం కావడంతో ఆంధ్రప్రదేశ్‌లో దీనిని పూర్తి స్థాయిలో ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి కేంద్ర బృందం మంగళవారం రాష్ట్ర కుటుంబ సంక్షేమశాఖ అధికారులతో సమావేశం నిర్వహించింది.
పుట్టిన వెంటనే ప్రభుత్వ ఆస్పత్రిలోనే జనన ధ్రువీకరణ (బర్త్ సర్టిఫికెట్) పత్రం ఇచ్చే ఏర్పాటు ఈ మధ్యనే చేశారు. దీంతో పాటే ఆధార్ కార్డును కూడా ఇచ్చేందుకు ప్రత్యేక ‘యాప్’ను తయారు చేస్తున్నారు. దీనికోసం రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల్లో పనిచేస్తున్న 1,700 మంది స్టాఫ్ నర్సులకు శిక్షణ ఇచ్చారు. వీళ్లందరికీ ప్రత్యేక యాప్‌తో కూడిన ట్యాబ్‌లను ఇస్తారు. ప్రసవమైన వెంటనే బిడ్డతో పాటు తల్లి పేరునూ ఆ ట్యాబ్‌లో నమోదు చేస్తారు.