ఉస్మానియా ఆస్పత్రిలో ‘భోజనామృత’ ప్రారంభం
సాక్షి, హైదరాబాద్: గ్రామీణ ప్రాంతాల్లోని నిరుపేదలు సైతం పట్టణాల్లోని పెద్ద పెద్ద ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకోవడంలో ఆరోగ్యశ్రీ ప్రధాన పాత్ర పోషించిందని, ఒక విధంగా ఇది అభివృద్ధికి సూచిక అని హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రయ్య అన్నారు. ఇలాంటి పథకాలవల్ల వైద్యసేవల్లో అసమానతలు తొలగిపోతాయన్నారు. మేఘా ఇంజనీరింగ్ ఇన్‌ఫ్రాస్ట్రకర్ (మెయిల్) సంస్థ ఇక్కడి ఉస్మానియా ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన ఉచిత ‘భోజనామృత’ కార్యక్రమాన్ని శనివారం ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడు తూ.. మనిషి జీవితంలో ఆహారం, ఆరోగ్యం ముఖ్యమైనవని, ఈ రెండూ ఉస్మానియాలో లభిస్తుండటం సంతోషకరమన్నారు. మందులు, ఆహారం లేకుండా ఎవరూ మరణించకూడదన్నారు. కార్యక్రమంలో మెయిల్ సంస్థ చైర్మన్ పీపీ రెడ్డి, హరేకృష్ణ మూవ్‌మెంట్ అధ్యక్షులు సత్య గౌర చంద్రదాస, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేష్‌కుమార్, ఉస్మానియా వైద్య కళాశాల ప్రిన్సిపాల్ డా.పి.శ్రీనివాస్, ఆస్పత్రి సూపరింటెండెంట్ డా.శివరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.