చంపేసి, ఆపై బేరసారాలు | abhay murdered in secunderabad after demanding money | Sakshi
Sakshi News home page

చంపేసి, ఆపై బేరసారాలు

Published Fri, Mar 18 2016 2:56 AM | Last Updated on Fri, Jul 12 2019 3:29 PM

చంపేసి, ఆపై బేరసారాలు - Sakshi

చంపేసి, ఆపై బేరసారాలు

► రాజధానిలో కిడ్నాపర్ల ఘాతుకం
► టెన్త్ విద్యార్థిని ఎత్తుకెళ్లి చంపేశారు
► మృతదేహాన్ని అట్టపెట్టెలో పెట్టి పడేశారు
► 10 కోట్లివ్వాలంటూ తండ్రిని బెదిరించారు
► పరిచయస్తుల పనేనని అనుమానం

 హైదరాబాద్: పదో తరగతి విద్యార్థిని గొంతు నులిమి చంపేశారు. అట్టపెట్టెలో కుక్కి పడేశారు. ఆ తర్వాత తీరిగ్గా తండ్రికి ఫోన్ చేసి, రూ.10 కోట్లివ్వాలంటూ పలుమార్లు బేరసారాలకు దిగారు! రాజధానిలో బుధవారం జరిగిన ఈ దారుణం కలకలం సృష్టించింది.

 హైదరాబాద్‌లోని షా ఇనాయత్‌గంజ్ ఓం కాలనీలో తమ్ముడి కుటుంబంతో పాటు కలిసి నివసిస్తున్న వ్యాపారవేత్త రాజ్‌కుమార్, అనురాధ దంపతులకు అభయ్ మోదానీ (16), అభిషేక్ మోదానీ కవల పిల్లలు. అబిడ్స్‌లోని స్లేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నారు. అభయ్ గురువారం సాయంత్రం 4:30 ప్రాంతంలో జ్ఞాన్‌బాగ్‌కాలనీ సీతారాంపేట్ మహాలక్ష్మి టిఫిన్ సెంటర్‌లో ఇడ్లీ, దోశ తెచ్చేందుకు ఇంటి నుంచి బయల్దేరాడు. గంట దాటినా ఇంటికి రాకపోవడంతో తల్లి ఫోన్ చేసింది. 5 నిమిషాల్లో వస్తానని బదులిచ్చాడు.

అరగంట దాటినా రాకపోవడంతో మరోసారి ఫోన్ చేయగా స్విచాఫ్ అయింది. ఆమె కంగారుపడి వెంటనే భర్తకు చెప్పింది. పరిసరాల్లో గాలించినా లాభం లేకపోవడంతో రాత్రి షా ఇనాయత్‌గంజ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు నాలుగు బృందాలతో పలుచోట్ల గాలించినా లాభం లేకపోయింది. రాత్రి పదింటికి ‘7842276480’ నంబర్ నుంచి రాజ్‌కుమార్ మరదలు కవితకు కిడ్నాపర్లమంటూ ఫోన్ వచ్చింది. రూ.10 కోట్లిస్తే కొడుకును వదిలేస్తామన్న కిడ్నాపర్, మరోసారి ఫోన్ చేసి 5 కోట్ల వరకు రాజ్‌కుమార్‌తో బేరసారాలాడాడు. అంత డబ్బులేదని రూ.7 లక్షలు, బంగారం ఇవ్వగలనని ఆయన వేడుకున్నాడు. రాత్రి 10.25కు విషయాన్ని పోలీసులకు తెలిపాడు. దాంతో వారు వేట ముమ్మరం చేశారు. కిడ్నాపర్ సికింద్రాబాద్ నుంచి మాట్లాడినట్టు ఫోన్ లోకేషన్ ఆధారంగా గుర్తించారు. నాలుగు బృందాలు అక్కడ దుండగుల కోసం గాలించాయి.

 అట్టపెట్టెలో శవమైన బాలుడు
 సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఎదురుగా అల్ఫా హోటల్ సమీపంలోని పెట్రోల్ బంకులో రాత్రి 10.30 సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఓ అట్టపెట్టె వదిలి వెళ్లడాన్ని సిబ్బంది గమనించారు. గంట తర్వాత కూడా అదక్కడే ఉండటంతో పోలీసులకు సమాచారమిచ్చారు. రాత్రి 11.30కు మారేడ్‌పల్లి పోలీసులు బాంబ్ స్క్వాడ్‌తో పరీక్షించి పెట్టె తెరిచి చూడగా బాలుడి మృతదేహం బయటపడింది. నోటికి, వెనక్కు విరిచిన చేతులకు దుండగులు ప్లాస్టర్ వేసి ప్లాస్టిక్ తాడుతో కట్టేశారు. అది అభయ్‌దని ఫొటోల ఆధారంగా గుర్తించారు. అతని జేబులోని రూ.750, చేతికున్న ఖరీదైన వాచీ అలానే ఉన్నాయి. మృతదేహాన్ని అల్ఫా వద్ద వదిలేశాక కూడా రాత్రి 11:14కు దుండగులు రాజ్‌కుమార్‌కు మళ్లీ ఫోన్ చేసి బేరసారాలకు దిగారు! ఆ సమయంలో వాళ్లు నల్లగొండ జిల్లాలో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు.

 తెలిసినవారి పనే!
 ఈ హత్య రాజ్‌కుమార్ కుటుంబానికి తెలిసిన వారి పనేనని, కక్షతోనో మరో కారణంతోనో ఘాతుకానికి ఒటిగట్టి ఉంటారని భావిస్తున్నారు. ఎందుకంటే బుధవారం సాయంత్రం ఇంటి నుంచి బయటికెళ్లిన అభయ్, కిడ్నాపర్‌గా భావిస్తున్న వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంపై వెళ్తుండటం స్థానిక సీసీ కెమెరాల్లో నమోదైంది. ఆ వాహనాన్ని కిడ్నాపర్లు దారుస్సలాం వద్ద వదిలేసి అభయ్‌ను కారులో తీసుకెళ్లినట్టు పోలీసులు భావిస్తున్నారు. కిడ్నాపర్లను అభయ్ గుర్తుపట్టిన కారణంగానే చంపేశారనుకుంటున్నారు. గురువారం గాంధీ మార్చురీలో పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబీకులకు అప్పగించారు. వారి రోదనల మధ్య అఫ్జల్‌గంజ్ శ్మశానవాటికలో అంత్యక్రియలు జరిగాయి.
 
 ఆచూకీ చెబితే రూ.లక్ష
 దుండగుల ఆచూకీ చెప్పిన వారికి రూ.లక్ష రివార్డు ఇస్తామని హైదరాబాద్ పోలీసు కమిషనర్ ఎం.మహేందర్‌రెడ్డి గురువారం రాత్రి ప్రకటించారు. అభయ్‌ను ద్విచక్ర వాహనం వెనుక ఎక్కించుకుని తీసుకువెళ్తూ సీసీ కెమెరాల్లో రికార్డు అయిన ఫీడ్ ఫొటోలను ఆయన విడుదల చేశారు. సమాచారం తెలిసిన వారు పశ్చిమ మండల డీసీపీ ఏ.వెంకటేశ్వరరావు (9490616552) లేదా నగర పోలీసు వాట్సాప్ (9490616555)లకు తెలపాలని, వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని కొత్వాల్ స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement