
యాక్టివాను ఢీకొన్న స్కార్పియో
భార్యాభర్తలకు తీవ్రగాయాలు.. భార్య పరిస్థితి విషమం
స్కార్పియోలో ఆరుగురు మైనర్లు ప్రగతినగర్ వద్ద ఘటన
హైదరాబాద్: మైనర్లు నిర్లక్ష్యంగా కారు నడిపి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టడంతో భార్యాభర్తలకు తీవ్రగాయాలరుున ఘటన కేపీహెచ్‌బీ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. హైదరాబాద్ ప్రగతినగర్‌లో ఫ్లాట్ కొనేందుకు నాగేంద్రకుమార్, దేవి యాక్టివాపై ఆదివారం సాయంత్రం బయలుదేరారు. మిథిలానగర్ వద్దకు రాగానే వీరి వాహనాన్ని వేగంగా దూసుకొచ్చిన స్కార్పియో(ఏపీ 29 ఏటీ 2799) ఢీకొట్టింది. దేవి తలకు తీవ్రగాయం కావడంతో కోమాలోకి వెళ్లగా.. నాగేంద్రకుమార్‌కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే వారిని కూకట్‌పల్లిలోని ఓమ్ని ఆస్పత్రికి తరలించారు.
కోమాలోకి వెళ్లిన దేవి పరిస్థితి విషమంగా ఉండగా.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నాగేంద్రకుమార్ కాలు, చేయి విరిగాయి. ప్రమాద సమయంలో స్కార్పియోలో ఆరుగురు 10వ తరగతి విద్యార్థులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వీరంతా పరారీలో ఉన్నారని.. కారులో ఫణీంద్ర, సాయి నిఖిల్, తేజ, మౌళి, రాములతో పాటు మరో విద్యార్థి ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. వాహనాన్ని సాయినిఖిల్ నడిపినట్లు.. వీరు నిజాంపేటలోని భాష్యం స్కూల్‌లో చదువుతున్నట్లు తెలిపారు. కాగా స్కార్పియో సాయి నిఖిల్ తండ్రిదిగా పోలీసులు గుర్తించారు.