పోలీసులపై నటి జయప్రద ఆగ్రహం
జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45లో శనివారం రాత్రి నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో సినీ నటి జయప్రద పోలీసులు, మీడియాపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తనిఖీల్లో భాగంగా ట్రాఫిక్ పోలీసులు జూబ్లీహిల్స్ రోడ్ నెం. 45లో మాదాపూర్ వైపు నుంచి ఫిలింనగర్ వైపు వెళుతున్న జయప్రద కారును ఆపి డ్రైవర్‌కు పరీక్షలు నిర్వహించారు.
డ్రైవర్ మద్యం సేవించలేదని పరీక్షల్లో వెల్లడైంది. జయప్రద సెలబ్రిటీ కావడంతో ఆమె కారు డ్రైవర్ కు మరోమారు పరీక్షలు నిర్వహిస్తే ఆ దృశ్యాన్ని చిత్రీకరిస్తామని మీడియా ప్రతినిధులు పోలీసులను కోరారు. దాంతో మరోమారు పోలీసులు బ్రీత్ ఎనలైజర్ టెస్ట్ చేయడానికి యత్నించారు. జయప్రద కారు దిగి.. సెలబ్రిటీల ఫొటోలు పెద్ద పెద్దగా వేసి తమాషా చేసేందుకే రెండోసారి టెస్టులు చేస్తున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కారును కూడా ఆపాలా అని పోలీసులను ఉద్దేశించి అన్నారు. వీడియో చిత్రీకరిస్తున్న కెమెరామెన్లపై కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు.
కాగా, శనివారం రాత్రి అయిదు చోట్ల నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీల్లో 60 కేసులు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ సందర్భంగా 43 బైక్‌లు, ఒక ఆటో, 16 కార్లు నడుపుతున్న వ్యక్తులు పట్టుబడ్డారు. వీరందరిపై కేసు నమోదు చేసి సోమవారం కౌన్సెలింగ్ నిర్వహించి మంగళవారం కోర్టులో హాజరు పరుస్తామని పోలీసులు తెలిపారు.