‘సెల్లార్‌’లకు కళ్లెం! | Addagolu control over mining | Sakshi
Sakshi News home page

‘సెల్లార్‌’లకు కళ్లెం!

Published Wed, Mar 15 2017 12:17 AM | Last Updated on Tue, Sep 5 2017 6:04 AM

‘సెల్లార్‌’లకు  కళ్లెం!

‘సెల్లార్‌’లకు కళ్లెం!

అడ్డగోలు తవ్వకాలపై నియంత్రణ
కొండాపూర్‌ ఘటనతో తేరుకున్న అధికారులు
జీవో 7పై అవగాహనకు చర్యలు
సెల్లార్లు లేకుండా నిర్మించే భవనాలకు రాయితీలు
త్వరలో జరగనున్న వర్క్‌షాప్‌లో తుది నిర్ణయం


సిటీబ్యూరో: గ్రేటర్‌ పరిధిలో భవన నిర్మాణాలకు సంబంధించిన సెల్లార్ల తవ్వకాలను నియంత్రించేందుకు జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. తరుచూ సెల్లార్లు, వాటి చుట్టూ ఏర్పాటు చేస్తున్న రక్షణ గోడలు కూలుతుండడం..ప్రాణనష్టం సంభవిస్తుండడంతో అధికారులు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవాలని  భావిస్తున్నారు.  పార్కింగ్‌ కోసం భూగర్భంలో సెల్లార్లు తవ్వకుండా స్టిల్ట్, ఆపై అంతస్తుల్లోనే పార్కింగ్‌ ఏర్పాట్లు చేసే వారికి ఆమేరకు పై అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతులివ్వనున్నారు. పార్కింగ్‌ కాకుండా వారు ఎన్ని అంతస్తులను వినియోగం కోసం నిర్మించనున్నారో.. పార్కింగ్‌ పోను అన్ని అంతస్తులకు అనుమతుల్వినున్నారు.

దీనికి  సంబంధించి గత సంవత్సరం జనవరిలోనే ప్రభుత్వం జీఓ నెంబర్‌ 7ను జారీ చేసినప్పటికీ, పెద్దగా అవగాహన లేక  చాలామంది బిల్డర్లు పట్టించుకోవడం లేదు. సదరు జీవో  మేరకు æ నిర్మాణాలు జరిపే వారికి సెట్‌బ్యాక్స్‌లో మినహాయింపులిస్తారు. భవనం మొత్తం పార్కింగ్‌ కోసమే నిర్మిస్తే సెట్‌బ్యాక్స్‌తో పాటు డెవలప్‌మెంట్‌ చార్జీలు వసూలు చేయరు. అలాగే ఆస్తిపన్ను చెల్లింపుల్లోనూ రాయితీలున్నాయి. తరచూ సెల్లార్ల ప్రమాదాలు జరుగుతూ అమాయకుల ప్రాణాలో గాల్లో కలుస్తుండటం.. తాజాగా కొండాపూర్‌ ఘటనతో తేరుకున్న అధికారులు వీటిపై బిల్డర్లకు అవగాహన కల్పించి, సెల్లార్లు తవ్వకుండా వీలైనంతమేరకు నిరోధించే యోచనలో ఉన్నారు.

సెల్లార్లకు అనుమతులిచ్చినా.. ఎంత లోతు వరకు తవ్వేందుకు అనుమతులివ్వాలి.. ఎన్ని సెల్లార్లకు అనుమతులివ్వాలనే అంశంలో త్వరలోనే తగిన నిర్ణయం తీసుకోనున్నారు. హైదరాబాద్‌ నేలను బట్టి ఎంత లోతు వరకు సెల్లార్ల కోసం తవ్వవచ్చు అనే అంశంపై కూడా నిపుణుల సూచనలు తీసుకొని అందుకనుగుణంగా అనుమతులివ్వాలని భావిస్తున్నారు. దాంతోపాటు సేఫ్టీ మెజర్స్, నేల కండీషన్‌ను బట్టి తగు నిర్ణయం తీసుకోనున్నారు. పదిమీటర్ల కంటే ఎక్కువ ఎత్తులో నిర్మించే భవనాలన్నింటికీ ఇకపై సాయిల్‌ టెస్ట్, స్టెబిలిటీ టెస్ట్‌ తప్పనిసరి చేయనున్నారు. నగరంలో ప్రస్తుతం నాలుగు సెల్లార్ల వరకు అనుమతులిస్తున్నారు. ఒక్కో సెల్లార్‌ కోసం దాదాపు మూడు మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఈ తవ్వకాల వల్ల తరచూ ప్రమాదాలు జరుగుతుండడంతో వీటిని నివారించాలని భావిస్తున్నారు. భవనం మొత్తం పార్కింగ్‌ కోసమే కడితే  ఫ్రంట్‌ సెట్‌బ్యాక్‌ మినహా మూడు వైపులా సెట్‌బ్యాక్స్‌లో  50 శాతం మినహాయింపులుంటాయి. అంతేకాకుండా ఇలాంటి భవనాలకు ఐదేళ్ల వరకు ఆస్తిపన్ను చెల్లించకుండా మారటోరియం ఉంది. ఆ తర్వాత సైతం నివాస భవనాల కేటగిరీలో అతి తక్కువ పన్ను ఎంత ఉంటే అంతమాత్రమే వసూలు చేస్తారు. అగ్నిమాపకశాఖ, ఎయిర్‌పోర్ట్‌ అథారిటీల  నుంచి ఎన్‌ఓసీలు మాత్రం తప్పనిసరి.

ప్రమాణాలు పాటించాలి..
సెల్లార్ల తవ్వకాల్లో నిర్ణీత ప్రమాణాలు పాటించాలని జీహెచ్‌ఎంసీ చీఫ్‌ సిటీ ప్లానర్‌ దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. ఇసుక బస్తాలు వినియోగించడంతోపాటు నైలింగ్, గ్రౌటింగ్‌లు చేయాలన్నారు. రెండువేల చ.మీ.లకు మించిన విస్తీర్ణంలో నిర్మించే భవనాలకే సెల్లార్లకు అనుమతులిస్తారు. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ 3 మీటర్ల సెట్‌బ్యాక్‌  వదలాలి. ఇది పై లెవెల్‌ సెల్లార్‌కు కాగా, దిగువ లెవెల్స్‌కు వెళ్లే కొద్దీ మరో 0.5 మీటర్ల చొప్పున సెట్‌బ్యాక్‌ వదలాలి.

త్వరలో వర్క్‌షాప్‌..
నగర భౌగోళిక పరిస్థితులను బట్టి అసలు సెల్లార్ల తవ్వకాలకు అనుమతులివ్వవచ్చా.. ఇస్తే ఎంత లోతు వరకు ఇవ్వాలి తదితరమైనవి నిర్ణయించేందుకు ఈనెల 17లేదా 18 తేదీల్లో జియాలజిస్టులతోపాటు స్ట్రక్చరల్‌ ఇంజినీర్లు, ప్రొఫెసర్లు  నిపుణులతో వర్క్‌షాప్‌ నిర్వహించి, తగు నిర్ణయాలు తీసుకోనున్నట్లు సీసీపీ దేవేందర్‌రెడ్డి  పేర్కొన్నారు.   ఈ మేరకు సమావేశానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నామన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement