సాక్షి, సిటీబ్యూరో : జీహెచ్‌ఎంసీలో 750 చ.మీ.లు అంతకంటే ఎక్కువ విస్తీర్ణంలో ఇళ్లు, భవనాలు నిర్మించుకోవాలనుకునేవారు దాదాపు నాలుగు నెలల పాటు తమ పనులు వాయిదా వేసుకోవాల్సిందే. దాదాపు వారం రోజుల్లో రుతుపవనాలు రానుండటంతో వర్షాకాల సమస్యలపై ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా జీహెచ్‌ఎంసీ అధికారులు సెల్లార్ల తవ్వకాలపై నిషేధం ప్రకటించారు. జూన్ 10వ తేదీనుంచి సెల్లార్ల తవ్వకాలపై నిషేధం అమల్లో ఉంటుంది. వర్షాకాలం ముగిసేంత వరకు.. దాదాపు సెప్టెంబర్ వరకు ఈ నిషేధం అమల్లో ఉంటుంది. కొత్తగా సెల్లార్ల తవ్వకంపై ఈ నిషేధాజ్ఞలు అమల్లోకి రానుండగా, ఇప్పటికే సెల్లార్ల తవ్వకాలు ప్రారంభించిన వారు అవసరమైన అన్ని ముందస్తు జాగ్రత్త చర్యల్ని తప్పనిసరిగా పాటించాల్సి ఉంది. వారు పటిష్ట భద్రతాప్రమాణాలు పాటిస్తున్నదీ లేనిది స్థానిక అసిస్టెంట్ సిటీప్లానర్లు(ఏసీపీ), డిప్యూటీ కమిషనర్లు(డీసీ)లు తనిఖీ చేస్తారు.
నిర్మాణంలోని ప్రతి సెల్లార్ తవ్వక ప్రాంతాన్ని కచ్చితంగా తనిఖీ చేయాల్సిందిగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ డా.బి.జనార్దన్‌రెడ్డి స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సెల్లార్ల తవ్వకాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై త్వరలోనే తవ్వకాలు జరిపే కాంట్రాక్టర్లకు అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహించనున్నారు. సెల్లార్ల తవ్వకాల సందర్భంగా అవసరమైన అన్ని జాగ్రత్తలు చేపట్టాలని, ఏదైనా ప్రమాదం జరిగితే అందుకు నిర్మాణదారులదే బాధ్యతని, వర్షం కురిసే సమయాల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకాలు జరపరాదని హెచ్చరిస్తున్నారు. జీహెచ్‌ఎంసీలో సెల్లార్ల తవ్వకాలకు ఇప్పటికే అనుమతి పొందిన భవనాలు దాదాపు 200 ఉన్నాయి. నిబంధనల మేరకు 750 చ.మీ.ల స్థలముంటే ఒక సెల్లార్, 1000 చ.మీ.ల స్థలముంటే రెండు సెల్లార్లు తవ్వవచ్చు. అలా.. స్థల విస్తీర్ణం పెరిగే కొద్దీ అదనపు సెల్లార్లు తవ్వవచ్చు. నగరంలో ప్రస్తుతం గరిష్టంగా నాలుగు సెల్లార్ల వరకు అనుమతులిస్తున్నారు. అనుమతుల్లేకుండానే తక్కువ స్థలంలో 200 చ.మీ.ల స్థలంలో కూడా అక్రమంగా సెల్లార్లు తవ్వుతున్న వారు కూడా ఉన్నారు.
ఒక్కో సెల్లార్ కోసం దాదాపు దాదాపు మూడు మీటర్ల లోతు తవ్వుతున్నారు. ఈ తవ్వకాల వల్ల తరచూ ప్రమాదాలు చోటు చేసుకుంటుండంతో సెల్లార్ల తవ్వకాలను నివారించాలని కూడా భావిస్తున్నారు. సెల్లార్లు తవ్వకుండా పై అంతస్తుల్లోనే పార్కింగ్ ఏర్పాట్లు చేసే వారికి ఆమేరకు అదనపు అంతస్తులు నిర్మించుకునేందుకు అనుమతులిస్తారు.
పాతగోడలు, శిథిల భవనాలపై శ్రద్ధ..
శిథిల భవనాలు, పాతగోడలు, గుట్టలు, కొండలపైనున్న భవనాల ప్రహరీల ప్రాంతాల్లోనూ అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోనున్నారు. ముఖ్యంగా స్కూల్ భవనాలు,ప్రభుత్వ భవనాలకు చెందిన ప్రహరీగోడలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు చీఫ్ సిటీ ప్లానర్ ఎస్. దేవేందర్‌రెడ్డి తెలిపారు. ప్రభుత్వ భవనాల్లో చాలా వరకు పాతవి ఉండటంతో వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోనున్నట్లు పేర్కొన్నారు. జీహెచ్‌ఎంసీలో 1100 పై చిలుకు శిథిల భవనాలుండగా,వీటిల్లో దాదాపు సగం భవనాలకు తగిన మరమ్మతులు చేస్తే సరిపోతుందన్నారు. మిగతావాటికిగాను ఇప్పటికే 364 భవనాలను కూల్చివేయగా,త్వరలో మరో 200 వరకు కూల్చివేయనున్నట్లు తెలిపారు. సికింద్రాబాద్, గోషామహల్ నియోజకవర్గాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయన్నారు.
జాగ్రత్తలు పాటించాలి ..
ఇప్పటికే అనుమతులు పొంది ప్రస్తుతం సెల్లార్లు తవ్వుతున్న వారు ప్రమాదాలకు తావులేకుండా అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సీసీపీ దేవేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. సెల్లార్ తవ్వే ప్రాంతాల్లో, ముఖ్యంగా వాలు ప్రాంతాల్లో నేల జారిపోకుండా అవసరమైన పటిష్టత చర్యలు చేపట్టాలి.ఇందుకుగాను ఇసుకబస్తాలు వినియోగించడంతోపాటు నైలింగ్, గ్రౌటింగ్‌లు చేయాలి. సెల్లార్ల తవ్వకాలకు చుట్టూ 3 మీటర్ల సెట్‌బ్యాక్ వదలాలి. ఇది పై లెవెల్ సెల్లార్‌కు కాగా, దిగువ లెవెల్స్‌కు వెళ్లే కొద్దీ అదనంగా మరో 0.5 మీటర్ల చొప్పున సెట్‌బ్యాక్ వదలాలి.
తాత్కాలికంగా రిటైనింగ్ వాల్ నిర్మించాలి. అధికబరువున్న సామాగ్రిని సెల్లార్ ప్రాంతాల్లో వేయరాదు. సెల్లార్ల సమీపంలోకి భారీ వాహనాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. సెల్లార్ తవ్వకప్రాంతాన్ని నిత్యం పరిశీలిస్తూ, ఎక్కడైనా బలహీనంగా ఉన్నా, జారిపోయేలా ఉన్నా వెంటనే తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. పగుళ్లు తదితరమైనవాటిని గుర్తించి తగిన పరిష్కార చర్యలు చేపట్టాలి. సెల్లార్ తవ్వక ప్రాంతంలోకానీ, ఇరుగుపొరుగు భవనాల్లో కానీ భూమి కదులుతున్నట్లు గ్రహిస్తే యుద్ధప్రాతిపదికన అవసరమైన చర్యలు చేపట్టాలి.
Comments
Please login to add a commentAdd a comment