డీజిల్ కార్లకు అదనపు పన్ను
- రెండో వాహనానికి మరింత వడ్డింపు
- పెట్రోలు కార్లకు మాత్రం మినహాయింపు
- ప్రభుత్వం కీలక నిర్ణయాలు.. త్వరలో ఉత్తర్వు జారీ
సాక్షి, హైదరాబాద్: డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. దేశవ్యాప్తంగా ఈ తరహా నిర్ణయాలు తీసుకుంటున్న నేపథ్యంలో తెలంగాణ ప్రభుత్వం కూడా డీజిల్ కార్ల పెరుగుదలను తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకుంది. కొద్ది రోజుల్లో ఈ మేరకు ఉత్తర్వు వెలువడనుంది. దేశ వ్యాప్తంగా వాతావరణ కాలుష్యం తీవ్రమవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో దాని పెరుగుదలకు దోహదం చేస్తున్న డీజిల్ వాహనాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకోనుంది.
సుప్రీంకోర్టు ఆదేశంతో...
దేశంలో డీజిల్ వాహనాల సంఖ్య విపరీతంగా పెరిగి వాతావరణ కాలుష్యం తీవ్రమవుతున్న నేపథ్యంలో వాటిని నియంత్రించాలని సుప్రీంకోర్టు గతంలోనే ఆదేశించింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీ సహా చాలా రాష్ట్ర ప్రభుత్వాలు డీజిల్ వాహనాలపై నియంత్రణ చర్యలు ప్రారంభించిన విషయం తెలిసిందే. మరోవైపు భారత్ స్టేజ్–3 (బీఎస్–3) వాహనాలను పూర్తిగా నిషేధిం చారు. తెలంగాణలో క్రమంగా కార్ల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. డీజిల్ ధరలను దృష్టిలో ఉంచుకుని ప్రజలు డీజిల్ కార్ల కొను గోలుకే మక్కువ చూపుతున్నారు. దీంతో ఇక్కడ కూడా వాటిపై మోజు తగ్గేలా చేసేందు కు డీజిల్ కార్లపై అదనపు పన్ను విధించాలని ప్రభుత్వం నిర్ణయించింది. త్వరలోనే ఈ నిర్ణయం అమలు చేయనున్నట్టు సమాచారం.
రెండో డీజిల్ వాహనానికి మరింత పన్ను
రెండో వాహనం కొంటే అదనపు పన్ను విధించే నిబంధనను కూడా సడలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. డీజిల్ వాహనాలకు ఈ పన్ను ను మరింతగా పెంచనున్నారు. ప్రస్తుతం రూ. 10 లక్షలు, అంతకంటే తక్కువ ధర ఉన్న కార్లకు 12 శాతం పన్ను విధిస్తున్నారు. అంతే విలువైన రెండో కారు కొంటే అదనంగా 2 శాతం పన్ను చెల్లించాలి. ఇప్పుడు పెట్రోలు కార్లకు ఈ అదనపు పన్ను ఉండదు. ప్రస్తుతం ఈ ఫైలు సీఎం కార్యాలయంలో ఉంది. సీఎం సంతకం కాగానే ఉత్తర్వు వెలువడనుంది.
‘రెండో వాహనం పన్ను’ అక్రమాలపై మళ్లీ విచారణ
‘రెండో వాహనం పన్ను’ అక్రమాలపై మళ్లీ విచారణ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. 2014–15 సంవత్సరానికి గాను రెండో వాహనం కొన్నవారికి ఈ పన్ను భారం పడకుండా కొంతమంది రవాణాశాఖ సిబ్బంది కమీషన్లు దండుకుని కథ నడిపారు. అప్పటికే ఓ వాహనం ఉందని గుర్తించే సాఫ్ట్‌వేర్ లేకపోవడం, వివరాల నమోదు లోపభూయిష్టంగా ఉండటాన్ని సిబ్బంది ‘క్యాష్’చేసుకున్నారు. దీంతో నాటి రవాణా కమిషనర్ సుల్తానియా విచారణకు ఆదేశించారు.
ఇందులో 200 వాహనాలకు పన్ను వసూలు చేయలేదని, దీనికి పది మంది బాధ్యులని గుర్తించారు. కానీ ఉన్నట్టుండి విచారణను అక్కడితో నిలిపి వేయటమే కాకుండా బాధ్యులపై చర్యలు తీసుకోలేదు. ఆ విచారణను అటకెక్కించేం దుకు సిబ్బంది తరపున కొందరు వకాల్తా పుచ్చుకుని తెరవెనక తతంగం నడిపారని తెలుస్తోంది. దీంతో ఇప్పుడు ఆ వ్యవహారం పై కూడా విచారణ జరపాలని నిర్ణయించి నట్టు సమాచారం. అసలు మధ్యలో ఆ విచారణను ఎందుకు ఆపారో తేల్చి సీఎంకు Sనివేదిక సమర్పించనున్నట్టు సమాచారం.