
మనిషి చచ్చినా.. అవి చావవు..
ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది... మెదడు కూడా పనిచేయడం లేదు...
ఒక వ్యక్తి గుండె కొట్టుకోవడం నిలిచిపోయింది... మెదడు కూడా పనిచేయడం లేదు... ఆ మనిషి చనిపోయాడని చెప్పేందుకు ఇవి చాలు.. అంతా ముగిసిపోయినట్లే అనుకుంటాం.. అయితే మన శరీరంలో జీవం మరణంతో ఆగిపోదని అంటున్నారు శాస్త్రవేత్తలు అవును.. ఇది అక్షరాలా నిజం ఈ వారం ప్రముఖ జర్నల్స్‌లో ప్రచురితమైన రెండు పరిశోధన వ్యాసాలు ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నాయి. మరణంతో శరీరంలోని చాలా అవయవాలు పనిచేయడం మానేసినా కొన్ని మాత్రం కొన్ని రోజుల పాటు పని చేస్తూనే ఉంటాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇది అవయవదానం విషయంలోనూ, మరణ సమయాన్ని నిర్వచించడంలోనూ మార్పులు తీసుకురాగలవని శాస్త్రవేత్తల అంచనా.
- సాక్షి, హైదరాబాద్
మరణించిన 12 గంటల తరువాత కూడా మనిషిలోని కొన్ని జన్యువులు క్రియాశీలకంగా ఉండటాన్ని శాస్త్రవేత్తలు గతంలోనే గుర్తించారు. వర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన మైక్రోబయాలజిస్ట్ పీటర్ నోబెల్ దీనిపై పరిశోధనలు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆయన మరణించిన ఎలుకలు, జీబ్రాఫిష్‌లలో జన్యుక్రియలు ఎలా ఉంటున్నాయో పరిశీలించారు. మరణం తరువాత కూడా వీటిల్లోని దాదాపు వెయ్యి జన్యువులు పని చేస్తూండటం మాత్రమే కాకుండా బతికి ఉన్నప్పటి కంటే ఎక్కువ క్రియాశీలకంగా ఉన్నట్లు నోబెల్ గుర్తించారు. ఎలుకల్లోనైతే మరణించిన మరుసటి రోజు కూడా దాదాపు 515 జన్యువులు పూర్తి సామర్థ్యంతో పనిచేస్తూంటే, జీబ్రాఫిష్‌లో 4 రోజుల తరువాత కూడా 548 జన్యువులు ప్రొటీన్లను ఉత్పత్తి చేస్తూనే ఉన్నాయి.
మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏ మోతాదుల్లోని హెచ్చుతగ్గులను బట్టి నోబెల్ బృందం జన్యుక్రియ కొనసాగుతూ ఉండటాన్ని గమనించగలిగారు. ఏ కణంలో ఏ ప్రొటీన్ ఉత్పత్తి కావాలన్న సమాచారం ఈ మెసెంజర్ ఆర్‌ఎన్‌ఏలో నిక్షిప్తమై ఉంటుంది. ఒక కణంలో ఈ ఆర్‌ఎన్‌ఏ ఎక్కువగా ఉంటే జన్యువులు క్రియాశీలకంగా ఉన్నట్లన్నమాట. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. బతికున్నప్పుడు అత్యవసర సమయాల్లో ఏ జన్యువులైతే ఎక్కువ క్రియాశీలకమవుతాయో వాటిల్లో అత్యధికం మరణం తరువాత కూడా అంతే చైతన్యంతో పనిచేస్తాయి. ఒత్తిడిని తగ్గించేవి, రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేసేవి, ఇన్‌ఫ్లమేషన్‌ను ప్రేరేపించేవి వీటిల్లో ఉండటం గమనార్హం. పిండ దశలో మాత్రమే ప్రొటీన్లు ఉత్పత్తి చేసిన జన్యువులు కొన్ని మరణం తరువాత మళ్లీ ఆ పనినే చేయడాన్ని తాము గమనించామని నోబెల్ అంటున్నారు.
మరణం తరువాత మళ్లీ పిండ దశ
నోబెల్ పరిశీలనలో వ్యక్తమైన జన్యువుల్లో శరీరానికి పనికొచ్చేవి మాత్రమే లేవు. కేన్సర్‌కు కారణమవుతున్న జన్యువులు మళ్లీ ప్రేరేపితమవుతున్నట్లు గుర్తించారు. దీన్నిబట్టి మరణం తరువాత శరీరం కణస్థాయిలో మరోసారి పిండ దశకు చేరుకుంటుందని అంచనా వేస్తున్నట్లు నోబెల్ తెలిపారు. ‘‘ఇది ఓ కొత్త శరీరాన్ని నిర్మించేందుకు జరుగుతున్న విఫలయత్నం కావచ్చు’’ అని అంటున్నారు. ఎలుకల్లో లేదా జీబ్రాఫిష్ ఆఖరికి మనిషిలోనూ మళ్లీ జీవం నింపేందుకు ఈ కొన్ని వందల జన్యువుల శక్తి సరిపోక పోవచ్చు గానీ ఈ మొత్తం వ్యవహారాన్ని అర్థం చేసుకోవడం వల్ల అవయవ గ్రహీతలకు మేలు చేస్తుందని అంచనా. దాతల నుంచి అవయవాలు పొందిన వారికి 32 రకాల కేన్సర్లు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. మందులతో రోగ నిరోధక వ్యవస్థను పూర్తిస్థాయిలో పనిచేయకుండా చేయడం దీనికి కారణం.
దీంతోపాటు మరణం తరువాత కూడా క్రియాశీలకంగా ఉండే జన్యువులు ఈ కేన్సర్లకు కారణం కావచ్చునని నోబెల్ అంచనా వేస్తున్నారు. నోబెల్ బృందం పరిశోధనల తాలూకూ వివరాలు ప్రసిద్ధ జర్నల్ సైన్స్ ప్రీప్రింట్ వెర్షన్‌లో ప్రచురితమయ్యాయి. అయితే నోబెల్ బృందం ఈ వ్యాసాలను ఆన్‌లైన్‌లో ప్రచురించడం ద్వారా లోటుపాట్లను గుర్తించే ప్రయత్నం చేస్తోం ది. ఎలుకలు, జీబ్రాఫిష్‌ల జన్యుక్రమానికి, మనిషికి ఎన్నో పోలికలు ఉన్నప్పటికీ మరిన్ని పరిశోధనల ద్వారా మానవుడు మరణం తరువాత కూడా కొన్ని జన్యువులు చైతన్యం తో ఉంటాయన్న విషయాన్ని రూఢీ చేసుకోవాల్సి ఉంది.