మమ్మీకి మళ్లీ ప్రాణం!
మమ్మీకి మళ్లీ ప్రాణం!
Published Tue, Jul 4 2017 2:30 AM | Last Updated on Tue, Sep 5 2017 3:06 PM
శిథిలావస్థకు చేరడంతో పరిరక్షణకు పురావస్తు శాఖ ఏర్పాట్లు.. జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ నైట్రోజన్ షోకేసు తెప్పించి అమరిక
- హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న 2 వేల ఏళ్ల నాటి మమ్మీ
- ఆక్సిజన్ కారణంగా కొన్నేళ్లుగా దెబ్బతింటున్న వైనం
- మరో 500 ఏళ్లు సంరక్షించేలా ఏర్పాట్లు
సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ఈజిప్టు మమ్మీని సంరక్షించేందుకు పురావస్తు శాఖ అత్యాధునిక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ఈ రెండు వేల ఏళ్లనాటి మమ్మీ.. కొంతకాలంగా శిథిలమవుతూ వస్తోం ది. గాలిలోని ఆక్సిజన్ వాయువు మమ్మీకి తగలడం, తద్వారా క్రిమికీటకాలు వృద్ధి చెందడమే కారణం. దీనిని గుర్తించిన పురావస్తు శాఖ జర్మనీ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ ఫ్రీ ఎయిర్‌టైట్ షోకేసు తెప్పించి.. మమ్మీని అందులో భద్రపరిచింది.
సమస్య ఏంటి?
మనిషి చనిపోయిన తర్వాత భౌతికకాయాన్ని వందల ఏళ్లపాటు భద్రపర్చడానికి మమ్మీగా మారుస్తారు. శరీరంలో వెంటనే పాడయ్యే కొన్ని భాగాలను తొలగించి.. ప్రత్యేక రసాయనాలను పూసి, ప్రత్యేక తరహా వస్త్రాన్ని గట్టిగా చుడతారు. ఇది ఈజిప్టులో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి మమ్మీ హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో ఉంది. దానికి నేరుగా ఆక్సిజన్ తగిలితే.. క్రిమికీటకాలు వృద్ధి చెంది శిథిలం చేస్తాయి. ఇన్నాళ్లూ ఈ అంశంపై అవగాహన లేక మమ్మీని సాధారణ గాజు పెట్టెలో ఉంచారు. దీంతో ఆక్సిజన్ తగలడం, నేరుగా లైట్ల కాంతి ప్రసరించటం, కాలుష్యంతో క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. దాదాపు పదేళ్ల కింద మమ్మీ నుంచి చిన్నచిన్న ముక్కలు ఊడిపోతుండడాన్ని పురావస్తుశాఖ గుర్తించింది. ఈజిప్టు నుంచి నిపుణులను పిలిపించి చూపించగా.. సంరక్షణ చర్యలు తీసుకోకుంటే కొన్నేళ్లలో మమ్మీ పూర్తిగా పాడవుతుందని వారు స్పష్టం చేశారు. ఆక్సిజన్ చొరబడని ప్రత్యేక షోకేసు ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత ఆ విషయం పెండింగ్‌లో పడిపోయింది.
రూ.58 లక్షలు వెచ్చించి..
ఇటీవల పురావస్తు శాఖ డైరెక్టర్‌గా వచ్చి విశాలాచ్చి.. మమ్మీ సంరక్షణపై దృష్టి పెట్టారు. ఢిల్లీలో రాజీవ్‌గాంధీ హత్యకు ముందు చివరిసారిగా ధరించిన వస్త్రాలు, ఇందిర హత్య సమయంలో నేలపై చిమ్మిన రక్తం మరకలను పరిరక్షించేందుకు అనుసరించిన పద్ధతులను తెలుసుకున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉన్న మమ్మీ పరిరక్షణ చర్యలను పరిశీలించారు. విదేశీ నిపుణులతో చర్చించి.. మమ్మీ సంరక్షణ కోసం జర్మనీలోని గ్లాస్ హార్న్‌బాష్ కంపెనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ షోకేసును కొనుగోలు చేశారు. రూ.58 లక్షల విలువైన ఈ పరికరంలో ఇటీవలే మమ్మీని ఉంచారు. ఈ పరికరం ఆక్సిజన్ చొరబడటాన్ని నియంత్రించడంతోపాటు నైట్రోజన్‌ను పంప్ చేస్తుంది. విద్యుత్ సరఫరా ఆగిపోతే నైట్రోజన్ పంపింగ్ నిలిచిపోకుండా ప్రత్యేక జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు.
ఐదు వందల ఏళ్ల వరకు ఢోకా ఉండదు
దేశంలో ప్రస్తుతం ఆరు మమ్మీలు ఉన్నాయి. అందులో స్టేట్ మ్యూజియంలో ఉన్న మమ్మీ ఒకటి. ఆరో నిజాం మీర్ మహమూద్ అలీఖాన్ 1920లో దీనిని ఈజిప్టు నుంచి సేకరించారు. ఈ మమ్మీ క్రీస్తుపూర్వం 100– 300 సంవత్సరాల మధ్య జీవించిన 25 ఏళ్ల యువతిది. ఆమెను ఈజిప్టు చక్రవర్తి కూతురు నౌషుషుగా చెబుతారు. మమ్మీ వస్త్రంపై ఆ వివరాలు పొందుపరిచి ఉన్నాయి. సాధారణంగా మమ్మీగా మార్చే సమయంలో శరీరం నుంచి ఇతర కొన్ని భాగాలతోపాటు మెదడును కూడా పూర్తిగా తొలగిస్తారు. కానీ ఈ మమ్మీ తలలో మూడో వంతు మెదడు భాగం అలాగే ఉంది. దానిపై పరిశోధన చేయగలిగే మంచి స్థితిలో ఉందని తేలింది. మమ్మీని పరిరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. దీనివల్ల మరో 500 ఏళ్ల వరకు దెబ్బతినకుండా ఉంటుంది..
– విశాలాచ్చి, పురావస్తు శాఖ డైరెక్టర్
Advertisement
Advertisement