Egypt mummy
-
సవతి తల్లిని పాతిపెట్టాడు సరే! మరి ఆ సమాధి?
అంతుచిక్కని విషయాలపైన ఆసక్తి నెలకొనడం సహజమే!. అలాంటి జాబితాలో ప్రముఖంగా నిలిచేది టుటన్ఖమున్ సమాధి మిస్టరీ. ప్రాచీన ఈజిప్ట్ రాజు సమాధిగా, పాఠ్యపుస్తకాల్లో కర్స్ ఆఫ్ టుటన్ఖామున్గా ఇది ఎంతో ఫేమస్. ఈ సమాధిని తవ్వి బయటకు తీసిన తర్వాతే ఎన్నో చిత్ర-విచిత్ర పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటి చుట్టూరా ఎన్నో కథలు, మరెన్నో ప్రచారాలు పుట్టుకొచ్చాయి. అదే సమయంలో ఈ సమాధి ఆధారంగా ఆసక్తికర విషయాలను కనుగొంటున్నారు చరిత్రకారులు. ► సరిగ్గా వందేళ్ల చరిత్ర ఉన్న ఈ సమాధి.. టుటంఖమన్ సమాధి అనేది చరిత్రకారులు చెప్పేమాట. కేవలం పదకొండేళ్లకు ఈజిప్ట్ ఫారోగా(చక్రవర్తి) బాధ్యతలు స్వీకరించిన టుటన్ఖమున్.. పంతొమ్మిదేళ్లకే అనుమానాస్పద రీతిలో మృతి చెందాడు(పరిశోధనల ఆధారంగా నిర్ధారణ). అతనెలా చనిపోయాడన్న విషయం.. ఇప్పటికీ మిస్టరీనే!. అయితే ఈ సమాధి మాత్రం ఎన్నో అంతుచిక్కని రహస్యాలను చేధించేందుకు పరిశోధకులకు, చరిత్రకారులకు ఒక అవకాశం ఇచ్చింది. ► సమాధిలో కుర్చీలు, రథాలు, ఖజానాలు, ఇతర విలాస వస్తువులు ఉంచారు. బంగారుమయమైన ఆ సమాధిలో ఊహించినదానికంటే ఎన్నో రెట్ల రహస్యాలు దాగి ఉండొచ్చని చరిత్రకారులు ఒక అంచనాకి వచ్చారు. ► టుటన్ఖమున్(టుటన్‌ఖాటెన్) క్రీస్తుపూర్వం 1341లో పుట్టిఉంటాడనే ఒక అంచనా ఉంది. ఈజిప్షియన్ భాష ప్రకారం.. గాలి, సూర్యుడి కలయిక పేరే టుటన్ఖమున్. చిన్నవయసులోనే శక్తివంతమైన రాజుగా అతనికి పేరు దక్కింది. కానీ, ఆ పేరుప్రఖ్యాత్యుల వల్లే అతన్ని హత్య చేసి ఉంటారని భావిస్తుండగా.. అతని చావుకి సవతి తల్లి నెఫెర్టిటికి ఏదో కనెక్షన్ ఉండి ఉంటుందని భావిస్తుంటారు చరిత్రకారులు. ► 1922లో హోవార్డ్ కార్టర్ ఈజిప్ట్ ఫారో టుటన్ఖమున్ సమాధి కనిపెట్టాడు. అయితే ఈ సమాధిని తాకిన వాళ్లు, చివరికి కథనాలు రాసిన వాళ్లు సైతం అనుమానాస్పద రీతిలో చనిపోవడం, ఏదో ఒక ప్రమాదానికి గురికావడంతో శపించబడ్డ సమాధిగా పేర్కొంటూ చాలా కాలంపాటు దాని జోలికి వెళ్లలేదు చరిత్రకారులు. అయితే.. ► కాలక్రమంలో దీనిపై పరిశోధనలు మళ్లీ మొదలయ్యాయి. విచిత్రం ఏంటంటే.. ఇప్పటివరకు కనుగొన్న ఫారోల సమాధుల్లో ఇదే చిన్నది కావడం!. దీంతో టుటన్‌ఖమూన్ నిజంగా ఫారోనేనా? అనే అనుమానాలు మొదలయ్యాయి. అయితే ఆ మిస్టరీకి సంబంధించిన ఆధారాలు దొరికాయింటూ తాజాగా బ్రిటీష్ ఈజిప్టాలజిస్టులు ముందుకు వచ్చారు. ► నెఫెర్టిటి.. అఖేనటెన్ భార్య. టుటన్ఖమున్కు సవతి తల్లి. టుటన్ఖమున్ కంటే ముందు ఈజిప్ట్‌ను పాలించింది. కానీ, ఆమె సమాధి మాత్రం ఎక్కడుందో ఇప్పటిదాకా తెలియలేదు. ► ప్రపంచంలో ఈజిప్ట్ నాగరికత మూలాలున్న ప్రతీచోటా తవ్వకాలు జరిపినా లాభం లేకుండా పోయింది. 18 ఈజిప్ట్ రాజకుటుంబాలకు చెందిన మమ్మీలకు డీఎన్ఏ టెస్టులు జరిపినా ఆ సమాధి దొరకలేదు. అయితే, నెఫెర్టిటి సమాధి వివరాలకు సంబంధించిన ఆధారం.. టుటన్ఖమున్ సమాధిలోనే దాగి ఉన్నాయని వాదన ఇప్పుడు తెరపైకి వచ్చింది. ► టుటన్ఖమున్ సమాధి పక్కనే రహస్య చాంబర్లో నెఫెర్టిటి సమాధి ఉండవచ్చని చాలా కాలం నుంచి కొన్ని వాదనలు ఉన్నాయి. అయితే.. అసలు టుటన్ఖమున్ సమాధినే.. నెఫెర్టిటి సమాధిలో భద్రపరిచారనే వాదనను ఇప్పుడు తెర మీదకు వచ్చింది. ► టుటన్ఖమున్ను అతని తర్వాతి పాలకుడు ఫారో అయ్ సమాధి చేశాడు. ఇందుకు సంబంధించిన చిత్రాల కింద మరికొన్ని చిత్రాలు ఉన్నాయని బ్రిటిష్ మ్యూజియం క్యూరేటర్‌గా గతంలో పని చేసిన నికోలస్ రీవ్స్ చెప్తున్నారు. ఆ చిత్రాల కింద.. నెఫెర్టిటిని టుటన్ఖమున్ సమాధి చేస్తున్న చిత్రాలు ఉన్నాయని రీవ్స్ చెప్తున్నాడు. ఆ తర్వాతి చిత్రాలు మమ్మీ నోరు తెరిచే కార్యక్రమం(మరణించిన వ్యక్తి ఐదు ఇంద్రియాలను పునరుద్ధరించడానికి) గురించి వివరిస్తున్నాయని పేర్కొన్నారు. ► ఎలాగైతే.. ఫారో అయ్ సమాధికి చేసిన డిజైన్ల కింద టుటన్ఖమున్ గురించిన వివరాలు ఉన్నాయో. అలాగే.. టుటన్ఖమున్ సమాధిలో నెఫెర్టిటి సమాధికి సంబంధించిన వివరాలు దాగి ఉన్నాయన్నది రీవ్స్ చెప్తున్న మాట. ► తన సవతి తల్లి నెఫెర్టిటి అంటే టుటన్ఖమున్కు అమితమైన ప్రేమ అయినా ఉండాలి. లేదంటే.. ద్వేషమైనా ఉండాలి. అందుకే ఆమె సమాధి ఎవరికీ చిక్కకుండా రహస్యంగా టుటన్ఖమున్ దాచి ఉంటాడనే భావిస్తున్నారు రీవ్స్. మరోవైపు అత్యంత శక్తివంతమైన రాణిగా నెఫెర్టిటి చరిత్రకు ఎక్కడంతో.. ఆమె సమాధిని ప్రత్యేక పరిస్థితుల్లో ఖననం చేసి ఉంటారని కూడా భావిస్తున్నారు. ► టుటన్ఖమున్ సమాధి మిగతా ఫారోలా కంటే భిన్నంగా ఉంటుంది. పైగా ఆ చాంబర్‌లోని డెకరేషన్ గోడపై మార్పులు ఉండడంతో.. అందులో రహస్య ఛాంబర్ ఉండొచ్చని, అందులోనే ఆమె సమాధిని దాచి ఉండొచ్చని ఆయన చెప్తున్నారు. ► అయితే.. టుటన్ఖమున్ సమాధి గురించి ఇలాంటి వాదనలు,రాతలు చాలా చేయొచ్చని అంటున్న రీవ్స్.. ఒకవేళ తన వాదనే నిజమైతే ఎన్నో సంవత్సరాలుగా పరిశోధనలు చేస్తున్న ప్రపంచవ్యాప్త ఆర్కియాలజిస్టుల అన్వేషణకు ఒక సమాధానం దొరకవచ్చని భావిస్తున్నారాయన. -
ఆ మమ్మీకి అరుదైన కేన్సర్ ?
వార్సా: రెండు వేల ఏళ్ల క్రితం నాటి ఈజిప్ట్ మమ్మీ అవశేషాల్లో ఒక అరుదైన కేన్సర్ ఆనవాళ్లు కనిపించాయి. 19వ శతాబ్దంలో ఈ మమ్మీని పరిశోధనల కోసం ఈజిప్టు నుంచి పోలండ్‌కు తీసుకువచ్చారు. అప్పుడే శాస్త్రవేత్తలు ఈ మమ్మీ గర్భిణిగా ఉన్నప్పుడే మరణించిందని నిర్ధారించారు. గర్భిణిగా ఉన్న ఒక ఈజిప్టు మమ్మీ లభించడం ప్రపంచంలో అదే తొలిసారి. ఆమెకు 20 ఏళ్ల వయసు ఉంటుందని, మరణించే సమయానికి 28 వారాల గర్భంతో ఉన్నట్టు తేలింది. ఇప్పుడు ఈ అరుదైన కేన్సర్ గురించి వెలుగులోకి వచ్చింది. పోలండ్‌లోని వార్సా మమ్మీ ప్రాజెక్టుకి (డబ్ల్యూఎంపీ) చెందిన శాస్త్రవేత్తలు తాము చేస్తున్న అధ్యయనాల్లో భాగంగా ఆ మమ్మీ పుర్రెకి స్కానింగ్ తీయగా ఎముకల్లో కొన్ని గాయాల గుర్తులు కనిపించాయి. నేజోఫరెంజియో అనే అరుదైన కేన్సర్ సోకే రోగుల ఎముకల్లో ఇలాంటి గురుతులే ఉంటాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ మమ్మీ అదే కేన్సర్‌తో మరణించి ఉంటుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఇది ఒకరకమైన గొంతు కేన్సర్. ముక్కు వెనుక భాగం నుంచి నోటి వెనుక భాగాన్ని కలిపి ఉంచే భాగానికి ఈ కేన్సర్ సోకుతుంది. డబ్ల్యూఎంపీ ఈ పుర్రె భాగానికి చెందిన ఫోటోలను విడుదల చేసింది. అందులో ఎముకలపై కనిపించిన కొన్ని మార్కింగ్‌లను చూస్తే అవి కేన్సర్ వల్ల ఏర్పడినవని భావిస్తున్నట్టుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు. -
మమ్మీలను తాకకుండానే పుట్టు పూర్వోత్తరాలు..!
ఈజిప్ట్ మమ్మిలు గురించి మనం కథలు కథలుగా విన్నాం. సినిమాల్లో చూశాం. అయితే శాస్త్రవేత్తలు వాటి గురించి పరిశోధనలు చేయాలంటే కచ్చితంగా చేతులతో తాకక తప్పదు. పైగా వాటిని ప్రత్యేక ద్రావణాలతో పూసి చుట్టేవారు. దీంతో వారికి ఇదంతా చాలా శ్రమతో కూడిన పనిగా ఉండేది. ఇక ఆ సమస్య ఉండదంటున్నారు. పైగా మమ్మీలను టచ్ చేయకుండానే సరికొత్త సాంకేతికత కొత్త మమ్మీఫికేషన్(మమ్మీల పుట్టు పూర్వోత్తరాలు) పద్ధతులను కనుగొన్నారు. (చదవండి: పక్షవాతంతో కుర్చీలో.. అయినా ట్విటర్లో ‘హలో వరల్డ్’ ట్వీట్! ఎలాగంటే..) అసలు విషయంలోకెళ్లితే.... 1881లో కనుగొన్న ఈజిప్ ప్రఖ్యాత ఫారో అమెన్హోటెప్ I మమ్మీ చరిత్రను డిజిటల్ సాంకేతికత సాయంతో దాని రహస్యలను చేధించారు. అంతేకాదు ఆ మమ్మీ సమాధికి ఎలాంటి భంగం కలిగించకుండా అధునాతన డిజిటల్ త్రీడీ ఇమేజరీ సాయంతో పరిశోధకులు కొత్త మమ్మీఫికేషన్ పద్ధతులను కనుగొన్నారు. పైగా కైరో యూనివర్శిటీలో రేడియాలజీ ప్రొఫెసర్ సహర్ సలీమ్, ప్రసిద్ధ ఈజిప్టు శాస్త్రవేత్త జాహి హవాస్ ఈ పరిశోధనకు నాయకత్వం వహించారు. ఈ మేరకు ప్రొఫెసర్ సలీమ్, హవాస్ మమ్మీని అమెన్హోటెప్ I మమ్మీని అధునాతన ఎక్స్-రే టెక్నాలజీ సీటీ (కంప్యూటెడ్ టోమోగ్రఫీ) స్కానింగ్ చేసి తాకాల్సిన అవసరం లేకుండా సురక్షితమైన నాన్-ఇన్వాసివ్ పద్ధతిలో డిజిటల్‌గా మార్చే అధునాతన కంప్యూటర్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్‌లను ఉపయోగించారు. ఈ పరిశోధనలో తొలిసారిగా రాజు అమెన్హోటెప్ I ముఖం, వయసు,ఆరోగ్య పరిస్థితి సంబంధించిన మమ్మిఫికేషన్ రహస్యలను వెల్లడించింది. అంతేకాదు ఆయుధాలతో మమ్మీగా చేయబడిన మొదటి ఫారో అమెన్హోటెప్ I అని పేర్కొంది. పైగా అతని మెదడు పుర్రె నుండి తొలగించలేదని తెలిపింది. పైగా ఈ మమ్మీ క్రీస్తూ పూర్వం 1500ల క్రితం నాటిదని, తన 21 సంవత్సరాల పాలనలో అనేక సైనిక ప్రచారాలను నిర్వహించిన ఫారో, 35 సంవత్సరాల వయస్సులో అనారోగ్యంతో మరణించినట్లు వెల్లడించింది. (చదవండి: లైవ్‌లో పులి వేట: నోట మాట రాక కెవ్వు కేక!) -
షాకింగ్: పురుషుడనుకుంటే.. గర్భవతని తెలిసింది
వార్సా: ఇన్నాళ్లు తాము పురుషుడిగా భావించిన ఓ ఈజిప్ట్ మమ్మీ గురించి ఆశ్చర్యకరమైన అంశాలు తెలిసి.. పురావస్తు శాస్త్రవేత్తలు షాక్ అయ్యారు. వారిని అంత ఆశ్చర్యానికి గురి చేసిన ఆ విషయం ఏంటంటే.. దాదాపు శతాబ్దానికి పైగా తాము పురుషుడిగా భావిస్తున్న మమ్మీ మహిళదని.. అందునా గర్భవతి అని తెలిసి శాస్త్రవేత్తలు ఆశ్చర్యపోయారు. ఆ వివరాలు.. 19వ శతాబ్దంలో పోలాండ్లోని నాసెంట్ యూనివర్శిటీ ఆఫ్ వార్సా పురాతన వస్తువులను సేకరించడం ప్రారంభించింది. ఆ సమయంలో పూజారిదిగా భావిస్తున్న ఓ మమ్మీని ఇక్కడకు తీసుకువచ్చారు. దాదాపు శతాబ్దానికి పైగా ఆ మమ్మీని హోర్-దేహుతి అనే పురాతన ఈజిప్టు పూజారికి చెందినదని భావించారు శాస్త్రవేత్తలు. ఈ క్రమంలో వార్సా మమ్మీ ప్రాజెక్ట్‌లోని శాస్త్రవేత్త మార్జెనా ఓజారెక్-స్జిల్కే నేషనల్ మ్యూజియంలో ఉన్న మమ్మీకి గురువారం సీటీ స్కాన్ నిర్వహిస్తుండగా ఓ అంశం ఆమెను ఆశ్యర్యానికి గురి చేసింది. ఈ సందర్భంగా ఓజారెక్-స్జిల్కే మాట్లాడుతూ.. ‘‘నేను సదరు మమ్మీ జననేంద్రియాలను పరిశీలిస్తుండగా.. లోపల నాకు చిన్న పాదం లాంటి ఆకారం కనిపించింది. దీని గురించి స్పష్టత కోసం శాస్త్రవేత్త అయిన నా భర్తను పిలిచి.. నేను గమనించని విషయం తనకు తెలిపాను. ఆయన దాన్ని పరిశీలనగా చూసి.. ‘‘అవును నీకు కనిపించింది పాదమే. ఈ మమ్మీ గర్భవతి. తన కడుపులో బిడ్డ ఉంది. ఆ పిండం వయసు 26-28 వారాల మధ్య ఉంటుంది’’ అని తెలిపారు’’ అన్నారు ఓజారెక్. ‘‘‘‘ఇన్నాళ్లు మనం పురుషుడుగా భావిస్తున్న ఈ మమ్మీ మహిళ. తన వయసు 28 నుంచి 30 ఏళ్ల మధ్య ఉంటుంది’’ అని నా భర్త తెలిపారు. ఆయన చెప్పిన విషయం నన్ను షాక్‌కు గురి చేసింది. ఎందుకంటే దాదాపు 100 ఏళ్లకు పైగా సదరు మమ్మీని పురుషుడిగా భావిస్తున్నాం. తను ఇప్పుడు మహిళ అని.. అందునా గర్భవతి అని తెలిసి చాలా షాకయ్యాం’’ అన్నారు ఓజారెక్. ఓజారెక్ మాట్లాడుతూ.. ‘‘సదరు మహిళ మృతికి కారణం సరిగా తెలియలేయడం లేదు. కాకపోతే గర్భం వల్లనే ఆమె మరణించి ఉంటుందని భావిస్తున్నాం. ఈ కాలంలో అయితే మన దగ్గర ఆధునిక వైద్యం అందుబాటులో ఉంది. గర్భవతిగా ఉన్నప్పుడు ఏ సమస్యనైనా ముందుగా తెలుసుకునే వాళ్లం. కానీ అప్పట్లో అలా కాదు. పైగా మూఢనమ్మకాలు ప్రబలంగా ఉండేవి. ఇక ఈ మమ్మీ స్త్రీ అని.. అందునా గర్భవతి అని తెలిసిన నాటి నుంచి అనేక ప్రశ్నలు తలెత్తున్నాయి. పురాతన ఈజిప్టు సమాజంలో మహిళల జీవిన విధానం ఎలా ఉండేది.. ఈజిప్టు మతాచారాల ప్రకారం పిల్లలను ఎలా చూసేవారు.. గర్భంలోని పిండానికి కూడా పునర్జన్మ, ఆత్మ వంటివి వర్తిస్తాయని భావించేవారా వంటి తదితర విషయాల గురించి అధ్యాయనం చేయాల్సి ఉంది’’ అని ఓజారెక్ తెలిపారు. చదవండి: 3 వేల ఏళ్ల తర్వాత బయటపడిన ‘బంగారు నగరం’ -
2వేల ఏళ్ల నాటి మమ్మీ: నోట్లో బంగారు నాలుక
కైరో: ఈజిప్టులో జరుపుతున్న పురావస్తు తవ్వకాల్లో 2వేల ఏళ్ల నాటి మమ్మి బయటపడింది. ఈజిప్టులో మమ్మీలు బయటపడటం సహజమే కదా ఇందులో వింతేముంది అనుకుంటున్నారా. కానీ ఈసారి బయటపడిన మమ్మీ బంగారు నాలుకతో ఉంది. అది చూసి అధికారులు అవాక్కయ్యారు. దీంతో మమ్మీ ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేయడంతో వైరల్‌గా మారాయి. వివరాలు.. ఈజిప్టులోని తపోరిస్ మగ్నా ప్రాంతంలో పురావస్తు పర్యాటక శాఖ అధికారులు తవ్వకాలు జరుపుతున్నారు. ఈ క్రమంలో ఓ మమ్మీ బయటపడింది. అయితే దాని నోటిలో బంగారు నాలుక ఉండటంతో శాస్త్రవేత్తలు దానిపై పరిశోధన జరపగా ఇది 2వేల ఏళ్ల నాటిదిగా తేలింది. అయితే ఈ వ్యక్తి చనిపోయినప్పుడు అతడిని మమ్మీగా మార్చేందుకు ఈ బంగారు నాలుకను నోటీ మీద ఉంచి ఉంటారని, కాలక్రమేణా అది నోట్లోకి జారి ఉంటుందని అధికారులు అభిప్రాయపడుతున్నారు. అయితే ‘ఈజిప్టులో మరణం తర్వాత వారు ఖచ్చితంగా మళ్లీ పుడతారని అక్కడి వారి నమ్మకం. బహుశా ఆ నమ్మకంతోనే మరో జన్మలో కూడా ఈ వ్యక్తి మాట్లాడాలనే ఉద్దేశంతో బంగారు నాలుకను పెట్టడం అక్కడి సంప్రాదాయమని’ అధికారులు ప్రకటనలో పేర్కొన్నారు. -
మమ్మీకి మళ్లీ ప్రాణం!
శిథిలావస్థకు చేరడంతో పరిరక్షణకు పురావస్తు శాఖ ఏర్పాట్లు.. జర్మనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ నైట్రోజన్ షోకేసు తెప్పించి అమరిక - హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న 2 వేల ఏళ్ల నాటి మమ్మీ - ఆక్సిజన్ కారణంగా కొన్నేళ్లుగా దెబ్బతింటున్న వైనం - మరో 500 ఏళ్లు సంరక్షించేలా ఏర్పాట్లు సాక్షి, హైదరాబాద్: దక్షిణ భారతదేశంలో ఉన్న ఏకైక ఈజిప్టు మమ్మీని సంరక్షించేందుకు పురావస్తు శాఖ అత్యాధునిక ఏర్పాట్లు చేసింది. హైదరాబాద్ స్టేట్ మ్యూజియంలో ఉన్న ఈ రెండు వేల ఏళ్లనాటి మమ్మీ.. కొంతకాలంగా శిథిలమవుతూ వస్తోం ది. గాలిలోని ఆక్సిజన్ వాయువు మమ్మీకి తగలడం, తద్వారా క్రిమికీటకాలు వృద్ధి చెందడమే కారణం. దీనిని గుర్తించిన పురావస్తు శాఖ జర్మనీ నుంచి ప్రత్యేక ఆక్సిజన్ ఫ్రీ ఎయిర్‌టైట్ షోకేసు తెప్పించి.. మమ్మీని అందులో భద్రపరిచింది. సమస్య ఏంటి? మనిషి చనిపోయిన తర్వాత భౌతికకాయాన్ని వందల ఏళ్లపాటు భద్రపర్చడానికి మమ్మీగా మారుస్తారు. శరీరంలో వెంటనే పాడయ్యే కొన్ని భాగాలను తొలగించి.. ప్రత్యేక రసాయనాలను పూసి, ప్రత్యేక తరహా వస్త్రాన్ని గట్టిగా చుడతారు. ఇది ఈజిప్టులో ఎక్కువగా కనిపిస్తుంది. అలాంటి మమ్మీ హైదరాబాద్‌లోని స్టేట్ మ్యూజియంలో ఉంది. దానికి నేరుగా ఆక్సిజన్ తగిలితే.. క్రిమికీటకాలు వృద్ధి చెంది శిథిలం చేస్తాయి. ఇన్నాళ్లూ ఈ అంశంపై అవగాహన లేక మమ్మీని సాధారణ గాజు పెట్టెలో ఉంచారు. దీంతో ఆక్సిజన్ తగలడం, నేరుగా లైట్ల కాంతి ప్రసరించటం, కాలుష్యంతో క్రమంగా శిథిలమవుతూ వచ్చింది. దాదాపు పదేళ్ల కింద మమ్మీ నుంచి చిన్నచిన్న ముక్కలు ఊడిపోతుండడాన్ని పురావస్తుశాఖ గుర్తించింది. ఈజిప్టు నుంచి నిపుణులను పిలిపించి చూపించగా.. సంరక్షణ చర్యలు తీసుకోకుంటే కొన్నేళ్లలో మమ్మీ పూర్తిగా పాడవుతుందని వారు స్పష్టం చేశారు. ఆక్సిజన్ చొరబడని ప్రత్యేక షోకేసు ఏర్పాటు చేయాలని సూచించారు. తర్వాత ఆ విషయం పెండింగ్‌లో పడిపోయింది. రూ.58 లక్షలు వెచ్చించి.. ఇటీవల పురావస్తు శాఖ డైరెక్టర్‌గా వచ్చి విశాలాచ్చి.. మమ్మీ సంరక్షణపై దృష్టి పెట్టారు. ఢిల్లీలో రాజీవ్‌గాంధీ హత్యకు ముందు చివరిసారిగా ధరించిన వస్త్రాలు, ఇందిర హత్య సమయంలో నేలపై చిమ్మిన రక్తం మరకలను పరిరక్షించేందుకు అనుసరించిన పద్ధతులను తెలుసుకున్నారు. ముంబైలోని ఛత్రపతి శివాజీ మ్యూజియంలో ఉన్న మమ్మీ పరిరక్షణ చర్యలను పరిశీలించారు. విదేశీ నిపుణులతో చర్చించి.. మమ్మీ సంరక్షణ కోసం జర్మనీలోని గ్లాస్ హార్న్బాష్ కంపెనీ నుంచి ఆక్సిజన్ ఫ్రీ షోకేసును కొనుగోలు చేశారు. రూ.58 లక్షల విలువైన ఈ పరికరంలో ఇటీవలే మమ్మీని ఉంచారు. ఈ పరికరం ఆక్సిజన్ చొరబడటాన్ని నియంత్రించడంతోపాటు నైట్రోజన్‌ను పంప్ చేస్తుంది. విద్యుత్ సరఫరా ఆగిపోతే నైట్రోజన్ పంపింగ్ నిలిచిపోకుండా ప్రత్యేక జనరేటర్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఐదు వందల ఏళ్ల వరకు ఢోకా ఉండదు దేశంలో ప్రస్తుతం ఆరు మమ్మీలు ఉన్నాయి. అందులో స్టేట్ మ్యూజియంలో ఉన్న మమ్మీ ఒకటి. ఆరో నిజాం మీర్ మహమూద్ అలీఖాన్ 1920లో దీనిని ఈజిప్టు నుంచి సేకరించారు. ఈ మమ్మీ క్రీస్తుపూర్వం 100– 300 సంవత్సరాల మధ్య జీవించిన 25 ఏళ్ల యువతిది. ఆమెను ఈజిప్టు చక్రవర్తి కూతురు నౌషుషుగా చెబుతారు. మమ్మీ వస్త్రంపై ఆ వివరాలు పొందుపరిచి ఉన్నాయి. సాధారణంగా మమ్మీగా మార్చే సమయంలో శరీరం నుంచి ఇతర కొన్ని భాగాలతోపాటు మెదడును కూడా పూర్తిగా తొలగిస్తారు. కానీ ఈ మమ్మీ తలలో మూడో వంతు మెదడు భాగం అలాగే ఉంది. దానిపై పరిశోధన చేయగలిగే మంచి స్థితిలో ఉందని తేలింది. మమ్మీని పరిరక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేశాం. దీనివల్ల మరో 500 ఏళ్ల వరకు దెబ్బతినకుండా ఉంటుంది.. – విశాలాచ్చి, పురావస్తు శాఖ డైరెక్టర్ -
అది అతి పిన్న పిండస్థ మమ్మీ
కైరో: చనిపోయినవారు ఏదో ఒకరోజు తిరిగి ప్రాణం పోసుకుంటారనే విశ్వాసంతో మృతదేహాలను మమ్మీలుగా భద్రపరిచే సంస్కతి ఈజిప్టు నాగరికతలో ఉందనే విషయం మనందరికి తెల్సిందే. అత్యంత పిన్న పిండస్థ దశ నుంచే మృతదేహాలను భద్రపరుస్తారనే కొత్త విషయం ఇప్పుడు బయటపడింది. క్రీస్తుపూర్వం 624–625 కాలంనాటి అతి చిన్న మమ్మీ రహస్యాన్ని వారు ఇప్పుడు ఛేదించారు. ఇంతకాలం మ్యూజియంలో భద్రపర్చిన ఆ చిన్న మమ్మీని అత్యాధునిక ఎక్స్‌రే పరికరాన్ని ఉపయోగించి అది 16 నుంచి 18 వారాల గర్భస్థ శిశువు మమ్మీదని తేల్చినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరాతత్వ శాస్త్రవేత్తలు బుధవారం నాడు ప్రకటించారు. ఈ చిన్న మమ్మీని ఈజిప్టులోని గిజా నగరంలో జరిపిన తవ్వకాల్లో 1907లో బయట పడింది. అది దేవదారు కలపతో తయారు చేసింది. మమ్మీని చెడగొట్టకుండానే అందులోని శిశువు ప్రాయాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఇంతకాలం దాన్ని అలాగే భద్రపర్చి ఉంచారు. పిరమిడ్స్ లోపలి రహస్య అరలను, మమ్మీలలోపలి మృతదేహాలను బయటి నుంచే కనుగొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇలాంటి రహస్యాలను ఇప్పుడు ఛేదించేందుకు ఉపక్రమిస్తున్నారు. ఆ మమ్మీ చేతులు, కాళ్లు, వెన్నుపూస ప్రాంతం బాగానే ఉన్నప్పటికీ ముఖ భాగం, కటి వలయం దెబ్బతిన్నట్టు ఎక్స్‌రేలో వెల్లడైంది. వాస్తవానికి పిండస్థ మమ్మీలను శాస్త్రవేత్తలు కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. 25 నుంచి 37 వారాలలోపు పిండస్థ మమ్మీలను ఇదివరకే కనుగొన్నారు. అయితే 16 నుంచి 18 వారాలలోపు మమ్మీని కనుగొనడం మాత్రం ఇదే మొదటిసారి. మిస్ క్యారేజీ వల్ల పుట్టిన ఈ మృతశిశువును కూడా వారు మమ్మీగా మార్చారంటే పిండస్థ దశ నుంచే వారు మనిషి ప్రాణానికి ఎంతో విలువనిచ్చారనే విషయం స్పష్టమవుతోందని కేంబ్రిడ్డి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు.