కైరో: చనిపోయినవారు ఏదో ఒకరోజు తిరిగి ప్రాణం పోసుకుంటారనే విశ్వాసంతో మృతదేహాలను మమ్మీలుగా భద్రపరిచే సంస్కతి ఈజిప్టు నాగరికతలో ఉందనే విషయం మనందరికి తెల్సిందే. అత్యంత పిన్న పిండస్థ దశ నుంచే మృతదేహాలను భద్రపరుస్తారనే కొత్త విషయం ఇప్పుడు బయటపడింది. క్రీస్తుపూర్వం 624–625 కాలంనాటి అతి చిన్న మమ్మీ రహస్యాన్ని వారు ఇప్పుడు ఛేదించారు. ఇంతకాలం మ్యూజియంలో భద్రపర్చిన ఆ చిన్న మమ్మీని అత్యాధునిక ఎక్స్‌రే పరికరాన్ని ఉపయోగించి అది 16 నుంచి 18 వారాల గర్భస్థ శిశువు మమ్మీదని తేల్చినట్లు కేంబ్రిడ్జ్ యూనివర్శిటీకి చెందిన పరాతత్వ శాస్త్రవేత్తలు బుధవారం నాడు ప్రకటించారు.
ఈ చిన్న మమ్మీని ఈజిప్టులోని గిజా నగరంలో జరిపిన తవ్వకాల్లో 1907లో బయట పడింది. అది దేవదారు కలపతో తయారు చేసింది. మమ్మీని చెడగొట్టకుండానే అందులోని శిశువు ప్రాయాన్ని కనుగొనాలనే ఉద్దేశంతో శాస్త్రవేత్తలు ఇంతకాలం దాన్ని అలాగే భద్రపర్చి ఉంచారు. పిరమిడ్స్ లోపలి రహస్య అరలను, మమ్మీలలోపలి మృతదేహాలను బయటి నుంచే కనుగొనే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి రావడంతో ఇలాంటి రహస్యాలను ఇప్పుడు ఛేదించేందుకు ఉపక్రమిస్తున్నారు. ఆ మమ్మీ చేతులు, కాళ్లు, వెన్నుపూస ప్రాంతం బాగానే ఉన్నప్పటికీ ముఖ భాగం, కటి వలయం దెబ్బతిన్నట్టు ఎక్స్‌రేలో వెల్లడైంది.
వాస్తవానికి పిండస్థ మమ్మీలను శాస్త్రవేత్తలు కనుగొనడం ఇదే మొదటిసారి కాదు. 25 నుంచి 37 వారాలలోపు పిండస్థ మమ్మీలను ఇదివరకే కనుగొన్నారు. అయితే 16 నుంచి 18 వారాలలోపు మమ్మీని కనుగొనడం మాత్రం ఇదే మొదటిసారి. మిస్ క్యారేజీ వల్ల పుట్టిన ఈ మృతశిశువును కూడా వారు మమ్మీగా మార్చారంటే పిండస్థ దశ నుంచే వారు మనిషి ప్రాణానికి ఎంతో విలువనిచ్చారనే విషయం స్పష్టమవుతోందని కేంబ్రిడ్డి విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు అంటున్నారు.