సాక్షి, హైదరాబాద్: సాగుకు యోగ్యం కాని భూములకూ ‘పెట్టుబడి’సాయం అందజేయాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఆయా భూములున్న రైతులకు పెట్టుబడి సాయం అవసరం లేదని మంత్రివర్గ ఉపసంఘం చేసిన సిఫార్సును వెనక్కు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ వర్గాలు తెలిపాయి. ఒకట్రెండు శాతం కూడా లేని అలాంటి భూములకు పెట్టుబడి సాయం నిలిపివేస్తే రైతుల నుంచి వ్యతిరేకత వస్తుందన్న భావనతో ఈ నిర్ణయానికి వచ్చినట్లు వ్యవసాయాధికారులు చెబుతున్నారు.
ఈ నేపథ్యంలో ఆ భూములను గుర్తించేందుకు చేపట్టిన సర్వేను వ్యవసాయ శాఖ నిలిపివేసింది. సాగుకు యోగ్యం కాని భూములకు పెట్టుబడి సాయం చేయకూడదన్న సిఫార్సుపై మొదటి నుంచీ ముఖ్యమంత్రి అంత సుముఖంగా లేరు. పైగా ఈ నిర్ణయంపై రైతుల నుంచి వ్యవసాయ శాఖకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో సీఎం కలగజేసుకుని అందరికీ పెట్టుబడి సొమ్ము ఇవ్వాలని, కొర్రీలు వెతకొద్దని అధికారులను ఆదేశించినట్లు సమాచారం.
వచ్చే ఖరీఫ్, రబీ సీజన్లకు కలిపి రూ.12 వేల కోట్లు పెట్టుబడి కింద ఖర్చు చేస్తున్నప్పుడు రెండుమూడు లక్షల ఎకరాలున్న సాగుకు యోగ్యం కాని భూములపై వివాదం సరి కాదనే భావనలో సీఎం ఉన్నట్లు తెలిసింది. దీంతో ఆ భూములు ఉన్న రైతులకు కూడా ఖరీఫ్, రబీలకు కలిపి ఎకరాకు రూ.8 వేల చొప్పున సాయం అందనుంది.
సాగు చేస్తామంటున్న రైతులు
రాష్ట్రంలో 1.65 కోట్ల ఎకరాల వ్యవసాయ భూమి ఉందని రెవెన్యూ శాఖ తేల్చి చెప్పింది. దాదాపు 72 లక్షల మంది రైతులు ఉన్నారని నిర్ధారణకు వచ్చింది. అయితే ఆ భూముల్లో చాలాచోట్ల రైతులు సాగు చేయడం లేదని తేలింది. కొన్నిచోట్ల కొండలు, గుట్టలతో భూమి ఉంది. చెరువుల్లోనూ పట్టా భూమి ఉన్న వారు ఉన్నట్లు వెల్లడైంది.
ఈ పరిస్థితుల్లో అలాంటి వారికి పెట్టుబడి రాయితీ ఇవ్వడం వల్ల ఇతర రైతుల్లో వ్యతిరేకత వస్తుందని, వాటికి ఇవ్వకూడదని కొందరు మంత్రులు ఉపసంఘంలో చర్చ లేవదీసిన సంగతి తెలిసిందే. భూమిని సాగు చేస్తున్నట్లు రైతుల నుంచి డిక్లరేషన్ తీసుకోవాలని కూడా కొందరు సూచించారు. అయితే ఉపసంఘం నిర్ణయంపై రైతుల నుంచి వ్యతిరేకత వచ్చింది. ధనిక రైతులకు పెట్టుబడి సాయం చేస్తున్నప్పుడు సాగుకు యోగ్యం కాని భూములకు ఇస్తే నష్టమేంటని ఫిర్యాదు చేశారు.
వ్యవసాయ యోగ్యంకాని కొండలు, గుట్టలున్న భూములను పెట్టుబడి సొమ్ముతో బాగు చేసి సాగు భూములుగా సిద్ధం చేస్తామని రైతులు హామీ ఇచ్చారు. గుట్టలపై సీతాఫలం వంటి కొన్ని రకాల ఉద్యాన పంటలనూ సాగు చేసేందుకు వీలుందని చెబుతున్నారు. ఈ విన్నపాలు ప్రభుత్వం దృష్టికి వెళ్లాయి.
ఆ సర్వేపైనా విముఖత
మరోవైపు సాగుకు యోగ్యం కాని భూములపై వ్యవసాయ శాఖ చేపట్టిన సర్వేనూ గ్రామాల్లో రైతులు వ్యతిరేకించారు. సాగుకు యోగ్యం కాదని తేలినా వారు అంగీకరించడంలేదు. దీంతో రెవెన్యూ, వ్యవసాయ అధికారులు, సర్పంచి, కార్యదర్శి, ఇతర పెద్దల సమక్షంలో అది సాగు భూమా కాదా అని క్షేత్రస్థాయి సర్వే చేసి నిర్ధారిస్తున్నారు.
ఈ ప్రక్రియపై రైతుల్లో వ్యతిరేకత రావడంతో సాగుకు యోగ్యంకాని భూములను గుర్తించడం కష్టతరంగా మారింది. నిర్ధారణలో తేడాలు వచ్చినా రాజకీయ దుమారం తప్పదని సర్కారు గ్రహించింది. ఎన్ని భూములను సర్వే చేయగలరు? వాటి నిర్ధారణ సాధ్యమేనా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దీంతో అన్ని రకాల వ్యవసాయ భూములకూ పెట్టుబడి సాయం చేయడమే మంచిదనే నిర్ణయానికి సర్కారు వచ్చింది. ఆ మేరకు మార్గదర్శకాలు ఖరారు చేసే అవకాశముంది.
Comments
Please login to add a commentAdd a comment