ఈ కౌలు రైతు పేరు బోయ రాము. నిండా 26 ఏళ్లు లేవు. కరువు, దుర్భిక్షానికి మారుపేరుగా నిలుస్తున్న అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం పెద ముష్టూరు. బతుకు మీద ఆశ, బతికి తీరాలనే సంకల్పం కొద్దీ ఎక్కడెక్కడి నుంచో అప్పులు తెచ్చి మూడెకరాలు సాగు చేసేవాడు. రాము పంట వేయడం, వాన ముఖం చాటేయడం.. కొత్త అప్పులు చేసి మళ్లీ మళ్లీ ఏడాది విత్తనాలేయటం.. కరువు షరామామూలే అన్నట్టు నాలుగేళ్లుగా ఇదే తీరు. అప్పు కొండలా పెరిగి పోయింది. ఆ కొండ గుండెల మీద బరువుగా మారింది. పంట మీద చల్లాల్సిన పురుగుమందును గొంతులో పోసుకున్నాడు.ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయ సంక్షోభం తీవ్రతకు రాము మరణం ఒక నిదర్శనం. నాలుగేళ్లుగా భరోసా దొరకని రైతులు బలవంతంగా ప్రాణాలను తీసుకుంటూనే ఉన్నారు. ప్రభుత్వానికి పట్టడం లేదు.
ఆ చావులు పాలకులను తాకడం లేదు. ఆ కుటుంబాల ఏడుపులు ప్రతిపక్ష నాయకుడి గుండెని తాకాయి. అన్నదాతలకు వెన్నుగా ఉంటానన్నారు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి. రైతు భరోసా ప్రకటించారు. పెట్టుబడిసాయం అందిస్తానని రైతుకి ధైర్యాన్నిచ్చారు. రైతులకే కాదు సమాజంలో ప్రతిరంగానికి వరాలజల్లులాంటి నవరత్నాలను ప్రకటించారు. అందులో ఒక రత్నమే వైఎస్సార్ రైతు భరోసా. వైఎస్సార్ రైతు భరోసాలో భాగంగా ‘పెట్టుబడి సాయం’ పథకాన్ని 2017 జూలైలో పార్టీ ప్లీనరీలో ప్రకటించారు జగన్‌మోహన్‌రెడ్డి. ఇప్పుడు అనేకమంది పాలకులు ఆ బాటలో నడుస్తున్నారు.
ప్రతి రైతుకు తోడుగా..
వైఎస్ జగన్ అధికారంలోకి వస్తూనే.. రైతు కుటుంబాలన్నింటికీ ఏటా రూ.12,500 చొప్పున పెట్టుబడి సాయం ఇస్తారు. నాలుగేళ్ల కాలానికి మొత్తం రూ.50 వేలను పెట్టుబడి సాయంగా అందిస్తారు. ఈ మొత్తాన్ని ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి ముందే మే నెలలో నేరుగా రైతుల చేతికిస్తారు. పెట్టుబడి సాయం ప్రతి అన్నదాతకూ తోడుగా ఉంటుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నాటి స్వర్ణయుగాన్ని తెస్తుంది. కులం, మతం, ప్రాంతం, వర్గం, పార్టీలు, రాజకీయాలకు తావు లేకుండా ప్రతి ఒక్కరికీ అందుతుంది. ఇటీవలి లెక్కల ప్రకారం రాష్ట్రంలో 76.21 లక్షల రైతు కుటుంబాలు ఉన్నాయి. రాష్ట్రంలో 5 ఎకరాల లోపు ఉన్న రైతులు దాదాపు 66 లక్షల కుటుంబాలు ఉన్నాయి. పెట్టుబడి సాయం ప్రైవేటు వడ్డీల బారి నుంచి రైతులను కాపాడుతుంది. ప్రైవేటు వ్యాపారుల నుంచి 3, 4 రూపాయల వడ్డీకి అప్పు తెచ్చి సాగు చేయాల్సిన దుస్థితి తప్పుతుంది.
దీంతో పాటు జీరో వడ్డీ, పావలా వడ్డీ కింద రైతులకు రుణాలు ఇచ్చేలా వైఎస్ జగన్ చర్యలు తీసుకుంటారు. ఆ పథకాల కింద బ్యాంకులకు ఎంత మొత్తం జమ చేయాలో బడ్జెట్‌లో కేటాయింపులు చేసి సున్నా, పావలా వడ్డీలకు రుణాలు వచ్చేలా చూస్తారు. ఈ పథకం దేశానికే దిక్సూచిగా నిలుస్తోంది. వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి ఈ పథకాన్ని ప్రకటించినప్పుడు అపహాస్యం చేసిన వారే ఇప్పుడు వేనోళ్ల కీర్తిస్తున్నారు. తెలంగాణ, ఒడిశా ప్రభుత్వాలు గత ఏడాది నుంచి పెట్టుబడి సాయం ఇస్తుండగా.. తాజాగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బడ్జెట్‌లలో ప్రకటించాయి. వైఎస్‌ఆర్ నాటి స్వర్ణయుగాన్ని తేవడానికి ఆయన తనయుడు జగన్ వేసిన ఓ ముందడుగే వైఎస్సార్ రైతు భరోసా.
Comments
Please login to add a commentAdd a comment