బడ్జెట్‌పై చర్చలో అక్బరుద్దీన్ విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: నల్లా బిల్లులు, విద్యుత్, బస్సు చార్జీలు, ఆస్తి పన్నులు పెంచే ఆలోచనలను విరమించుకోవాలని.. ప్రజలపై భారం వేయబోమని హామీ ఇవ్వాలని శాసనసభలో ఎంఐఎం పక్షనేత అక్బరుద్దీన్ ఒవైసీ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. లేనిపక్షంలో జీహెచ్‌ఎంసీ, వరంగల్, ఖమ్మంలో టీఆర్‌ఎస్‌ను గెలిపించినందుకు ప్రజలు బాధపడాల్సి వస్తుందని చురకలు అంటించారు. బడ్జెట్‌పై సాధారణ చర్చ సందర్భంగా శనివారం శాసనసభలో అక్బరుద్దీన్ మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం సమీకరించిన అప్పులు ఎన్ని, వడ్డీ రేటు ఎంతో తెలపాలని డిమాండ్ చేశారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రానికి కొత్త శాసనసభ, సచివాలయం, ఐఏఎస్‌ల నివాసాలకు కొత్త భవనాలు అవసరమేనని... అయితే అవి ఇప్పుడే నిర్మించాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కొత్తవి నిర్మించేందుకయ్యే ఖర్చును ప్రజల సంక్షేమం, అభివృద్ధికి మళ్లిస్తే మెరుగైన ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.
సూచనలుగా తీసుకోండి..
తాను ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నానని భావించవద్దని.. సూచనలు, సలహాలుగా తీసుకోవాలని అక్బరుద్దీన్ పేర్కొన్నారు. ప్రభుత్వంపై, సీఎం కేసీఆర్ హామీలపై నమ్మకంతోనే మిత్రపక్షంగా ఉన్నామని చెప్పారు. చారిత్రక ఉస్మానియా ఆస్పత్రి భవనాన్ని పరిరక్షించాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీల సంక్షేమానికి కనీసం 50 శాతం నిధులు ఖర్చు చేసిన ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి కేవలం 32 శాతం ఖర్చు చేయడం దారుణమన్నారు.
బడ్జెట్ నిండా భ్రమలు: రాజయ్య
బడ్జెట్ నిండా అవాస్తవికతే ఉందని.. ప్రజల మధ్య సామాజిక, ఆర్థిక అంతరాలను మరింత పెంచేలా ఉందని సీపీఎం శాసనసభాపక్ష నేత సున్నం రాజయ్య విమర్శించారు. జనాభాలో 90 శాతంగా ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారి టీలు, వికలాంగులను విస్మరించారని మండిపడ్డారు. బీసీ, మైనారిటీలకు ఉప ప్రణాళిక రూపొందించాలని, గిరిజనులకు 10శాతం రిజర్వేషన్లు, జిల్లాకో ఐటీడీఏ, గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీని రూపొందించాలని కోరారు.
ఇంతమంది పేదలా?: రవీంద్రకుమార్
రాష్ట్ర తలసరి ఆదాయం పెరిగిందని ప్రభుత్వం చూపెట్టినా ఇంత మంది పేదలెందుకు ఉన్నారని సీపీఐ నేత రవీంద్ర కుమార్ ప్రశ్నించారు. రైతులకు ఒకేసారి రుణ మాఫీ చేయాలన్నారు.
విద్యుత్‌పై ఆరోపణలు తగవు: గాదరి
జెన్‌కోలో ఉత్పత్తిని తగ్గించి ప్రైవేటు కంపెనీల నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్నారన్న విపక్ష నేత కె.జానారెడ్డి ఆరోపణలపై టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే గాదరి కిశోర్ మండిపడ్డారు. గ్యాస్ కేటాయింపులు లేక విద్యుదుత్పత్తి చేయని ప్రైవేటు కంపెనీలకు 17 ఏళ్లుగా డబ్బులు చెల్లిస్తున్నారని, అది గత ప్రభుత్వాలు చేసిన తప్పిదమేనని పేర్కొన్నారు.
సామాన్యుల పక్షంగా లేదు:కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి
దళితులు, బలహీనవర్గాల సంక్షేమానికి కేటాయింపులు లేని తాజా బడ్జెట్.. సామాన్యుల పక్షంగా లేదని కాంగ్రెస్ ఎమ్మెల్సీ రంగారెడ్డి అన్నారు. ఆర్ధిక మంత్రి ఈటల రాజేందర్ స్వభావానికి విరుద్ధంగా, కాంట్రాక్టర్లకు మేలు చేకూర్చేదిగా ఉందన్నారు. శాసనమండలిలో బడ్జెట్‌పై మాట్లాడుతూ, కులవృత్తులు చేసుకొనే పేదలకు, ఎస్సీల కోసం 60లక్షల ఎకరాల భూముల కొనుగోలుకు బడ్జెట్లో నిధులెందుకు కేటాయించలేదో ప్రభుత్వం చెప్పాలన్నారు. ఇప్పటికే రూ.10 వేల కోట్లు ఖర్చు చేసినందున ప్రాణహిత ప్రాజెకును పూర్తిచేయడానికి ప్రభుత్వం శ్రద్ధ చూపాలని కోరారు.
కల్యాణలక్ష్మి కింద 1.16కోట్లు ఇవ్వండి
ఎమ్మెల్సీ రాములు నాయక్ మాట్లాడుతూ.. కల్యాణలక్ష్మి పథకం కింద ఎస్సీ, ఎస్టీలకు రూ. 1 కోటి 16 లక్షలు ఇచ్చే అంశాన్ని ప్రభుత్వం పరిశీలించాలని కోరారు. ఎమ్మెల్సీ ప్రభాకర్‌రావు మాట్లాడుతూ ప్రభుత్వం ఇప్పటికే 13 వేల ఉద్యోగాలను భర్తీ చేసిందని, మరో 18వేల పోస్టులకు నోటిఫికేషన్లు విడుదల చేసిం దన్నారు. వేసవిలో విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పాఠశాలల్లో ఒంటిపూట బడులను, పాత విద్యా కేలండర్‌నే కొనసాగించాలని తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభుత్వానికి ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు జనార్దన్‌రెడ్డి, పూల రవీందర్ ధన్యవాదాలు తెలిపారు.
చార్జీలు, పన్నుల పెంపుపై పునరాలోచించాలి
Published Sun, Mar 20 2016 1:07 AM | Last Updated on Sun, Sep 3 2017 8:08 PM
Advertisement
Advertisement