కాల్చారు.. పొడిచారు: అక్బరుద్దీన్ | Akbaruddin Owaisi Testimony in Nampally court | Sakshi
Sakshi News home page

కాల్చారు.. పొడిచారు: అక్బరుద్దీన్

Published Wed, Sep 7 2016 12:57 AM | Last Updated on Fri, Oct 19 2018 7:52 PM

కాల్చారు.. పొడిచారు: అక్బరుద్దీన్ - Sakshi

కాల్చారు.. పొడిచారు: అక్బరుద్దీన్

- కోర్టులో వాంగ్మూలం
- దాడిలో ఎడమ చేయి పూర్తిగా దెబ్బతింది
- అందుకే పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయా
- ఇప్పటికీ తొడభాగంలో ఓ బుల్లెట్ ఉంది

సాక్షి, హైదరాబాద్: బార్కాస్ ప్రాంతంలో 2011 ఏప్రిల్ 30న ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్లగా పహిల్వాన్ గ్యాంగ్‌కు చెందిన కొందరు వ్యక్తులు తనపై దాడి చేసి తుపాకులతో కాల్చారని, కత్తులతో పొడిచారని నాంప ల్లి కోర్టుకు ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ నివేదించారు. దాడిలో తీవ్రంగా గాయపడటంతో పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయానన్నారు. ఇప్పటికీ తొడలో ఓ బుల్లెట్ ఉందన్నారు. అక్బరుద్దీన్‌పై హత్యాయత్నం కేసులో నాంపల్లి ఏడో అదనపు మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి కళ్యాణ చక్రవర్తి మంగళవారం ఆయన వాంగ్మూలాన్ని రికార్డు చేశారు. సుప్రీం ఆదేశాల మేరకు నాంపల్లి కోర్టు రోజువారీ పద్ధతిలో కేసును విచారిస్తోంది.

 యాక్టివాను అడ్డుగా పడేసి దాడి చేశారు
‘‘30న బంజారాహిల్స్ నుంచి ఉదయం 8.15 గంటలకు డ్రైవర్ హబీబ్ ఉస్మాన్ (నాలుగవ సాక్షి)తో కలసి జిప్సీ వాహనంలో బార్కస్‌కు బయలుదేరా. బడాబజార్‌లో ఎమ్మెల్యే అహ్మద్‌బిన్ అబ్దుల్లా బలాలా నాతో కలిశారు. పలు ప్రాంతాల్లో పర్యటించాక బార్కాస్‌లోని ఎంఐఎం కార్యాలయంలో కాసేపు విశ్రాంతి తీసుకున్నాం.  11 గంటలకు దారుస్సలాంలోని కార్యాలయానికి బయలుదేరగా ఆ సమయంలో నా వాహనం ముందు యాక్టివాను పడేయడంతో వాహనాన్ని నిలిపేశాం. యాక్టివా మీద వచ్చిన హసన్ యాఫై అనే వ్యక్తి కత్తితో నా ఎడమ చేయితోపాటు అనేక ప్రాంతాల్లో పొడిచాడు. తర్వాత అబ్దుల్లాబిన్ యూనుస్ యాఫై తుపాకీతో కాల్పులు జరిపాడు. పహిల్వాన్ బంధువు, పహిల్వాన్ కూడా రివాల్వర్‌తో కాల్పులు జరిపారు. తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్న క్రమం లో ఈసాబిన్ యూనస్ యాఫై, మరో ఐదుగురు నా చుట్టూ చేరి కత్తులతో పొడిచారు. అవద్‌బిన్ యూనస్ యాఫై క్రికెట్ బ్యాట్‌తో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడటంతో పిస్టల్ ఉన్నా దాడి చేయలేకపోయా’’ అని కోర్టుకు అక్బరుద్దీన్ వివరించారు. కాగా, బుధవారం కూడా అక్బరుద్దీన్ వాంగ్మూలాన్ని కోర్టు రికార్డు చేయనుంది.

భారీ బందోబస్తు
కోర్టుకు అక్బరుద్దీన్ హాజరవుతున్న నేపథ్యంలో.. ఎంఐఎం కార్యకర్తలు, పహిల్వాన్ అనుచరులూ పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశం ఉన్నందున నాంపల్లి కోర్టు ఆవరణలో టాస్క్‌ఫోర్స్, సివిల్, గ్రేహౌండ్స్ పోలీసులను పెద్ద ఎత్తున మోహరించారు. మొదట మీడియా ప్రతినిధులు సహా ఎవ్వరినీ కోర్టు హాల్‌లోకి అనుమతించకపోయినా తర్వాత మీడియాను అనుమతించారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement