‘డ్రగ్స్‌’ కేసుకు సెలవు? | Akun Sabarwal from tomorrow to 27th | Sakshi
Sakshi News home page

‘డ్రగ్స్‌’ కేసుకు సెలవు?

Published Sat, Jul 15 2017 2:51 AM | Last Updated on Fri, May 25 2018 2:29 PM

‘డ్రగ్స్‌’ కేసుకు సెలవు? - Sakshi

‘డ్రగ్స్‌’ కేసుకు సెలవు?

- రేపటి నుంచి 27వ తేదీ వరకు సెలవులో అకున్‌ సబర్వాల్‌
పర్వతారోహణకు వెళ్తున్నా అంటూ ఓ చానల్‌కు వెల్లడి
కొద్దిసేపటికే తమ స్వగ్రామానికి వెళ్తున్నానంటూ మాట మార్పు
 
సాక్షి, హైదరాబాద్‌: ‘డ్రగ్స్‌’వ్యవహారాన్ని మూలాల నుంచి పెకలిస్తున్న ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్, ఐపీఎస్‌ అధికారి అకున్‌ సబర్వాల్‌ ఉన్నట్టుండి సెలవుపై వెళుతున్నారు. ఆదివారం నుంచి 27 వరకు పది రోజులు విధులకు దూరంగా ఉండనున్నారు. డ్రగ్స్‌ వ్యవహారంలో పలువురు సినీ ప్రముఖులకు నోటీసులు జారీ చేసి, విచారించనున్న కీలక సమయంలో ఆయన సెలవుపై వెళుతుండడంతో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇతర కేసుల లాగానే ఈ డ్రగ్స్‌ కేసు పనికూడా అయిపోయినట్లేననే అభిప్రాయాలు వస్తున్నాయి. 
 
ప్రభుత్వ పెద్దల అసంతృప్తితో..
డ్రగ్స్‌ వ్యవహారం కేసు తొలి నుంచి వివాదాస్ప దం అవుతోంది. డ్రగ్స్‌ మాఫియా స్కూల్‌ పిల్లల ను కూడా వదిలిపెట్టడం లేదని.. పలు ఇంటర్నేషనల్‌ స్కూళ్ల పిల్లలు డ్రగ్స్‌ బారిన పడ్డారని అకున్‌ సబర్వాల్‌ బయటపెట్టారు. డ్రగ్స్‌ వ్యవహారంపై ఈనెల 18న నిర్వహించే కౌన్సెలింగ్‌కు హాజరుకావాలని దాదాపు 40 పాఠశాలలు, 80 కళాశాల యాజమాన్యాలకు అడ్వైజరీ నోట్‌లు కూడా పంపారు. అయితే దీనిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తప్పుబ ట్టారు. విచారణ అధికారి (సబర్వాల్‌) అత్యు త్సాహం చూపిస్తున్నారంటూ బాహాటంగానే విమర్శించారు. దీనిపై డీజీపీకి ఫిర్యాదు కూడా చేశారు. మరోవైపు ఇదే సమయంలో డ్రగ్స్‌ వ్యవహారంతో సినీ ప్రముఖుల లింకు బయటపడింది. దీంతో సినీ హీరో, హీరోయిన్లు, దర్శకుడు సహా 12 మందికి ఎక్సైజ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ నోటీసులు జారీ చేసింది.

వారంతా ఈ నెల 19 నుంచి 27 మధ్య సిట్‌ ఎదుట విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని ఆదేశించింది. అంతేగాకుండా మరింత మంది సినీ పెద్దలకూ నోటీసులు అందించేందుకు సిద్ధమైంది. ఇలా కేసు విచారణ కీలక దశలో ఉన్న సమయంలో విచారణాధికారి అకున్‌ సబర్వాల్‌కు 10 రోజుల పాటు సెలవులు మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభు త్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆయన శుక్రవారమే హైదరాబాద్‌ నుంచి వెళ్లిపోయినట్లు తెలిసింది.
 
విరుద్ధ సమాధానాలతో..
అకున్‌ సబర్వాల్‌ ఉన్నట్టుండి సెలవుపై వెళ్లటం అనేక అనుమా నాలకు తావి స్తోంది. ఇది కేసును నీరుగార్చడానికేనన్న ఆరోపణలు వస్తున్నాయి. సెలవు తీసుకోవడానికి సబర్వాల్‌ చెప్పిన పరస్పర విరుద్ధ కారణాలు ఈ ఆరోపణలకు బలాన్నిస్తున్నాయి. ఉదయం ఒక టీవీ చానల్‌తో మాట్లాడిన ఆయన.. సెలవు పెట్టి హిమాలయాల్లో పర్వతారోహణకు వెళ్తు న్నట్లు చెప్పారు. జాతీయ పోలీసు అకా డమీ బృందంతో కలసి వెళ్లేందుకు అనుమతించాలంటూ గతంలోనే ప్రభు త్వాన్ని కోరానన్నారు. అయితే గంట సేపటి అనంతరం మీడియాతో మాట్లా డిన ఆయన సెలవుపై మాట మార్చారు. రెండు నెలల కింద తన తల్లి చనిపో యారని, మరణం అనంతరం నిర్వహించే కార్యక్రమాల కోసం పంజాబ్‌లోని స్వగ్రామానికి వెళుతున్నానని చెప్పారు. కేసు దర్యాప్తుకు, సెలవుకు సంబంధం లేదన్నారు.
 
ఎన్నో సందేహాలు
అకున్‌ సబర్వాల్‌ పర్వతారోహణకు వెళ్లనున్నట్ల యితే... కీలకమైన కేసు విచారణ, సంచలన అంశాలు బయటికి వస్తున్న నేపథ్యంలో సెలవును రద్దు చేసుకోవ చ్చు. ఒక వేళ తన తల్లి మర ణానంతర కార్యం అనుకుంటే... హిందూ సంప్రదాయాల ప్రకారం ఆ క్రతువులో తన జీవిత భాగస్వామి స్మితా సబర్వాల్‌ కూడా పాల్గొనాలి. కానీ ఆమె విధుల్లోనే సాగు తున్నారు. అయితే ప్రభుత్వమే అకున్‌ సబర్వాల్‌ ఎప్పుడో విజ్ఞప్తి చేసిన సెలవులను వ్యూహాత్మకంగా ఇప్పుడు మంజూరు చేసి, రాష్ట్రం దాటించిందనే ఆరోపణలు వస్తున్నాయి. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement