‘పాలమూరు’ను పాడెక్కించొద్దు!
‘పాలమూరు–రంగారెడ్డి’ రౌండ్ టేబుల్ భేటీలో అఖిలపక్షం
సాక్షి, హైదరాబాద్: పాలమూరు జిల్లాలోని ప్రాజెక్టులను పూర్తి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అలసత్వం ప్రదర్శిస్తోందని అఖిలపక్ష నేతలు ధ్వజమెత్తారు. ‘పాలమూరు– రంగారెడ్డి’ ప్రాజెక్టును అంతర్రాష్ట్ర వివా దాలు, అనవసర రాద్ధాంతాల్లోకి లాగుతోందని మండిపడ్డారు. ప్రాజెక్టుల విషయంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు, మంత్రి హరీశ్‌రావు హిట్లర్‌లా ఒంటెత్తు పోకడలు పోతున్నారని విమర్శించారు. సోమవారం ‘పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల–ఓ తప్పులతడక.. ఓ దోపిడీ.. ఓ దగా’ పేరుతో గద్వాల కాంగ్రెస్ ఎమ్మెల్యే డీకే అరుణ ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ వర్కింగ్ ప్రెసి డెంట్ రేవంత్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహా, బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి, కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.రామ్మో హన్‌రెడ్డి తదితరులు భేటీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా డీకే అరుణ పవర్ పాయిం ట్ ప్రజెంటేషన్ ఇచ్చారు.
పాలమూరు జిల్లాను సస్యశ్యామలం చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వమే రూ.7 వేల కోట్లతో కల్వకుర్తి, నెట్టెంపాడు, భీమా, కోయిల్‌సాగర్ ప్రాజెక్టు లను చేపట్టిందని డీకే అరుణ చెప్పారు. మరో వెయ్యి కోట్లు ఖర్చు చేస్తే అవి పూర్తయ్యే అవకాశమున్నా.. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అలా చేయకుండా అంచనాలను దారు ణంగా పెంచిందని పేర్కొన్నారు. ప్యాకేజీ–1 లోని లిఫ్టు–1 కింద నవయుగ కంపెనీ మార్పులు కోరగానే కేవలం 123 ఎకరాల అటవీ భూమిని తప్పించిందని, దాంతో ప్రభుత్వంపై అదనంగా రూ.1,000 కోట్ల భారం పడిందని ఆమె విమర్శించారు.
ఇంట్లో టెండర్ల ఖరారు: ఉత్తమ్
పాలమూరు ప్రాజెక్టులో రూ.29 వేల కోట్ల టెండర్లను సీఎం, మంత్రి వారి ఇంట్లో కూర్చొని ఖరారు చేశారని ఉత్తమ్ ఆరోపించారు. దాంతో నవయుగ వంటి సంస్థలకు సింగిల్ టెండర్లతో పనులు దక్కాయని.. పనులు మొదలుపెట్టకుండానే పాలమూరు ప్రాజెక్టు ప్యాకేజీ–1లో నవయుగ కంపెనీకి ప్రభుత్వం రూ.1,000కోట్లు అప్పనంగా కట్టబెట్టే యత్నం చేస్తోందని విమర్శించారు. తన 14 ఏళ్ల ఉద్యమ జీవితంలో కేసీఆర్ ఏనాడూ ప్రాజెక్టుల రీడిజైన్ అనలేదని, మిషన్ భగీరథ పేరెత్తలేదని.. భేతాళ మాంత్రికుడు ఆవహించాకే వాటికి రూప కల్పన చేశారని రేవంత్‌రెడ్డి అన్నారు. ప్రాజె క్టుల టెండర్లపై తాను సుప్రీంకోర్టుకు వెళ్లి వాటిని ఆపి తీరుతానని నాగం చెప్పారు.