నిమ్స్‌లో డిష్యుం..డిష్యుం
ఉన్నతాధికారుల మధ్య వాగ్వాదం
సిటీబ్యూరో: ‘ఆస్పత్రి ఫర్నీచర్‌ను దొంగతనంగా ఇంటికి తెచ్చుకున్నావు, నీపై ఇప్పటికే అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి. దీనిపై ఏసీబీ విచారణ కూడా జరుగుతోంది. నువ్వా నాకు నీతులు చెప్పేది?’ అని అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ నిలదీస్తే..‘పరిశోధనపత్రాలు పబ్లిష్ కాకముందే అయినట్లు సెలక్షన్ కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చావు. అర్హత లేక పోయినా అక్రమ మార్గంలో పదోన్నతి పొందా వు’అంటూ డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్ ఇలా ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకుంటున్నారు. ప్రతిష్టాత్మక నిజామ్స్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్(నిమ్స్) వేదికగా నాలుగు రోజుల క్రితం ఆస్పత్రి అడ్మినిస్ట్రేషన్ విభాగంలోని ఇద్దరు సీనియర్ వైద్యాధికారుల మధ్య జరిగిన వాగ్వాదం ఇది. నిమ్స్‌లో అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్, డిప్యూటీ మెడికల్ సూపరింటెండెంట్‌ల మధ్య పచ్చ గడ్డివేస్తే భగ్గుమంటోంది. జూనియర్లకు ఆదర్శంగా ఉండాల్సిన సీనియర్ వైద్యాధికారులే రోడ్డున పడి సంస్థ పరువును బజారుకీడుస్తుండటంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఏఎంఎస్‌పై డెరైక్టర్‌కు ఫిర్యాదు
అసిస్టెంట్ ప్రొఫెసర్లకు పదోన్నతులపై 2012లో ఇంటర్వ్యూలు నిర్వహించారు. నిబంధనల ప్రకారం సీనియార్టీతో పాటు పరిశోధన పత్రాల ఆధారంగా పదోన్నతులు కల్పించాల్సి ఉంది. అయితే ప్రస్తుత అసిస్టెంట్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ కృష్ణారెడ్డి పరిశోధనా పత్రాలు పబ్లిష్‌కాకుండానే ఇంటర్వ్యూకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి. పరిశోధన పత్రాలను సమర్పించకుండానే 2011లోనే పబ్లిషైనట్లు కమిటీకి తప్పుడు సమాచారం ఇచ్చి అక్రమ పద్ధతిలో అడి షినల్ ప్రొఫెసర్‌గా పదోన్నతి పొందినట్లు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ విషయంపై సమగ్ర విచారణ జరిపి అక్రమాలకు పాల్పడిన డాక్టర్ కృష్ణారెడ్డిపై చర్య తీసుకోవాలని కోరుతూ డిప్యూటి మెడికల్ డెరైక్టర్ డాక్టర్ కె.థామస్‌రెడ్డి ఇటీవల నిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ నరేంద్రనాథ్ సహా వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి, శాఖ ముఖ్య కార్యదర్శి, తెలంగాణ వైద్యుల సంఘానికి ఫిర్యాదు చేశారు.
అవినీతిపై నిలదీసినందుకే
అవినీతిపై నిలదీసినందునే అందరూ కలిసి నాపై కక్ష్య కట్టారు. ఇంటర్వ్యూకు హాజరయ్యే నాటికి పరిశోధన పత్రాలు సమర్పించాను. పబ్లిషింగ్‌కు కొంత సమయం పడుతుందని, ఇందుకు నెల గడువు కావాలని కమిటీ సభ్యుల నుంచి అనుమతి కూడా తీసుకున్నా . పరిశోధనా పత్రాలను ఇంటర్నెట్‌లో పెట్టడంలో జాప్యం జరిగింది. నాపై వచ్చిన ఆరోపణల్లో వాస్తవం లేదు.
డాక్టర్ కె.వి.కృష్ణారెడ్డి,
అసిస్టెంట్ మెడికల్ సూపరెంటెండెంట్
అందరి ముందు తిట్టారు
వారం రోజుల క్రితం నిమ్స్ అడ్మినిస్ట్రేషన్ విభాగంలో జరిగిన సమావేశంలో సహోద్యోగులతో పాటు జూనియర్లు, ఇతర ఉద్యోగుల సమక్షంలోనే ఆయన నోటికొచ్చినట్లు మాట్లాడారు. తప్పుడు విద్యార్హతలు చూపడంతో పాటు సహోద్యోగుల పట్ల దురుసుగా వ్యవహరిస్తున్న ఏఎంఎస్‌పై శాఖాపరమైన చర్య తీసుకోవాల్సిందే.
డాక్టర్ కె.టి.రెడ్డి,
డిప్యూటి మెడికల్ సూపరింటెండెంట్
నువ్వెంత..నువ్వెంత..?
Published Tue, Aug 25 2015 1:21 AM | Last Updated on Sun, Sep 3 2017 8:03 AM
Advertisement