సవాల్‌కు రెడీ.. ఎంక్వైరీ వేయండి
- వైఎస్సార్ సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు
- వైఎస్ జగన్ ను విమర్శించే స్థాయి లోకేష్‌కు లేదు
సాక్షి, హైదరాబాద్: లోకేష్ వేల కోట్ల అవినీతిపై ఎంక్వైరీ వేయాలని తాము సవాల్ చేసి 24 గంటలైనా చంద్రబాబు, ఆయన పుత్రరత్నం దాన్ని స్వీకరించకుండా పారిపోతున్నారని వైయస్సార్సీపీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. అవినీతిపై చర్చకు సిద్ధమా అని లోకేష్ మాట్లాడుతున్నారని, చర్చ కాదని ఎంక్వైరీ వేస్తేనే నిజానిజాలు తెలుస్తాయని చెప్పారు. లోకేష్ కు దమ్ము, ధైర్యం ఉంటే తనపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ ఎంక్వైరీ విచారణ ఎదుర్కోవాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ లో పార్టీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పరిటాల రవి హత్య కేసు, ఒౌటర్ రింగ్ రోడ్డు, వోక్స్ వ్యాగన్లో స్కాంలు జరిగా యంటూ చంద్రబాబు సీబీఐ ఎంక్వైరీ కోరితే.... విచారణకు ఆదేశించి నిగ్గుతేల్చిన వ్యక్తి వైయస్ రాజశేఖరరెడ్డి అని గుర్తు చేశారు. ప్రజలు , ప్రతిపక్షాల ఆరోపణలపై ఎంక్వైరీ వేసే దమ్ము, ధైర్యం లేక ఎందుకు పారిపోతున్నారో చెప్పాలని చంద్రబాబును ప్రశ్నించారు.
చంద్రబాబుకు పుత్ర భయోత్పాతం..
చంద్రబాబుకు పుత్ర భయోత్పాతం పట్టుకుందని అంబటి రాంబాబు ఎద్దేవా చేశారు. లోకేష్ మైక్ దగ్గరకు వచ్చేసరికి... పుత్రరత్నం ఏం మాట్లా డతాడోనన్న భయం బాబులో కన్పించిందన్నారు. మాట్లాడడమే సరిగా రాని వ్యక్తి జగన్ పై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. లోకేష్ పప్పు, మొద్దబ్బాయి, పనికిమాలిన వ్యక్తి అని గూగుల్ లో కొట్టినా చెబుతుందని చలోక్తులు విసిరారు. ప్రభుత్వ అవినీతి, అక్రమాలకు మాత్రమే తాము వ్యతిరేకమని, అభివృద్ధికి కాదని అంబటి స్పష్టంచేశారు. విశాఖలో 6వేల ఎకరాల్లో భూ కుంభకోణం జరుగుతోంది, భూముల రికార్డులు మార్చేసి వేలకోట్లు కాజేసే పరిస్థితికి అధికారులు, పోలీసులు వస్తున్నారు.. పోలీసులే సెటిల్ మెంట్లు చేస్తున్నారని స్వయంగా మంత్రివర్గ సహచరుడు అయ్యన్నపాత్రుడే చెబుతుంటే...ఇంకా ఏ మొహం పెట్టుకొని మాట్లాడుతున్నారని నిప్పులు చెరిగారు.
జగన్ ఎక్కడ అభివృద్ధికి అడ్డుపడ్డట్లు
సహజంగా రాష్ట్రాలు, దేశాల అభివృద్ధికి జీడీపీనే గీటురాయి అని రాంబాబు తెలిపారు. అలాంటిది ఏపీలో 12.7 శాతం జీడీపీ వృద్ధి రేటు ఉంటే ఇంకా ఎక్కడ వైఎస్ జగన్ రాష్ట్రాభివృద్ధికి అడ్డుపడ్డట్లని ప్రశ్నించారు. జీడీపీ వృద్ధి రేటు ఎక్కువగా చూపటం కేవలం రాష్ట్రానికి రుణాలు పొందేందుకేనని విమర్శించారు. ప్రత్యేక హోదా ఇవ్వని బీజేపీపై వైఎస్సార్ సీపీ పోరాటం ఆగదని రాంబాబు చెప్పారు.