సిరాజ్ ఫేస్‌బుక్ ద్వారానే అమీనా లింకు! | ameena cought through seeraj facebook | Sakshi
Sakshi News home page

సిరాజ్ ఫేస్‌బుక్ ద్వారానే అమీనా లింకు!

Published Tue, Dec 15 2015 2:20 AM | Last Updated on Thu, Jul 26 2018 5:23 PM

సిరాజ్ ఫేస్‌బుక్ ద్వారానే అమీనా లింకు! - Sakshi

సిరాజ్ ఫేస్‌బుక్ ద్వారానే అమీనా లింకు!

* ఐసిస్ సానుభూతిపరురాలి వివరాలు తెలిసిందిలా..
* ఇంకా ఆ బాటలోకి వెళ్లలేదని చెబుతున్న నిఘా వర్గాలు
* సిరాజుద్దీన్‌ను ఐసిస్‌వైపు ఆకర్షించింది నిక్కీ జోసెఫ్
* ఇతడి లోకల్ కాంటాక్ట్‌పై లోతుగా సాగుతున్న దర్యాప్తు


 సాక్షి, హైదరాబాద్: నగరంలోని టోలిచౌకిలో ఓ ఇంట్లో పని చేయడానికి వచ్చిన కెన్యా జాతీయురాలు అమీనా అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వైపు ఆసక్తి చూపుతున్నట్లు వెలుగులోకి రావడం కలకలం రేపింది. కేంద్ర నిఘా వర్గాల ద్వారా ఈ సమాచారం అందుకున్న హైదరాబాద్ పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకుని పలు కోణాల్లో ప్రశ్నించారు. పూర్వాపరాలను పరిశీలించి, శనివారం ఆమెను కెన్యాకు బలవంతంగా తిప్పిపంపిన విషయం విదితమే. ఈమెకు సంబంధించిన సమాచారం కేంద్రనిఘా వర్గాలకు రాజస్థాన్‌లో అరెస్ట్ అయిన సిరాజుద్దీన్ ద్వారా తెలిసింది.

 సిటీ నుంచి మొదలై సిటీకి..: ఐసిస్‌లో చేరేం దుకు దుబాయ్ వెళ్లే ప్రయత్నాల్లో ఉన్న హైదరాబాదీ సల్మాన్ మొయినుద్దీన్‌ను ఈ ఏడాది జనవరిలో శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో అరెస్టు చేశారు. ఇతడి విచారణలోనే తొలిసారిగా నిక్కీ జోసెఫ్ అనే పేరు వెలుగులోకి వచ్చింది. బ్రిటిష్ జాతీయురాలుగా చెప్పుకున్న ఆమె ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైందని, తనతో పాటు అనేక మందిని ఐసిస్ వైపు ఆకర్షించిందని సల్మాన్ వెల్లడించాడు. ఈమె గురించి ఆరా తీయగా.. హైదరాబాద్‌కు చెందిన, దుబాయ్‌లో స్థిరపడిన ఆఫ్షాన్ జబీన్ అని గుర్తించారు. సెప్టెంబర్‌లో దుబాయ్ నుంచి రప్పించి ఎయిర్‌పోర్ట్‌లో పట్టుకున్నారు. జబీన్‌తో సంబంధాలు కొనసాగించిన, ఐసిస్ వైపు పలువురిని ఆకర్షిస్తున్న వారి కోసం గాలించిన నిఘా వర్గాలు రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన మహ్మద్ సిరాజుద్దీన్ కీలకమని గుర్తించాయి. ఇతడిని రాజస్థాన్ ఏటీఎస్ అధికారులు శుక్రవారం అరెస్టు చేశారు. సిరాజ్ ఫేస్‌బుక్ పేజ్ ఆధారంగా ఫ్రెండ్స్ లిస్ట్‌లోని హైదరాబాద్‌లో నివసిస్తున్న కెన్యా జాతీయురాలు అమీనా ఐసిస్‌పై ఆసక్తి చూపుతోందని గుర్తించారు. ఈమెను అదుపులోకి తీసుకున్న సిటీ పోలీసులు శనివారం ముంబై మీదుగా కెన్యా పంపేశారు.

జైపూర్ చేరిన రాష్ట్ర బృందం..: సిరాజుద్దీన్ వ్యవహారాన్ని రాజస్థాన్ పోలీసులతో పాటు కేంద్ర నిఘా వర్గాలూ లోతుగా ఆరా తీస్తున్నాయి. సోషల్‌మీడియా ద్వారా ఇతడితో సంబంధాలు కొనసాగించిన, ఐసిస్‌పై ఆసక్తిచూపిన వారిలో తెలంగాణకు చెందిన పలువురు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించాయి. వారెవరనేది రూఢీ చేసుకోవడానికి సిరాజ్ ఫేస్‌బుక్, వాట్సప్, టెలిగ్రామ్ ఖాతాల్లోని అంశాలను విశ్లేషిస్తున్నాయి. ఇతడిని ప్రశ్నించడంతో పాటు పూర్తి వివరాలు తెలుసుకోవడానికి రాష్ట్ర నిఘా వర్గాలకు చెందిన ఓ బృందం జైపూర్ చేరుకుంది. సిరాజ్‌కు చెందిన సోషల్‌మీడియా అకౌంట్ల నుంచి సేకరించిన సమాచారం దాదాపు 12 వేల పేజీలు ఉన్నట్లు ఓ అధికారి తెలిపారు. వాటిలోని అంశాలు, పోస్ట్ చేసిన, సమాచారం పంపిన వారి వివరాలను కేంద్ర నిఘా వర్గాలు విశ్లేషిస్తున్నాయని, అది పూర్తయితేనే తెలంగాణ లింకులు బయటకు వస్తాయని చెప్పారు. అమీనా ఇంకా ఉగ్రవాదబాట పట్టలేదని, కేవలం ఫేస్‌బుక్ ద్వారా సంప్రదింపులు జరిపిందని వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement