ఆశ.. అడియాసే! | America changed H1B visa rules | Sakshi
Sakshi News home page

ఆశ.. అడియాసే!

Published Sun, Jan 10 2016 3:11 AM | Last Updated on Thu, Apr 4 2019 3:25 PM

ఆశ.. అడియాసే! - Sakshi

ఆశ.. అడియాసే!

హెచ్1బీ వీసా జారీని కఠినతరం చేసిన అమెరికా

ఉద్యోగం ఇస్తామని కంపెనీలు చెబితేనే ‘వీసా’ లాటరీకి అవకాశం
వలస విధానాన్ని కచ్చితంగా అమలు చేస్తామని ప్రకటన
ఇప్పటికే వందలాది మంది విద్యార్థులు వెనక్కి..
ఉద్యోగం చేస్తున్నవారినీ విమానాశ్రయాల నుంచే తిప్పి పంపుతున్న వైనం
ముందు ముందు పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయంటున్న నిపుణులు
ఎదుర్కోగలిగిన వారే వెళ్లాలని స్పష్టీకరణ.. నకిలీ ఉద్యోగానుభవం సర్టిఫికెట్లు పెట్టవద్దని హెచ్చరిక
ప్రతిభ ఉన్నవారికి మాత్రం అమెరికాలో మంచి అవకాశాలు ఉంటాయని వెల్లడి

 
సాక్షి ప్రత్యేక ప్రతినిధి
అమెరికాలో చదువు.. హెచ్1బీ వీసా.. లక్షల్లో వేతనం.. ఏ ఇబ్బందులూ లేని జీవితం... ఇలా లక్షలాది మంది భారత యువత కన్న కలలన్నీ కల్లలవుతున్నాయి. భారత్ నుంచి వస్తున్న విద్యార్థుల నుంచి పెద్ద మొత్తంలో సొమ్ము సమకూర్చుకుంటున్న అమెరికా... వారికి ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించడంపై మాత్రం నానా ఆంక్షలూ విధిస్తోంది. అనుమతి లేని యూనివర్సిటీల్లో చేరుతున్నారంటూ వందలాది మందిని వెనక్కి తిప్పిపంపుతోంది. ఇప్పటికే అక్కడ ఉద్యోగాలు చేస్తున్నవారినీ నిబంధనల సాకుతో ఇబ్బందులపాలు చేస్తోంది. చివరికి అసలు ఉద్యోగాలు పొందేందుకు ఉన్న అవకాశాలనూ వీసా నిబంధనలు కఠినతరం చేసి దెబ్బతీస్తోంది. ఫలానా వ్యక్తికి పూర్తిస్థాయి ఉద్యోగం ఇస్తామని అమెరికా కంపెనీలు ఆఫర్ లెటర్ ఇస్తేనే హెచ్1బీ వీసా లాటరీకి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకుంటామంటూ పెట్టిన మెలికతో... అమెరికాలో చదువుకుంటున్న భారత విద్యార్థులు, తాత్కాలిక ఉద్యోగాల్లో పనిచేస్తున్నవారు తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు. ఇప్పటిదాకా ఓపీటీ (తాత్కాలిక ఉద్యోగాల)పై ఉన్న వారు కూడా హెచ్1బీ వీసాకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉండేది.
 
తప్పని చిక్కులు..
కొత్త విధానం అమల్లోకి వచ్చినప్పటి నుంచి అంటే దాదాపు ఆరు నెలలుగా అమెరికాలోని భారత విద్యార్థులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో కన్సల్టెన్సీల ద్వారా ఉద్యోగం సంపాదించేందుకు నకిలీ అనుభవం సర్టిఫికెట్ పెడుతున్నారని.. అదే వారి కొంప ముంచుతోందని కన్సల్టెన్సీ నిపుణులు చెబుతున్నారు. అప్పుడే ఎంఎస్ పూర్తిచేసి నాలుగైదేళ్లు ఉద్యోగ అనుభవం ఉన్నట్లుగా సర్టిఫికెట్ ఇచ్చేవారంతా చిక్కులు ఎదుర్కొనక తప్పదని హెచ్చరిస్తున్నారు. చదువు పూర్తి కాగానే తక్కువ వేతనంతో అయినా ఉద్యోగంలో చేరి వారి ప్రతిభను నిరూపించుకుంటే చిక్కులు ఉండవని... అలాగాకుండా వెంటనే భారీ వేతనం కావాలని ఆశపడేవారికి ఇబ్బందులు తప్పవని అంటున్నారు. క్యాంపస్ ఉద్యోగాలు దక్కించుకున్న వారికి ఇలాంటి చిక్కులేమీ ఉండవని కన్సల్టెన్సీల నిర్వాహకులు చెబుతున్నారు. అమెరికా తాజా చర్యతో మంచి విద్యార్థులకు నష్టం లేదని, ఏదో ఒక ఉద్యోగం చేయాలని వచ్చేవారికే కష్టాలన్నీ అని అంటున్నారు. ప్రతిభ ఉన్న వారికి ఆఫర్ లెటర్లు ఇచ్చేందుకు అమెరికా కంపెనీలు సిద్ధంగా ఉంటాయని... కానీ గతంలో మాదిరి ఎక్కువ వేతనాలు ఆఫర్ చేయడం లేదని వివరిస్తున్నారు.
 
 తిప్పి పంపడాన్ని సమర్థించుకున్న అమెరికా
చదువుకోవడానికి ఎఫ్-1 వీసాపై, ఉద్యోగం చేయడానికి హెచ్1బీ వీసాపై వచ్చే వారిని వెనక్కి తిప్పిపంపడాన్ని అమెరికా సమర్థించుకుంటోంది. తమ విధానంలో ఎలాంటి మార్పూ ఉండబోదని కూడా స్పష్టం చేసింది. దీంతో ఇక్కడి విద్యార్థులతో పాటు, ఇప్పటికే హెచ్1బీ వీసాపై అమెరికాలో ఉద్యోగం చేస్తున్న వేలాది మంది ఆందోళన చెందుతున్నారు. అమెరికాలో ఎంఎస్ చదివేందుకు వెళ్లిన వందలాది మంది భారత విద్యార్థులను అమెరికా విమానాశ్రయాల నుంచే వెనక్కి పంపిన సంగతి తెలిసిందే. అక్కడ హెచ్1బీ వీసాతో ఉద్యోగం చేస్తూ.. సెలవులకు స్వదేశం వచ్చి తిరిగి వెళుతున్నవారిని కూడా అమెరికా అధికారులు తిప్పిపంపుతున్నారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో భారత్‌కు చెందిన 113 మంది ఉద్యోగులు విమానాశ్రయాల నుంచే వెనక్కి రావాల్సి వచ్చింది.

ఇది ఒక్క భారతదేశానికి మాత్రమే పరిమితం కాదని, తమ నిబంధనలు అనుసరించి అన్ని దేశాలకు చెందినవారిని తిప్పిపంపుతున్నామని అమెరికా చెబుతోంది. కానీ వెనక్కి పంపుతున్నవారిలో దక్షిణాసియా వారే అధికంగా ఉన్నట్లు అమెరికా మీడియా కథనాలను బట్టి తెలుస్తోంది. ఈ ఏడాది నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనుండటం కూడా వలస విధానాన్ని కఠినంగా అమలు చేస్తుండడానికి కారణమని నిపుణులు చెబుతున్నారు. భారత్ నుంచి వెళ్లే విద్యార్థులు అన్ని నిబంధనలు పాటించాలని, మంచి విశ్వవిద్యాలయాలను ఎంపిక చేసుకోవాలని, ఆర్థిక వనరులకు సంబంధించిన అన్ని పత్రాలను దగ్గర ఉంచుకోవాలని సూచిస్తున్నారు. ముందు ముందు పరిస్థితులు మరింత కఠినంగా ఉంటాయని, వాటిని తట్టుకునే వారే అమెరికాలో విద్యాభ్యాసం కోసం వెళ్లాలని పేర్కొంటున్నారు.
 
విధానాల్లో మార్పులుండవు..
అమెరికాలో అమలు చేస్తున్న దేశ బహిష్కరణ విధి విధానాల్లో ఎలాంటి మార్పులూ ఉండబోవని అమెరికా అధ్యక్ష భవనం వైట్‌హౌస్ ఇటీవల స్పష్టం చేసింది. భారీ సంఖ్యలో విదేశీయులను ముఖ్యంగా భారత విద్యార్థులు, ఉద్యోగులను బలవంతంగా తిప్పిపంపుతున్న వైనంపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. అమెరికాలో హక్కుల సంఘాలతో పాటు అధికార డెమొక్రటిక్ పార్టీ నేతలు సైతం నిరసన వ్యక్తం చేస్తున్నారు. అయినా అమెరికా చట్టాలను అనుసరించి పాలనా వ్యవస్థలో నియంత్రణ వ్యూహం, ప్రాథమ్యాల్లో ఎలాంటి మార్పులు ఉండబోవని వైట్‌హౌస్ అధికార ప్రచార కార్యదర్శి జోష్ ఎర్నెస్ట్ శుక్రవారం స్పష్టం చేశారు. అధ్యక్షుడు ఒబామాకు ఈ అంశం గురించి తెలుసునని, అమెరికా వలసల విధానం సముచితంగా ఉండేలా ఆయన దృష్టి సారించారన్నారు. నేరచరిత్ర కలిగిన వ్యక్తులతో పాటు ఇటీవల దేశంలోకి ప్రవేశించిన వ్యక్తులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టామని... వారిని దేశం నుంచి వెనక్కి పంపేందుకు పాలనాపరమైన అన్ని నిబంధనలను అనుసరిస్తామని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement