ఆటోవాలాపై అమెరికన్ లేడీ ప్రతీకారం
హైదరాబాద్: అవసరం లేనప్పుడు ఐదారుసార్లు ఎదురుపడే ఆటోవాలాలు.. అర్జెంట్గా వెళ్లాలనుకున్నప్పుడు మాత్రం కనిపిస్తే ఒట్టు! ఒక వేళ కనిపించినా సవాలక్ష కండిషన్లు. నోటికొచ్చినంత డిమాండ్ చేస్తారు. మీటర్ వేయమంటే కుదరదంటారు. సిటీలో మీ ప్రయాణం మా చెప్పు- చేత (హ్యాండిల్, బ్రేక్) ల్లో ఉందని బిల్డప్ ఇస్తారు.
అసలేం చేస్తే ఈ ఆటోవాలాలు మనం చెప్పేది వింటారు? వాళ్లు అడిగినంత ఇచ్చేసి అయినా తాము వెళ్లాల్సిన చోటుకి వెళతారు కొందరు. అయితే ఈ సమస్యకు బాగా ఆలోచించి సరికొత్త పంథాను కనిపెట్టింది ఓ అమెరికన్ లేడీ. హైదరాబాద్కు చిరపరిచితురాలైన ఆమె..మాటవినని ఓ ఆటోవాలాతో సాగించిన వెరైటీ బేరసారాల వీడియో ప్రస్తుతం సోషల్ వెబ్సైట్స్లో హల్చల్ చేస్తోంది.
జార్జిటౌన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సి. క్రిస్టీన్ ఫెయిర్.. దక్షిణ ఆసియా భాషలు, సాంస్కృతిక మార్పులు, తదితర అంశాలపై పరిశోధనలు చేస్తోంది. ఆ క్రమంలోనే 1997 నుంచి ఎన్నోసార్లు హైదరాబాద్కు వచ్చి వెళ్లింది. ఉర్దూ హిందీ మిక్స్ చేసినట్లుండే హైదరాబాదీ లాంగ్వేజ్ ఆమెకు కొట్టినపిండి. మూడురోజుల కిందట ఆమె బసచేసిన హోటల్ నుంచి బయటికొచ్చి ఓ ఆటోను కేకేసింది.. చార్మినార్కు వెళ్లాలని పిలిచింది ఫారినర్ కాబట్టి జేబు నిండిందన్న సంతోషంతో దగ్గరికెళ్లాడు ఆటోవాలా. 'మీటర్ మీద చార్మినార్కు వెళదాం' అని క్రిస్టీన్.. 'అలా కుదరదు అడిగినంత ఇస్తేనే వస్తాను' అని ఆటోవాలా వాదులాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత క్రిస్టీన్కు చిర్రెత్తుకొచ్చింది.
అమాంతం ఆటోలో కూలబడి మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి.. ఆటోవాలా తీరును వివరిస్తూ వీడియో తీసింది. 'అవసరమైతే రోజంతా ఖాళీగా ఉంటాను కానీ మీటర్ మాత్రం వేయను' అనే ఆటోవాడి మాటల్ని రిపీట్ చేసింది. మధ్యమధ్యలో బాలీవుడ్ సాంగ్స్ను హమ్ చేసింది. 'ఈ గోలేంట్రా బాబూ..' అని తలబాదుకుంటూనే చివరికి క్రిస్టినా చెప్పినట్లే మీటర్ రేటుకే ఆమెను చార్మినార్ లో దిగబెట్టేందుకు ఓకే అన్నాడు ఆటోవాలా.
మీరు కూడా ఈ టెక్నీక్ ఫాలో అయ్యి.. సరసమైన ధరకు ఆటోప్రయాణం చేయాలనుకుంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆవిడంటే ఫారినర్ కాబట్టి ఆటోలో అంత రచ్చ చేసినా పోనీలే అని అనుకున్నాడు మన ఆటోవాలా. అదే లోకల్ వాళ్లైతే ఎలా బదులిస్తాడో నగరవాసులకు కొత్తగా చెప్పేదేమీ ఉండదనుకుంటా!!