Autowala
-
ఆటోవాలా ఆంగ్లం : అదుర్స్ అంటున్ననెటిజన్లు, వైరల్ వీడియో
టాలెంట్ ఏ ఒక్కరి సొత్తూ కాదు ఇదే విషయాన్ని ఒక ఆటో ఆటోడ్రైవర్ మరోసారి నిరూపించాడు. అనర్గళంగా ఇంగ్లీషు మాట్లాడేస్తున్న సంబంధించిన వీడియో ఒకటి నెట్టింట్ చక్కర్లు కొడుతోంది.మహారాష్ట్రలోని అమరావతికి చెందిన ఒక ఆటోడ్రైవర్ తన అత్యద్భుతమైన ఇంగ్లిష్ స్కిల్స్‌తో అటు ప్రయాణీకులను, ఇటు ఇంటర్నెట్ను ఆశ్చర్యంలో ముంచెత్తాడు. విదేశాల్లో చదువుకుని వచ్చినట్టుగా ఈ ఆటోవాలా ఇంగ్లీష్ భాషను దంచి పడేస్తున్నాడు. ఇది గమనించిన ఆయన ప్యాసెంజర్, ఇన్స్టాగ్రామ్ యూజర్ ఒకరు ఈ వీడియోను షేర్ చేశారు. ‘‘ఆయన ఇంగ్లిష్‌లో అంత సులువుగా మాట్లాడుతుండటం చూసి నేనే ఆశ్చర్యపోయాను.కొద్దిసేపు అలా ఉండిపోయాను’’వ్యాఖ్యానించాడు. ఇది చూసిన నెటిజన్లు ఆటోవాలా ఇంగ్లిష్‌కు ఫిదా అవుతున్నారు. వావ్ అంటూ కమెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by BHUSHAN🐻🧋 (@kon_bhushan1222)అంతేకాదు ఇది ఇంటర్నేషన లాంగ్వేజ్.. ఇంగ్లీష్ వస్తే లండన్, అమెరికా, ప్యారిస్ లాంటి ప్రాంతాలకు ప్రపంచంలో ఎక్కడికైనా వెళ్లేందుకు వీలుగా ఇంగ్లీష్ నేర్చుకోవాలని కూడా ఆయన సిఫార్సు చేశారు. -
హరితవనంగా ఆటో.. ఎక్కడ ఉందో తెలుసా?
సాక్షి, విశాఖపట్నం: ఇంటి పెరట్లో.. మిద్దెలపైన మొక్కలు పెంచడం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటోను హరితవనంగా మార్చాడు ఓ ఆటోవాలా. పర్యావరణ పరిరక్షణకు తన ఆటోకు చుట్టూ కుండీలను ఏర్పాటు చేసి వాటిలో పచ్చని మొక్కలను పెంచుతున్నాడు. ఇలా ఐదేళ్లుగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు డేవిడ్. గాజువాక గణపతినగర్ అతని నివాసం. కాకినాడ జిల్లా హెచ్.కొత్తూరు నుంచి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం గాజువాక వచ్చాడు డేవిడ్. అక్కడ పాసింజర్ ఆటో కొనుక్కుని నడుపుతున్నాడు. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న డేవిడ్‌కు తానుంటున్న అద్దె ఇంట్లో వాటిని పెంచడానికి స్థలం లేదు. దీంతో తన ఆటోలోనే వాటిని పెంచాలన్న ఆలోచన కలిగింది. ఆటోకు కుడివైపున, హ్యాండిల్‌కు ఇరువైపులా బోల్టులు బిగించి కుండీలను స్థిరంగా ఏర్పాటు చేసి వాటిలో అందమైన మొక్కల పెంపకం ప్రారంభించాడు. వీటిలో ఆరోగ్యాన్నిచ్చే పసుపు మొక్కలు, సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొరవంతో పాటు మనీప్లాంట్, పూలమొక్కలు వెరసి 11 రకాల మొక్కలను పెంచుతున్నాడు. అంతేకాదు ఆటోకు ముందు భాగంలో, అద్దానికి పైన, ఆటో లోపల కాళ్లు ఉంచే చోట్ల పచ్చని మ్యాట్లను కూడా అమర్చాడు. ఇలా ఆటో లోపల, బయట పచ్చదనంతో నింపేశాడు. పసుపు పచ్చని ఆటో చుట్టూ ఆకుపచ్చని మొక్కలతో ఆ ఆటో రోడ్లపై వెళ్తుంటే చూసే వారికి కనువిందు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముచ్చట పడిన వారు ఈ ఆటో ఫొటోలను కూడా తీసుకుంటున్నారు. స్కూలు పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే డేవిడ్.. తన ఆటోలో మొక్కలు, పచ్చదనాన్ని చూసి వారు మురిసిపోతుంటారు. వీటిని ఈ స్కూలు పిల్లలు గాని, డేవిడ్ పరిసర ప్రాంతాల వారు గాని పాడు చేయరు. అన్నట్టు.. డేవిడ్ ఆటోలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవు గత్తాన్ని తన సొంతూరు నుంచి ప్రత్యేకంగా తెస్తుంటాడు. ఒకసారి తెచ్చిన గత్తం ఐదారు నెలలకు సరిపోతుంది. పచ్చదనంపై మమకారంతో.. చిన్నప్పట్నుంచి నాకు పచ్చదనం అంటే ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మేలు చేస్తాయని తెలుసు. నేనుంటున్న అద్దె ఇంట్లో మొక్కల పెంపకానికి జాగా లేదు. అందుకే నా ఆటోలో శాశ్వతంగా మొక్కలు ఏర్పాటు చేస్తే పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని నా వంతు కాపాడవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పగలంతా నగరంలో తిరిగి రాత్రి వేళ ఆ మొక్కలకు నీరు పోస్తాను. ఇక నా ఆటోలో ప్రయాణించే వారు పచ్చని పార్కులో కూర్చొని జర్నీ చేస్తున్న అనుభూతి పొందుతున్నామని చెబుతుంటారు. ఆ మాటలు వింటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది. – ఎం.డేవిడ్, ఆటోడ్రైవర్, గాజువాక -
టెన్త్ ఫెయిల్, కానీ మనోడి స్టోరీ రాజమౌళికి తెలిస్తే ఇక సినిమానే!?
బెర్న్: అబ్బో.. మనోడి స్టోరీ మామూలుగా లేదుగా. అచ్చం రాజమౌళి సినిమా బ్యాక్ డ్రాప్ లాగే ఉందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఇంతకీ ఈ స్టోరీ ఎవరిదా' అని అనుకున్నారా?! ఓ ఆటోవాలాది. టెన్త్ ఫెయిల్. కానీ త్వరలో సొంతంగా రెస్టారెంట్ ప్రారంభించబోతున్నాడు. అదీ ఫ్రాన్స్‌లో జైపూర్ మధ్యతరగతి కుటుంబానికి చెందిన రంజిత్ సింగ్ చిన్నవయస్సు నుంచే అనేక అవమానాల్ని ఎదుర్కొన్నాడు. స్థానికులు తన పేదరికంపై సూటిపోటి మాటలతో వేధించేవారు. పేదవాడిగా పుట్టడం నేరమా..? నేను నా పేదరికంతో పోరాడుతున్నాను. మీరు నన్ను మరింత కిందికి లాగుతున్నారంటూ వేధనకు గురైన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఎంత పేదరికంలో ఉన్నా తాను జీవితంలో ఏదో సాధించాలని కుటుంబ సభ్యులు రంజిత్ కు అండగా నిలిచారు. బాగా చదివించాలని స్కూల్ కి పంపించారు. కానీ రంజిత్ 10 పదో తరగతి ఫెయిల్ అయ్యాడు. దీంతో కుటుంబ పోషణ నిమిత్తం ఆటో డ్రైవర్‌గా మారాడు. కానీ ఏదో ఒకటి చేయాలనే సంకల్పం ఉంది. ఆ సంకల్పమే బిజినెస్ మ్యాన్ గా, ఫేమస్ యూట్యూబర్ గా మార్చేసింది. చదవండి: ఆమెకు 19 మంది భర్తలు..! ప్రతిఏడు జైపూర్‌కు దేశ విదేశాలనుంచి టూరిస్ట్‌లు వస్తుండేవారు. టూరిస్ట్‌లను ఆకట్టుకునేందుకు స్థానిక ఆటో డ్రైవర్లు విదేశీ భాషల్ని నేర్చుకొని, వారికి టూరిస్ట్ గైడ్ గా ఉపాధి పొందేవారు. రంజిత్‌కు ఆ ఐడియా బాగా నచ్చింది. అదే ఐడియాతో విదేశీ భాషల్ని నేర్చుకొని వ్యాపారాన్ని ప్రారంభించాలని అనుకున్నాడు. అయితే ఓ రోజు ఫ్రాన్స్ నుంచి ఓ యువతి జైపూర్ చూసేందుకు వచ్చింది. ఆ అమ్మాయి రంజిత్ సింగ్ ఆటో ఎక్కడం. జైపూర్ అంతా తన ఆటోలో తిప్పి చూపించడంతో వారిద్దరి మధ్య స్నేహం ప్రేమగా మారింది. ఆ యువతి తిరిగి ఫ్రాన్స్ కు వెళ్లిపోయింది. అప్పుడప్పుడు రంజిత్ ప్రియురాలితో వీడియో కాల్లో మాట్లాడేవాడు. అంతా బాగుందని రంజిత్ సింగ్ తన ఆశయాన్ని మర్చిపోలేదు. ఎలాగైనా ఫ్రాన్స్‌కు వెళ్లాలి. అక్కడే సెటిల్ అవ్వాలి. టెన్త్ ఫెయిల్. చేసేది ఆటోడ్రైవర్. అదెలాసాధ్యం అవుతుందని అనుకున్నాడు. ప్రియురాలి ప్రోత్సాహంతో ఫ్రెంచ్ లాంగ్వేజ్ నేర్చుకొని ఫ్రాన్స్ వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఆ ప్రయత్నాల్లో చదువు లేదన్న కారణంతో వీసా రిజెక్ట్ చేశారు పాస్ పోర్ట్ అధికారులు. అదే సమయంలో ప్రియురాలు ఫ్రాన్స్ నుంచి ఇండియాకి రావడం. ఇండియాకు వచ్చిన వెంటనే ఎంబసీ అధికారుల్ని రిక్వెస్ట్ చేయడంతో రంజిత్‌కు ఫ్రాన్స్‌కు వెళ్లేందుకు మూడు నెలల విజిటింగ్ వీసా ఇచ్చారు. కోటి ఆశలతో విజిటింగ్ వీసాతో ఫ్రాన్స్ లోకి అడుగు పెట్టాడు. అడుగుపెట్టిన వెంటనే రంజిత్ కు అక్కడి వాతావరణం, ఆహారపు అలవాట్లు బాగా నచ్చాయి. దీంతో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి, యూట్యూబ్ లో ఫ్రాన్స్ గురించి వివరిస్తూ వీడియోలు చేస్తున్నాడు. మరోవైపు రెస్టారెంట్ లో జాబ్ చేస్తున్నాడు. 2014లో ప్రియురాల్ని వివాహం చేసుకున్న రంజిత్ కు కొడుకు కూడా ఉన్నాడు. మరికొద్ది రోజుల్లో స్విట్జర్ లాండ్ లోని జెనీవాలో రెస్టారెంట్‌ను స్టార్ట్ చేయాలనే కలను నెరవేర్చుకోబోతున్నాడు. ప్రస్తుతం ఈ ఆటోవాలా కథ సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతోంది. దీంతో అబ్బో మనోడి స్టోరీ రాజమౌళి సినిమాను మించిపోయిందే. రాజమౌళికి తెలిస్తే కచ్చితంగా సినిమా తీస్తారంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. -
బిల్లు చూసిన టెకీకి ఊహించని షాక్
ముంబై : ఆటోలో ప్రయాణించే ఓ వ్యక్తికి ఊహించని షాక్ తగిలింది. బెంగుళూరుకు చెందిన ఓ టెకీ ఉద్యోగ రీత్యా పూణెలో నివసిస్తున్నాడు. ఈ క్రమంలో తన నివాసం నుంచి ఆఫీస్‌కు వెళ్లడానికి బుధవారం ఉదయం కాట్రాజ్ ప్రాంతం వరకు బస్సులో వచ్చాడు. అక్కడి నుంచి తన కార్యాలయం ఉన్న ఎరవాడ ప్రాంతం 14 కిలోమీటర్ల దూరంలో ఉంది. సమయానికి బస్సులు రాకపోవడంతో క్యాబ్ బుక్ చేసుకుందాం అనుకొని చూస్తే క్యాబ్‌లు కూడా అందుబాటులో లేకపోడంతో ఆటో మాట్లాడుకొని వెళ్లాడు. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. కానీ ఇప్పుడే అసలు కథ మొదలైంది. ఆఫీస్ వద్ద ఆటో దిగగానే మీటర్‌పై ధర చూసిన సాఫ్ట్వేర్ ఉద్యోగి షాక్‌కు గురయ్యాడు. తను ఆటోలో ప్రయాణించిన దూరం కేవలం 14.5 కిలోమీటర్లు మాత్రమే. అయితే నమ్మశక్యం కాని విధంగా మీటర్‌పై రూ. 4300 బిల్లు కనిపించింది. దీంతో కంగుతిన్న సదరు టెకీ ఇదేంటని.. డ్రైవర్‌ను ప్రశ్నించగా.. పూర్తి డబ్బులు చెల్లించాల్సిందేనని అతడు దబాయించాడు. అనంతరం డ్రైవర్‌ను నిలదీయగా తను(ఆటో) నగరంలోకి ప్రవేశించడానికి రూ. 600, తిరిగి వెళ్లడానికి రూ.600 కట్టవలసి ఉంటుందని, మిగతావి తన ప్రయాణానికి అయిన డబ్బులని అసలు విషయం బయటపెట్టాడు. దీంతో చేసేదేం లేక మొత్తం డబ్బులు కట్టేశాడు. అనంతరం ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మానవత్వమా..మన్నిస్తావా
మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడూ. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడూ అని కవి ఆక్రోశిస్తే.. అందులో అతిశయోక్తి ఏముంది? అక్కడక్కడా సౌహార్దం వెల్లివిరుస్తూ ఉన్నా.. క్రూరత్వం కోర విసిరే సంఘటనలు మన దృష్టికి వచ్చినప్పుడు మమత మృగ్యమైపోతోందన్న భావన కలుగుతుంది. మానవత మనల్ని మన్నిస్తుందా? అని మనసు చివుక్కుమంటుంది. అటువంటి విషాద సంఘటన కేజీహెచ్ వద్ద చోటుచేసుకుంది. డాబాగార్డెన్స్: భీమిలికి చేరువలోని గొల్లలపాలేనికి చెందిన శాంతమ్మ జీవితాన్ని శోకం కడలి అలల మాదిరి కమ్మేసింది. పేద కుటుంబానికి చెందిన ఆమె బతుకులో విషాదం పదేపదే ఉప్పెనలా ఉప్పొంగింది. ఆమె భర్త సూర్యారావు కార్పెంటర్. చిన్నాచితకా పనులు చేసి బండి లాక్కొచ్చేవాడు. లేకలేక కలిగిన ఓ కుమారుడితో బతుకిలా సాగిపోతే చాలని ఆమె ఆరాటపడింది. అయితే విధి ఆలోచన వేరేవిధంగా ఉంది. కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో భర్త కన్నుమూయడంతో ఆమె జీవితం అతలాకుతలమైంది. ఒక్కగానొక్క కొడుకు మహేష్ కోసం ఆమె బతుకు గడుపుతూ ఉంటే.. దురదృష్టం మళ్లీ కాటేసింది. పదేళ్ల కొడుకుకు బోన్ క్యాన్సర్ సోకింది. పెద్ద ఆస్పత్రులలో చికిత్స చేయించే శక్తిలేని ఆమె కేజీహెచ్‌ను ఆశ్రయించింది. అక్కడ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న మహేష్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. పీడించిన కాఠిన్యంకడుపున పుట్టిన చిన్నారి కానరాని లోకాలకు తరలివెళ్లిపోతే.. లోకాన తనకున్న ఒక్కగానొక్క ఆశా అంతర్థానమైపోతే.. శాంతమ్మ కుప్పకూలిపోయింది. సమీప బంధువులు ఆసరా ఇస్తే.. తర్వాతి కార్యక్రమం కోసం సిద్ధమైంది. అయితే.. ఆమె చేతిలో చిల్లిగవ్వ లేదు. దాంతో ఆస్పత్రిలో రోగుల సహాయకులు, కొందరు బంధువులు రూ.3.400 పోగు చేసి ఆమెకు అందించారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లే తాహతు లేక శాంతమ్మ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో ఆ ఘట్టం పూర్తి చేయాలనుకుంది. దాంతో కేజీహెచ్ సిబ్బంది చిన్నా అనే ఆటో డ్రైవర్‌ను పిలిచి ఆమెకు అప్పజెప్పారు. అతడు తన ఎదురుగా ఉన్న మహిళ దీనావస్థను విస్మరించాడు. ఆమె శోకాన్ని కాస్తయినా పట్టించుకోకుండా క్రూరంగా వ్యవహరించాడు. మృతదేహం తరలింపునకు, ఖననానికి రూ.3500 ఖర్చవుతుందని ఖరాఖండీగా చెప్పాడు. తనదగ్గర అంత లేదన్నా వినిపించుకోకుండా అడిగినంతా ఇస్తేనే పని జరుగుతుందని నిష్కర్షగా చెప్పాడు. తన దగ్గర రూ. 3400 మాత్రమే ఉన్నాయని ఆమె చెబితే, ససేమిరా అన్నాడు. దాంతో ఆమె వారినీ వీరినీ ప్రాధేయపడి మరో వంద సంపాదించి అతడికి ముట్టజెప్పింది. అంతవరకు అతడు బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్ ఓపీ గేటు ఎదురుగా ఆటోలోనే ఉంచి.. అంతా అందుకున్న తర్వాత బుధవారం వేకువ జామున శ్మశానవాటికకు తరలించాడు. అక్కడ సిబ్బందికి రూ. 500 మాత్రమే ఇచ్చి మాయమయ్యాడు. ఆమె దీనగాథ తెలుసుకున్న శ్మశాన వాటిక సిబ్బంది ఖననం పూర్తి చేసి తామే రూ. 600 అందించి ఆ తల్లిని సాగనంపారు. డబ్బుల్లేవని ప్రాధేయపడినా... నా దగ్గర అంత డబ్బు లేదని ఆటో బాబుని వేడుకు న్నా. కానీ కనికరించ లేదు. 3,500 లు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పాడు. చేసేదేమీ లేక వాళ్లనూ వీళ్లనూ మరో వంద అడిగి రూ.3,500 ఆటో బాబుకు ఇచ్చాను. –శాంతమ్మ ఎవరూ లేరని చెప్పినా.. శాంతమ్మకు ఎవరూ లేరని చెప్పాం. అయినా అతడు కనికరించలేదు. చివరికి ఎలా అయితేనేం మొత్తం డబ్బు పుచ్చుకుని బాబు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. –భవాని, స్థానికురాలు, శాంతమ్మ బంధువు -
ఆటోవాలాపై అమెరికన్ లేడీ ప్రతీకారం
హైదరాబాద్: అవసరం లేనప్పుడు ఐదారుసార్లు ఎదురుపడే ఆటోవాలాలు.. అర్జెంట్‌గా వెళ్లాలనుకున్నప్పుడు మాత్రం కనిపిస్తే ఒట్టు! ఒక వేళ కనిపించినా సవాలక్ష కండిషన్లు. నోటికొచ్చినంత డిమాండ్ చేస్తారు. మీటర్ వేయమంటే కుదరదంటారు. సిటీలో మీ ప్రయాణం మా చెప్పు- చేత (హ్యాండిల్, బ్రేక్) ల్లో ఉందని బిల్డప్ ఇస్తారు. అసలేం చేస్తే ఈ ఆటోవాలాలు మనం చెప్పేది వింటారు? వాళ్లు అడిగినంత ఇచ్చేసి అయినా తాము వెళ్లాల్సిన చోటుకి వెళతారు కొందరు. అయితే ఈ సమస్యకు బాగా ఆలోచించి సరికొత్త పంథాను కనిపెట్టింది ఓ అమెరికన్ లేడీ. హైదరాబాద్‌కు చిరపరిచితురాలైన ఆమె..మాటవినని ఓ ఆటోవాలాతో సాగించిన వెరైటీ బేరసారాల వీడియో ప్రస్తుతం సోషల్ వెబ్‌సైట్స్‌లో హల్చల్ చేస్తోంది. జార్జిటౌన్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ సి. క్రిస్టీన్ ఫెయిర్.. దక్షిణ ఆసియా భాషలు, సాంస్కృతిక మార్పులు, తదితర అంశాలపై పరిశోధనలు చేస్తోంది. ఆ క్రమంలోనే 1997 నుంచి ఎన్నోసార్లు హైదరాబాద్‌కు వచ్చి వెళ్లింది. ఉర్దూ హిందీ మిక్స్ చేసినట్లుండే హైదరాబాదీ లాంగ్వేజ్ ఆమెకు కొట్టినపిండి. మూడురోజుల కిందట ఆమె బసచేసిన హోటల్ నుంచి బయటికొచ్చి ఓ ఆటోను కేకేసింది.. చార్మినార్‌కు వెళ్లాలని పిలిచింది ఫారినర్ కాబట్టి జేబు నిండిందన్న సంతోషంతో దగ్గరికెళ్లాడు ఆటోవాలా. 'మీటర్ మీద చార్మినార్‌కు వెళదాం' అని క్రిస్టీన్.. 'అలా కుదరదు అడిగినంత ఇస్తేనే వస్తాను' అని ఆటోవాలా వాదులాడుకున్నారు. కొద్దిసేపటి తర్వాత క్రిస్టీన్‌కు చిర్రెత్తుకొచ్చింది. అమాంతం ఆటోలో కూలబడి మొబైల్ ఫోన్ కెమెరా ఆన్ చేసి.. ఆటోవాలా తీరును వివరిస్తూ వీడియో తీసింది. 'అవసరమైతే రోజంతా ఖాళీగా ఉంటాను కానీ మీటర్ మాత్రం వేయను' అనే ఆటోవాడి మాటల్ని రిపీట్ చేసింది. మధ్యమధ్యలో బాలీవుడ్ సాంగ్స్‌ను హమ్ చేసింది. 'ఈ గోలేంట్రా బాబూ..' అని తలబాదుకుంటూనే చివరికి క్రిస్టినా చెప్పినట్లే మీటర్ రేటుకే ఆమెను చార్మినార్ లో దిగబెట్టేందుకు ఓకే అన్నాడు ఆటోవాలా. మీరు కూడా ఈ టెక్నీక్ ఫాలో అయ్యి.. సరసమైన ధరకు ఆటోప్రయాణం చేయాలనుకుంటే ఒక్క విషయం గుర్తుంచుకోవాలి. ఆవిడంటే ఫారినర్ కాబట్టి ఆటోలో అంత రచ్చ చేసినా పోనీలే అని అనుకున్నాడు మన ఆటోవాలా. అదే లోకల్ వాళ్లైతే ఎలా బదులిస్తాడో నగరవాసులకు కొత్తగా చెప్పేదేమీ ఉండదనుకుంటా!!