సాక్షి, విశాఖపట్నం: ఇంటి పెరట్లో.. మిద్దెలపైన మొక్కలు పెంచడం సహజం. అందుకు భిన్నంగా తన బతుకు బండి అయిన ఆటోను హరితవనంగా మార్చాడు ఓ ఆటోవాలా. పర్యావరణ పరిరక్షణకు తన ఆటోకు చుట్టూ కుండీలను ఏర్పాటు చేసి వాటిలో పచ్చని మొక్కలను పెంచుతున్నాడు. ఇలా ఐదేళ్లుగా తన ఆటోలో ఎక్కిన ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచుతున్నాడు. ఆ ఆటో డ్రైవర్ పేరు డేవిడ్. గాజువాక గణపతినగర్ అతని నివాసం.
కాకినాడ జిల్లా హెచ్.కొత్తూరు నుంచి ఉపాధి కోసం కొన్నాళ్ల క్రితం గాజువాక వచ్చాడు డేవిడ్. అక్కడ పాసింజర్ ఆటో కొనుక్కుని నడుపుతున్నాడు. మొక్కల పెంపకంపై ఆసక్తి ఉన్న డేవిడ్‌కు తానుంటున్న అద్దె ఇంట్లో వాటిని పెంచడానికి స్థలం లేదు. దీంతో తన ఆటోలోనే వాటిని పెంచాలన్న ఆలోచన కలిగింది. ఆటోకు కుడివైపున, హ్యాండిల్‌కు ఇరువైపులా బోల్టులు బిగించి కుండీలను స్థిరంగా ఏర్పాటు చేసి వాటిలో అందమైన మొక్కల పెంపకం ప్రారంభించాడు. వీటిలో ఆరోగ్యాన్నిచ్చే పసుపు మొక్కలు, సుగంధ పరిమళాన్ని వెదజల్లే మొరవంతో పాటు మనీప్లాంట్, పూలమొక్కలు వెరసి 11 రకాల మొక్కలను పెంచుతున్నాడు.
అంతేకాదు ఆటోకు ముందు భాగంలో, అద్దానికి పైన, ఆటో లోపల కాళ్లు ఉంచే చోట్ల పచ్చని మ్యాట్లను కూడా అమర్చాడు. ఇలా ఆటో లోపల, బయట పచ్చదనంతో నింపేశాడు. పసుపు పచ్చని ఆటో చుట్టూ ఆకుపచ్చని మొక్కలతో ఆ ఆటో రోడ్లపై వెళ్తుంటే చూసే వారికి కనువిందు చేస్తోంది. ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. ముచ్చట పడిన వారు ఈ ఆటో ఫొటోలను కూడా తీసుకుంటున్నారు.
స్కూలు పిల్లలను ఎక్కువగా తీసుకెళ్లే డేవిడ్.. తన ఆటోలో మొక్కలు, పచ్చదనాన్ని చూసి వారు మురిసిపోతుంటారు. వీటిని ఈ స్కూలు పిల్లలు గాని, డేవిడ్ పరిసర ప్రాంతాల వారు గాని పాడు చేయరు. అన్నట్టు.. డేవిడ్ ఆటోలో మొక్కలు ఆరోగ్యంగా పెరగడానికి అవసరమైన ఆవు గత్తాన్ని తన సొంతూరు నుంచి ప్రత్యేకంగా తెస్తుంటాడు. ఒకసారి తెచ్చిన గత్తం ఐదారు నెలలకు సరిపోతుంది.
పచ్చదనంపై మమకారంతో..
చిన్నప్పట్నుంచి నాకు పచ్చదనం అంటే ఇష్టం. పర్యావరణ పరిరక్షణకు మొక్కలు మేలు చేస్తాయని తెలుసు. నేనుంటున్న అద్దె ఇంట్లో మొక్కల పెంపకానికి జాగా లేదు. అందుకే నా ఆటోలో శాశ్వతంగా మొక్కలు ఏర్పాటు చేస్తే పచ్చదనంతో పాటు పర్యావరణాన్ని నా వంతు కాపాడవచ్చని భావించి ఈ నిర్ణయం తీసుకున్నాను. పగలంతా నగరంలో తిరిగి రాత్రి వేళ ఆ మొక్కలకు నీరు పోస్తాను. ఇక నా ఆటోలో ప్రయాణించే వారు పచ్చని పార్కులో కూర్చొని జర్నీ చేస్తున్న అనుభూతి పొందుతున్నామని చెబుతుంటారు. ఆ మాటలు వింటే నాకు చెప్పలేనంత సంతోషంగా ఉంటుంది.
– ఎం.డేవిడ్, ఆటోడ్రైవర్, గాజువాక
Comments
Please login to add a commentAdd a comment