శాంతమ్మ, బంధువు భవాని సమక్షంలో అంత్యక్రియలు నిర్వర్తిస్తున్న శ్మశాన వాటిక సిబ్బంది
మాయమైపోతున్నాడమ్మా.. మనిషన్న వాడూ. మచ్చుకైనా లేడు చూడూ.. మానవత్వం ఉన్నవాడూ అని కవి ఆక్రోశిస్తే.. అందులో అతిశయోక్తి ఏముంది? అక్కడక్కడా సౌహార్దం వెల్లివిరుస్తూ ఉన్నా.. క్రూరత్వం కోర విసిరే సంఘటనలు మన దృష్టికి వచ్చినప్పుడు మమత మృగ్యమైపోతోందన్న భావన కలుగుతుంది. మానవత మనల్ని మన్నిస్తుందా? అని మనసు చివుక్కుమంటుంది. అటువంటి విషాద సంఘటన కేజీహెచ్ వద్ద చోటుచేసుకుంది.
డాబాగార్డెన్స్: భీమిలికి చేరువలోని గొల్లలపాలేనికి చెందిన శాంతమ్మ జీవితాన్ని శోకం కడలి అలల మాదిరి కమ్మేసింది. పేద కుటుంబానికి చెందిన ఆమె బతుకులో విషాదం పదేపదే ఉప్పెనలా ఉప్పొంగింది. ఆమె భర్త సూర్యారావు కార్పెంటర్. చిన్నాచితకా పనులు చేసి బండి లాక్కొచ్చేవాడు. లేకలేక కలిగిన ఓ కుమారుడితో బతుకిలా సాగిపోతే చాలని ఆమె ఆరాటపడింది.
అయితే విధి ఆలోచన వేరేవిధంగా ఉంది. కొన్నాళ్ల క్రితం అనారోగ్యంతో భర్త కన్నుమూయడంతో ఆమె జీవితం అతలాకుతలమైంది. ఒక్కగానొక్క కొడుకు మహేష్ కోసం ఆమె బతుకు గడుపుతూ ఉంటే.. దురదృష్టం మళ్లీ కాటేసింది. పదేళ్ల కొడుకుకు బోన్ క్యాన్సర్ సోకింది.
పెద్ద ఆస్పత్రులలో చికిత్స చేయించే శక్తిలేని ఆమె కేజీహెచ్‌ను ఆశ్రయించింది. అక్కడ పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న మహేష్ మంగళవారం రాత్రి కన్నుమూశాడు. పీడించిన కాఠిన్యంకడుపున పుట్టిన చిన్నారి కానరాని లోకాలకు తరలివెళ్లిపోతే.. లోకాన తనకున్న ఒక్కగానొక్క ఆశా అంతర్థానమైపోతే.. శాంతమ్మ కుప్పకూలిపోయింది.
సమీప బంధువులు ఆసరా ఇస్తే.. తర్వాతి కార్యక్రమం కోసం సిద్ధమైంది. అయితే.. ఆమె చేతిలో చిల్లిగవ్వ లేదు. దాంతో ఆస్పత్రిలో రోగుల సహాయకులు, కొందరు బంధువులు రూ.3.400 పోగు చేసి ఆమెకు అందించారు. కుమారుడి మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువెళ్లే తాహతు లేక శాంతమ్మ కాన్వెంట్ జంక్షన్‌లోని హిందూ శ్మశానవాటికలో ఆ ఘట్టం పూర్తి చేయాలనుకుంది.
దాంతో కేజీహెచ్ సిబ్బంది చిన్నా అనే ఆటో డ్రైవర్‌ను పిలిచి ఆమెకు అప్పజెప్పారు. అతడు తన ఎదురుగా ఉన్న మహిళ దీనావస్థను విస్మరించాడు. ఆమె శోకాన్ని కాస్తయినా పట్టించుకోకుండా క్రూరంగా వ్యవహరించాడు. మృతదేహం తరలింపునకు, ఖననానికి రూ.3500 ఖర్చవుతుందని ఖరాఖండీగా చెప్పాడు.
తనదగ్గర అంత లేదన్నా వినిపించుకోకుండా అడిగినంతా ఇస్తేనే పని జరుగుతుందని నిష్కర్షగా చెప్పాడు. తన దగ్గర రూ. 3400 మాత్రమే ఉన్నాయని ఆమె చెబితే, ససేమిరా అన్నాడు. దాంతో ఆమె వారినీ వీరినీ ప్రాధేయపడి మరో వంద సంపాదించి అతడికి ముట్టజెప్పింది.
అంతవరకు అతడు బాలుడి మృతదేహాన్ని కేజీహెచ్ ఓపీ గేటు ఎదురుగా ఆటోలోనే ఉంచి.. అంతా అందుకున్న తర్వాత బుధవారం వేకువ జామున శ్మశానవాటికకు తరలించాడు. అక్కడ సిబ్బందికి రూ. 500 మాత్రమే ఇచ్చి మాయమయ్యాడు. ఆమె దీనగాథ తెలుసుకున్న శ్మశాన వాటిక సిబ్బంది ఖననం పూర్తి చేసి తామే రూ. 600 అందించి ఆ తల్లిని సాగనంపారు.
డబ్బుల్లేవని ప్రాధేయపడినా...
నా దగ్గర అంత డబ్బు లేదని ఆటో బాబుని వేడుకు న్నా. కానీ కనికరించ లేదు. 3,500 లు ఇస్తేనే తీసుకెళ్తానని చెప్పాడు. చేసేదేమీ లేక వాళ్లనూ వీళ్లనూ మరో వంద అడిగి రూ.3,500 ఆటో బాబుకు ఇచ్చాను. –శాంతమ్మ
ఎవరూ లేరని చెప్పినా..
శాంతమ్మకు ఎవరూ లేరని చెప్పాం. అయినా అతడు కనికరించలేదు. చివరికి ఎలా అయితేనేం మొత్తం డబ్బు పుచ్చుకుని బాబు మృతదేహాన్ని తీసుకెళ్లాడు. –భవాని, స్థానికురాలు, శాంతమ్మ బంధువు
Comments
Please login to add a commentAdd a comment