సాక్షి, హైదరాబాద్: ఉక్కుమనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న రాష్ట్ర వ్యాప్తంగా జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. దేశ సమైక్యత, సమగ్రత, భద్రతకు ఎదురవుతున్న సవాళ్ల పట్ల ప్రజలందరికీ అవగాహన కల్పించేందుకు జాతీయ సమైక్య దినోత్సవాన్ని నిర్వహించాలని సూచిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు జిల్లా కేంద్రాల్లో కూడా సమైక్యత పరుగు నిర్వహించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగులందరితో జాతీయ సమైక్యత ప్రతిజ్ఞ చేయించాలని సూచించారు.