కొత్త కళ
మరో నాలుగు బస్తీల్లో డబుల్‌బెడ్‌రూమ్ ఇళ్లు
పేదలకు సర్కారు దసరా కానుక
నేడు శంకుస్థాపన
సిటీబ్యూరో: స్లమ్ ఫ్రీ సిటీలో భాగంగా నగరంలో మరో నాలుగు బస్తీల్లోని ప్రజలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ బోయిగూడ ఐడీహెచ్ కాలనీ తరహాలో గ్రేటర్‌లోని నాలుగు నియోజకవర్గాల పేదలకు దసరా కానుకగా ఇవి ప్రారంభం కానున్నాయి. ఈ ఇళ్లకు నేడు (గురువారం) శంకుస్థాపన చేయనున్నారు. రాష్ట్ర మంత్రులు నాయిని నరసింహారెడ్డి, టి.పద్మారావు, మహేందర్‌రెడ్డి, కె.టి.రామారావులు వీటికి శంకుస్థాపనలు చేస్తారు. కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయతో పాటు పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమాల్లో పాల్గొంటారు. సనత్‌నగర్ నియోజకవర్గంలో కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే, మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ అధ్యక్షత వహించనున్నారు. కూకట్‌పల్లి నియోజకవర్గంలోని బాలానగర్ క్రాస్‌రోడ్స్ దగ్గర చిత్తారమ్మబస్తీ, సనత్‌నగర్ నియోజకవర్గంలోని హమాలీ బస్తీ, సికింద్రాబాద్ నియోజకవర్గంలోని చిలకలగూడ దోబీఘాట్, ఎల్‌బీనగర్ నియోజకవర్గంలోని మన్సూరాబాద్ దగ్గరి ఎరుకల నాంచారమ్మ నగర్‌లలో ఈ ఇళ్ల నిర్మాణానికి స్థలాలు ఎంపిక చేశారు. బోయిగూడలోని మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్‌కూ గురువారమే శంకుస్థాపన చేయనున్నారు.
అందరికీ అవకాశం కల్పించాలని...
రజకులు తదితరుల కోసం దోబీఘాట్‌లో ఇళ్లు నిర్మిస్తుండగా... మిగతా ప్రాంతాల్లో స్థానికంగా గుడిసెల్లో, చిన్నా చితకా ఇళ్లల్లో తలదాచుకుంటున్న వారి కోసం డబుల్ బెడ్‌రూమ్ ఇళ్లు నిర్మించనున్నారు. జ్లీపస్ 2 పద్ధతిలోనా లేక అంతకంటే ఎక్కువ అంతస్తుల్లోనా అనే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదు. లబ్ధిదారుల సంఖ్య, స్థానికుల నుంచి ఎదురేయ్యే అభ్యంతరాలు తదితరమైనవి పరిగణనలోకి తీసుకొని దీన్ని ఖరారు చేయనున్నారు. ఎక్కువ అంతస్తుల్లో ఎక్కువ ఇళ్లు నిర్మిస్తే స్థానికంగా ఉంటున్న అందరికీ అవకాశం కల్పించవచ్చని భావిస్తున్నారు.
త్వరలో ఐడీహెచ్ కాలనీ ప్రారంభం
గత సంవత్సరం దసరా రోజున శంకుస్థాపన జరిగిన ఐడీహెచ్ కాలనీలోని ఇళ్లను గురువారం ప్రారంభించాలని తొలుత భావించారు. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమరావతి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్తుండటం.. పూర్తయిన ఇళ్లకు రంగులు, రహదారుల నిర్మాణం వంటివి పూర్తి కావాల్సి ఉండటంతో కొద్ది రోజుల తర్వాత ప్రారంభించాలని యోచిస్తున్నారు.
ఏర్పాట్లు పూర్తి
చిలకలగూడ : చిలకలగూడ దోబీఘాట్ స్థలంలో సుమారు 200 ఇళ్ల నిర్మాణానికి గురువారం పంచాయితీరాజ్, ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శంకుస్థాపన చేసేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ మేరకు ఆబ్కారీ మంత్రి పద్మారావు బుధవారం రాత్రి దోబీఘాట్ స్థలాన్ని సందర్శించి హౌసింగ్, రెవెన్యూ అధికారులు, క్రాంతి రజక అభివృద్ధి సంఘం సభ్యులతో చర్చించారు. శంకుస్థాపన పనులను పరిశీలించారు. చిలకలగూడ దోబీఘాట్‌పై ఆధారపడి సుమారు 200 కుటుంబాలు జీవిస్తున్నాయి. ఏళ్ల తరబడి సొంత ఇళ్లు లేక వీరంతా ఇబ్బందులు పడుతున్నారు. ఇన్నాళ్లకు మంత్రి పద్మారావు చొరవతో హౌసింగ్‌స్కీం అమలు చేసేందుకు అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.