వ్యవసాయశాఖలో కలిపేస్తారేమో..?
సీఎం వ్యాఖ్యలతో రిజిస్ట్రేషన్లశాఖలో ఆందోళన
- తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు ఇస్తే తామెందుకని ప్రశ్న
- ప్రస్తుతమున్న 140 మంది సబ్ రిజిస్ట్రార్లలో
- 80 మందే గ్రామీణ ప్రాంతాల్లో మిగిలిన 520 మండలాల రిజిస్ట్రేషన్లు తహశీల్దార్ల ఆధ్వర్యంలోనే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రికార్డుల ప్రక్షాళన నేపథ్యంలో రెవెన్యూశాఖలోని వీఆర్వోలు, వీఆర్‌ఏలను వ్యవసాయశాఖలో విలీనం చేస్తారన్న ప్రచారం సద్దుమణగక ముందే మరో శాఖలో ఆందోళన మొదలైంది. సబ్ రిజిస్ట్రార్లు లేని మండలాల్లో తహశీల్దార్లకే రిజిస్ట్రేషన్ అధికారం ఇస్తామన్న సీఎం కేసీఆర్ వ్యాఖ్యలు ఇప్పుడు రిజిస్ట్రేషన్లశాఖలో గుబులు పుట్టిస్తున్నాయి. మండల కార్యాలయాల్లో పనిచేసే అధికారులకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు ఇస్తే తమను రెవెన్యూలో విలీనం చేసినట్లేననే చర్చ ఆ శాఖలో జరుగుతోంది. మండలాల్లో ఉండే తహశీల్దార్లకు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు ఇస్తే సంఖ్యాపరంగా తక్కువగా ఉండే సబ్ రిజిస్ట్రార్ల పరిధి తగ్గిపోతుందని, తమకన్నా 4 రెట్లు ఎక్కువగా ఉన్న తహశీల్దార్లదే రిజిస్ట్రేషన్ల వ్యవహారాల్లో పైచేయి అవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
మూడు శాఖల సమన్వయంతోనే...
వాస్తవానికి భూముల విషయంలో రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్లశాఖలు కీలకంగా వ్యవహరిస్తాయి. రికార్డుల నిర్వహణ, భూ వివాదాల పరిష్కారంలో రెవెన్యూ, మ్యాపుల తయారీ, సర్వేల కోసం సర్వేశాఖ, క్రయవిక్రయ లావాదేవీలను చట్టబద్ధం చేసేందుకు రిజిస్ట్రేషన్లశాఖ పనిచేస్తాయి. ఈ మూడు శాఖలు సక్రమంగా పనిచేస్తేనే భూ వివాదాలు, అక్రమాలకు ఆస్కారం ఉండదు. కానీ సీఎం కేసీఆర్ తాజాగా చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే రిజిస్ట్రేషన్ల బాధ్యతలు రెవెన్యూ సిబ్బందికి అప్పగిస్తారని అర్థమవుతోంది. అయితే రాష్ట్రంలో ప్రస్తుతం 140 మందికిపైగా సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. వారిలో 60 మంది అర్బన్ ప్రాంతాల్లో ఉంటే గ్రామీణ మండల ప్రాంతాల్లో ఉన్నది 80 మంది ఉన్నారు. ఇప్పుడు సబ్ రిజిస్ట్రార్ లేనిచోట్ల తహశీల్దార్లకు ఆ బాధ్యతలు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంటే సబ్ రిజిస్ట్రార్లు లేని 520కిపైగా మండలాల్లో దీనిని అమలు చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో తహశీల్దార్లే కీలకం కానున్నారని, రిజిస్ట్రేషన్లు చేసే బాధ్యతలు రెవెన్యూ అధికారులకిస్తే ఇక తామెందుకని రిజిస్ట్రేషన్ల శాఖ అధికారులు ప్రశ్నిస్తున్నారు.
పొరుగు రాష్ట్రాల్లో ఇలా...
ఇతర రాష్ట్రాల్లో తహశీ ల్దార్లకే రిజిస్ట్రేషన్ చేసే అధికారం ఇచ్చారని కొందరు ఉన్నతాధికారులు ఇచ్చిన సమాచారంతోనే ఇక్కడ కూడా అదే పద్ధతిని అమలు చేయాలని సీఎం కేసీఆర్ చెప్పారనే చర్చ రిజిస్ట్రేషన్ల శాఖలో జరుగుతోంది. అయితే ఏ రాష్ట్రంలోనూ రిజిస్ట్రేషన్ల అధికారాలు తహశీల్దార్లకు లేవని రిజిస్ట్రేషన్లశాఖ అధికారులు అంటున్నారు. కొన్ని రాష్ట్రాల్లో తహశీల్దార్ కేడర్ అధికారుల కు రిజిస్ట్రేషన్ల బాధ్యతలు ఇస్తున్నారని, అయితే వారు రిజిస్ట్రేషన్ల శాఖలోనే పనిచేస్తున్నారని, రిజిస్ట్రేషన్ల వ్యవహా రాలు తప్ప రెవెన్యూ పనులు చేయట్లేదని చెబుతున్నారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లాంటి అభివృద్ధి చెందిన దేశాల్లోనే రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పూర్తయ్యేందుకు కనీసం 80 రోజులు పడుతోందని, కానీ మన రాష్ట్రంలో మాత్రం గంటలోనే రిజిస్ట్రేషన్లు జరిగిపోవాలనే ఆలోచనతో ముం దుకెళ్లడం భవిష్యత్తులో సమస్యలు, వివాదాలకు ఆస్కారమిస్తుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.