మనీ ట్రబుల్స్
4 వేల ఏటీఎంలు అవుట్ ఆఫ్ సర్వీస్
సిటీబ్యూరో: నగరంలో మళ్లీ క్యాష్ కష్టాలు మొదలయ్యాయి. రిజర్వు బ్యాంకు నుంచి వచ్చే నగదు సరఫరాపై భారీ కోత పడింది. దీనికి తోడు శుభకార్యాలు, ఏటీఎం విత్‌డ్రాలపై అదనపు చార్జీల బాదుడు తోడవటంతో గురువారం నగరంలో ఏకంగా నాలుగువేల ఏటీఎంలలో అవుట్ ఆఫ్ సర్వీస్ బోర్డులు వేలాడదీశారు. ఇటీవలే కరెంటు, సేవింగ్ ఖాతాలపై నగదు ఉపసంహరణ పరిమితి సడలింపుతో నగరంలో భారీగా నగదు విత్‌డ్రాలు మొదలయ్యాయి. నోట్ల రద్దుకు ముందు 75 శాతం డిపాజిట్లు, 25 శాతం విత్‌డ్రా చేసే పరిస్థితి ఉండేది. ప్రస్తుతం అందుకు భిన్నంగా మారింది. కేవలం 25 శాతం మంది డిపాజిట్లు చేస్తే, మిగిలిన 75 శాతం మంది నగదును వివిధ రూపాల్లో విత్‌డ్రా చేస్తున్నారు. తొలుత బ్యాంకులకు వచ్చి తమ సేవింగ్, కరెంట్ ఖాతాల్లో డబ్బును విత్‌డ్రా చేసుకునేవారి సంఖ్య అధికంగా ఉండడంతో వచ్చిన డబ్బును వారికి సర్దేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో నేరుగా వచ్చే ఖాతాదారులకు కూడా నగదు సరిపోక పక్క బ్రాంచీల నుంచి తెచ్చిచ్చే పరిస్థితి నెలకొంటుంతోంది. దీంతో బ్యాంక్‌ను ఆనుకుని ఉన్న ఎటీఎంల (ఆన్‌సైడ్)తో పాటు బ్యాంకులకు దూరంగా ఉన్న (ఆఫ్‌సైడ్) ఏటీఎంలకూ కరెన్సీ కొరత ఏర్పడింది. ఇందులో ఆన్‌సైడ్ ఏటీఎంలలో కొద్ది మొత్తంలో నగదు పెడుతున్న బ్యాంకులు, ఆఫ్‌సైడ్ ఏటీఎంలను పూర్తిగా విస్మరిస్తున్నాయి.
ఆర్‌బీఐ నుంచి నిలిచిన సరఫరా
నగరంలో ఆరువేలకు పైగా ఉన్న ఏటీఎంలలో 80 శాతం ఏటీఎంలకు ప్రైవేటు ఏజెన్సీలు నగదును సరఫరా చేస్తున్నాయి. రిజర్వు బ్యాంకు నుంచే నగదు సరఫరా నిలిచిపోయిందని, ఈ పరిస్థితి ఈ నెలాఖరు వరకు కొనసాగుతుందని ఆ ఏజెన్సీలకు చెందిన ఓ అధికారి చెప్పారు. నగదు నియంత్రణలో భాగంగానే ఆలా వ్యవహరిస్తున్నారన్నారు. అయితే పరిమితికి మించి చేసే విత్‌డ్రాలపై చార్జీలు కూడా వసూలు చేస్తుండటంతో, ఖాతాదారులు ఒకేమారు భారీ మొత్తాన్ని డ్రా చేస్తున్నారు. దీనివల్ల కూడా మార్కెట్‌లో నగదు ఇబ్బంది వస్తోందని తెలిపారు. నగరంలో ఆన్‌లైన్, యాప్స్ ద్వారా క్యాష్‌లెస్ సర్వీసులు పొందే అవకాశం ఉన్న వారు కూడా నగదు కోసం వెంపర్లాడుతుండడం కూడా ఇబ్బందులకు కారణమన్నారు.