కాంట్రాక్టర్‌కు అడ్వాన్స్ ‘వరం’
టెండర్ నిబంధనలను సవరించి మరీ రూ. 200 కోట్ల చెల్లింపులు
తొలుత అంగీకరించని ఆర్థిక శాఖ.. ప్రభుత్వ పెద్ద ఆదేశంతో చివరకు విడుదల
సాక్షి, హైదరాబాద్: పోలవరం ప్రాజెక్టు కాంట్రాక్టు సంస్థ ట్రాన్స్‌ట్రాయ్‌కు 200 కోట్ల రూపాయలను అడ్వాన్స్‌గా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించింది. టెండర్ నిబంధనలను సవరించి మరీ ఈ చెల్లింపులను చేశారు. గత ప్రభుత్వంలోనే ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ మిషనరీ కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని కోరింది.
అయితే ఆర్థిక శాఖ మాత్రం టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ట్రాన్స్‌ట్రాయ్ పేరుమీద మిషనరీని కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ చెల్లింపు సాధ్యం కాదంది. ప్రధాన వాటా రష్యాకు చెందిన జేఈఎస్‌యూఐఎస్ (యునెటైడ్ ఇంజనీరింగ్ సర్వీసు) సంస్థ అయినందున ఆ కంపెనీ పేరుమీదనే మిషనరీ కొనుగోలు చేయాలనేది టెండర్ నిబంధనలో ఉంది.
అయితే ఇప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడంతో ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ యాజమాన్యం ప్రభుత్వ పెద్దలపై మొబిలైజేషన్ అడ్వాన్స్ కోసం ఒత్తిడి తెచ్చింది. ఆ పెద్దలు ఆ మొత్తం చెల్లించాల్సిందిగా ఆర్థిక శాఖను కోరారు. మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వడం సాధ్యం కాదని, కాంట్రాక్టులో 13 శాతమే వాటా ఉన్న ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ పేరు మీద మిషనరీ కొనుగోలు చేసినందున టెండర్ నిబంధనలకు విరుద్ధంగా ఇవ్వలేమని ఆ శాఖ అధికారులు తొలుత పేర్కొన్నారు. పోలవరం కాంట్రాక్టులో 87 శాతం వాటా రష్యాకు చెందిన జేఈఎస్‌యూఐఎస్ కంపెనీది. జాయింట్ వెంచర్ అయినందున రెండు సంస్థల పేరుమీదనే మిషనరీ కొనుగోలు చేయాల్సి ఉందని, అలా కాకుండా ట్రాన్స్‌ట్రాయ్ పేరుతో కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ ఇవ్వడం సాధ్యం కాదని స్పష్టంచేశారు.
దీంతో ఏకంగా ప్రభుత్వ పెద్ద జోక్యం చేసుకున్నారు. అవసరమైతే టెండర్ నిబంధనలను సవరించి మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వాలని ఆదేశించారు. జాయింట్ వెంచర్ పేరు మీద మిషనరీ కొనుగోలు చేయకపోయినా సరే పోలవరం ప్రాజెక్టు కోసం ట్రాన్స్‌ట్రాయ్ సంస్థ కొనుగోలు చేసినందున మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇవ్వొచ్చంటూ టెండర్ నిబంధనలను ప్రభుత్వం సడలించింది. దీంతో రూ.200 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చేందుకు ఆర్థిక శాఖ అంగీకరించింది. అంతకుముందే ట్రాన్స్‌ట్రాయ్ సంస్థకు మూడు శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చింది.
సుమారు 140 కోట్ల రూపాయలు గతంలో మొబిలైజేషన్ అడ్వాన్స్ ఇచ్చినా ఇప్పటి వరకు ఒక్క తట్ట మట్టి తీయలేదని అధికార వర్గాలే పేర్కొంటున్నాయి. ఇప్పుడు మిషనరీ కొనుగోలు అంటూ బిల్లులు చూపెట్టి మొబిలైజేషన్ అడ్వాన్స్ పొందాలని ఎత్తుగడ వేశారని, మిషనరీ కొనుగోలుపైనా అనుమానాలున్నాయని అంటున్నాయి. తాజాగా ఇచ్చిన 5 శాతం మొబిలైజేషన్ అడ్వాన్స్‌తో మొత్తం ఇప్పటి వరకు 8 శాతం మేర అడ్వాన్స్ (రూ.340 కోట్లు) ఇచ్చినట్లయింది.