మృత్యువేగం
200 కి.మీ. స్పీడ్.. మెట్రోపిల్లర్‌కు ఢీ
జూబ్లీహిల్స్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు దుర్మరణం
సాక్షి, హైదరాబాద్: మితిమీరిన వేగం మరో ప్రముఖుడి వారసుడిని బలితీసుకుంది. గంటకు 205 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లిన బెంజ్ కారు ఒక్కసారిగా అదుపుతప్పి మెట్రో రైలు పిల్లర్‌ను బలంగా ఢీకొంది. ఆ ధాటికి ఐదారు అడుగులు ఎగిరిపడిన కారు.. తుక్కుతుక్కుగా మారింది. బుధవారం తెల్లవారుజామున హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 36లో జరిగిన ఈ దుర్ఘటనలో నారాయణ విద్యా సంస్థల అధినేత, ఆంధ్రప్రదేశ్ మంత్రి పి.నారాయణ కుమారుడు నిశిత్ (23) దుర్మరణం పాలయ్యారు. నిశిత్ అమిత వేగంతో నడుపుతున్న కారు అదుపుతప్పి మెట్రోరైలు పిల్లర్‌ను ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందారు. ఘటనలో నిశిత్ స్నేహితుడు కామని రాజారవిచంద్ర (23) కూడా దుర్మరణం పాలయ్యారు.
వారం క్రితమే హైదరాబాద్‌కు వచ్చి..
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని ప్లాట్ నంబర్ 905లో మంత్రి నారాయణ నివాసం ఉంది. నారాయణకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు. కుమారుడు నిశిత్ సింగపూర్‌లో మేనేజ్‌మెంట్ కోర్సు పూర్తిచేశారు. ఇటీవలే నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా నియమితులయ్యారు. గత శనివారం సింగపూర్ నుంచి హైదరాబాద్‌కు వచ్చిన నిశిత్.. మరో మూడు రోజుల్లో తిరిగి వెళ్లాల్సి ఉంది. ఈ సమయంలోనే నారాయణ విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించడం, సిబ్బందికి సలహాలు, సూచనలు ఇవ్వడం, రిక్రూట్‌మెంట్ల అంశంపై దృష్టిపెట్టారు. త్వరలో విద్యా సంవత్సరం ప్రారంభంకానున్న నేపథ్యంలో మూడు రోజులుగా విస్తృతంగా సమావేశాలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా నిశిత్‌తో పాటు ఆయన స్నేహితుడు రాజా రవిచంద్ర కూడా ఉంటున్నారు.
ముగ్గురు డ్రైవర్లు ఉన్నప్పటికీ..
మంగళవారం ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిశిత్.. హైదరాబాద్‌లోని పలు నారాయణ విద్యాసంస్థల్లో సమావేశాలు నిర్వహించారు. ఆ సమయంలో డ్రైవర్ రమేశ్ కారును నడిపారు. సాయంత్రం ఇంట్లో విశ్రాంతి తీసుకున్న నిశిత్.. రాత్రి 9.30 గంటల సమయంలో రవిచంద్రతో కలసి బయటకు వెళ్లినట్లు సెక్యూరిటీ గార్డులు చెబుతున్నారు. నారాయణ ఇంటి వద్ద ముగ్గురు డ్రైవర్లు ఉంటారు. నారాయణ భార్య కారు డ్రైవర్ ఒకరుకాగా.. మిగతా ఇద్దరు అవసరాన్ని బట్టి పనిచేస్తుంటారు. మంగళవారం రాత్రి నిశిత్ బయటకు వెళుతున్న సమయంలో ఆ ముగ్గురు డ్రైవర్లు ఉన్నా కూడా.. తానే కారు నడుపుకొంటూ వెళ్లిపోయారు. ఈ విషయం తెలిసిన నిశిత్ తల్లి రమ డ్రైవర్లను మందలించారు. ఒకటి రెండు సార్లు కుమారుడితో మాట్లాడి.. నిద్రపోయారు.
నారాయణగూడలో చివరి సమావేశం
రాత్రి ఇంటి నుంచి వెళ్లిన అనంతరం పలు బ్రాంచీలకు వెళ్లిన నిశిత్.. చివరిగా నారాయణగూడ బ్రాంచి నుంచి తెల్లవారుజామున 2.20 గంటల ప్రాంతంలో బయలుదేరారు. నిశిత్ కారు నడుపుతుండగా రవిచంద్ర పక్కన కూర్చున్నారు. 2.40 గంటల సమయంలో వారి కారు జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ దాటి ముందుకు దూసుకుపోయింది. ఆ సమయంలో వాహనం గంటకు 205 కిలోమీటర్ల వేగంతో ఉంది. 9వ నంబర్ మెట్రో రైలు పిల్లర్ వద్ద రోడ్డు మలుపు ఉండటం, మెట్రో పనులకు సంబంధించి కంకర, ఇసుక పడి ఉండటంతో అతివేగంగా వస్తున్న వాహనం అదుపు తప్పింది. నేరుగా మెట్రో పిల్లర్‌ను బలంగా ఢీకొంది.
ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న మెర్సిడెస్ బెంజ్ జీ63 (రిజిస్ట్రేషన్ నంబర్ టీఎస్ 07 ఎఫ్‌కే 7117) కారు ఏకంగా గంటకు 205 కిలోమీటర్ల వేగంతో దూసుకెళుతున్నట్లు గుర్తించారు. ఈ ధాటికి వాహనం ముందు భాగం పూర్తిగా నుజ్జు నుజ్జు కాగా.. కారు వెనుక భాగం దాదాపు ఐదారు అడుగులు పైకి లేచి కింద పడినట్లు సీసీ కెమెరాల్లో రికార్డయింది. కారులోని ఎయిర్‌బ్యాగ్స్ తెరుచుకోకపోవడంతో నిశిత్, రవిచంద్ర అక్కడికక్కడే మరణించారు. అక్కడ విధులు నిర్వర్తిస్తున్న మెట్రో వర్కర్లు పోలీసులకు సమాచారమిచ్చారు.
మృతదేహాల వెలికితీతకు రెండు గంటలు
సమాచారం తెలిసిన వెంటనే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కారు ముందుభాగం పూర్తిగా ధ్వంసం కావడంతో నిశిత్, రవిచంద్ర అందులో ఇరుక్కుపోయారు. పోలీసులు తమ వద్ద ఉన్న ఉపకరణాలు, రహదారిపై వెళ్తున్న ఇతర వాహనాల నుంచి తీసుకున్న పరికరాలతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి వారిని బయటకు తీశారు. వారిని అపోలో ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఇద్దరూ మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ప్రమాద సమయంలో నిశిత్ వినియోగించిన వాహనం ఆయన సోదరి సింధు భర్త పునీత్ కోటప్పకు చెందిన సంస్థ పేరిట రిజిస్టరై ఉంది.
అతివేగం వల్లే ప్రమాదం
‘‘నిశిత్, రవిచంద్ర ప్రయాణిస్తున్న వాహనం అత్యంత వేగంగా దూసుకెళ్తుండగా అదుపు తప్పి మెట్రో పిల్లర్‌ను ఢీకొంది. బుధవారం తెల్లవారుజామున 2.40 గంటల సమయంలో నారాయణగూడ నుంచి పెద్దమ్మగుడి మీదుగా జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 46లోని మంత్రి నారాయణ ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది..’’
– వెంకటేశ్వరరావు, హైదరాబాద్ వెస్ట్‌జోన్ డీసీపీ
పరామర్శించిన ప్రముఖులు
ప్రమాద ఘటన గురించి తెలిసిన మంత్రి హరీశ్‌రావు బుధవారం ఉదయమే అపోలో ఆస్పత్రికి వెళ్లారు. నారాయణ కుటుంబ సభ్యులను ఓదార్చారు. పోస్టుమార్టం తదితర వ్యవహారాలతో పాటు మృతదేహాలను అంబులెన్స్‌లోకి చేర్చేదాకా పరిస్థితిని పర్యవేక్షించారు. ఇక సీనియర్ నేతలు ఎర్రబెల్లి దయాకర్‌రావు, పొన్నాల లక్ష్మయ్య, కడియం శ్రీహరి, తుమ్మల నాగేశ్వరరావు, సుజనాచౌదరి, సీపీఐ నారాయణ, నామా నాగేశ్వరరావు, డి.శ్రీనివాస్, చిరంజీవి, చినరాజప్ప, సినీనటుడు పవన్‌కల్యాణ్ తదితరులు కూడా అపోలో ఆస్పత్రి వద్దకు వచ్చారు. కాగా.. ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ మృతి పట్ల కేంద్ర మంత్రి బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్, సీపీఐ నేత కె.నారాయణ సంతాపం ప్రకటించారు. నారాయణ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నట్లు చెప్పారు.
ముక్కలైన కాలేయం
బుధవారం తెల్లవారుజామున 3 గంటల ప్రాంతంలో కుమారుడి మరణవార్త విన్న తల్లి రమ కుప్పకూలిపోయారు. ఆమెతోపాటు కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు అపోలో ఆస్పత్రికి చేరుకున్నారు. నిశిత్, రవిచంద్రల మృతదేహాలకు బుధవారం ఉదయం 9 గంటల సమయంలో అపోలో వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. ప్రమాదం జరిగిన తర్వాత పది నిమిషాల్లోనే వారు చనిపోయి ఉంటారని చెప్పారు. బలమైన దెబ్బలు తగలడం వల్లే ప్రాణాలు కోల్పోయారని.. డ్రైవింగ్ సీట్‌లో ఉన్న నిశిత్ ఛాతీకి స్టీరింగ్ బలంగా తాకడంతో ఊపిరితిత్తులు పూర్తిగా దెబ్బతినడంతోపాటు కాలేయం ముక్కలైందని తెలిపారు. ఇక నిశిత్ మృతదేహాన్ని బుధవారం సాయంత్రం నెల్లూరు తరలించారు. షెడ్యూల్ ప్రకారం నిశిత్ బుధవారం విజయవాడలో నారాయణ విద్యా సంస్థల సమావేశానికి హాజరుకావాల్సి ఉంది.
వైఎస్ జగన్ దిగ్భ్రాంతి
ఏపీ మంత్రి పి.నారాయణ కుమారుడు నిశిత్ నారాయణ మృతి పట్ల వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ విషాదం పట్ల ఆయన సంతాపం ప్రకటించారు. నారాయణ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
ఆ ఇద్దరూ ప్రాణస్నేహితులు
బుధవారం ప్రమాదంలో మరణించిన నిశిత్, రాజా రవిచంద్ర ఇద్దరూ ప్రాణ స్నేహితులు. నిశిత్ తండ్రి నారాయణ విద్యా సంస్థలు నిర్వహిస్తుండగా.. రవిచంద్ర తండ్రి కామని చిన బాలమురళీ మోహనకృష్ణ ప్రకాశం జిల్లా టంగుటూరుకు చెందిన పొగాకు వ్యాపారి. హైదరాబాద్ శివార్లలోని ఇండస్ స్కూల్‌లో 5వ తరగతిలోనే నిశిత్, రవిచంద్రల స్నేహం మొదలైంది. అప్పటి నుంచి కాలేజీ వరకూ కలిసే చదువుకున్నారు. అంతేకాదు ఇద్దరూ రెండేళ్ల క్రితం సింగపూర్ వెళ్లి ఒకే కాలేజీలో చేరారు. అక్కడ చదువు పూర్తి చేసుకుని.. ఒకేసారి తిరిగి హైదరాబాద్‌కు వచ్చారు. బేగంపేట్‌లోని బాలంరాయి ప్రాంతంలో రవిచంద్ర నివాసం ఉంటుండగా.. నిశిత్ జూబ్లీహిల్స్‌లో తండ్రి నివాసంలో ఉంటున్నారు. రవిచంద్ర సొంత వ్యాపారం పెట్టుకోగా.. నిశిత్ తన తండ్రికి చెందిన నారాయణ విద్యాసంస్థల డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు. ఇంతకాలం కలసి ఉన్న ఈ స్నేహితులు ఇప్పుడు కలిసే తిరిగిరానిలోకాలకు వెళ్లిపోయారంటూ కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరవుతున్నారు.
అధిక వేగంపై ఇప్పటికే మూడు ఈ–చలాన్లు
► ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ కారు (టీఎస్07ఎఫ్‌కే7117) గతంలోనూ పరిమితికి మించిన వేగంతో ప్రయాణించింది. మూడుసార్లు అత్యధిక వేగంతో దూసుకుపోతూ సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసుల స్పీడ్ లేజర్ గన్‌కు చిక్కింది. ఈ మూడు ఘటనలు ఔటర్ రింగ్‌రోడ్ (ఓఆర్‌ఆర్)పై నమోదైనట్లు తెలుస్తోంది. ఓఆర్‌ఆర్‌పై వేగం పరిమితి గంటకు 120 కిలోమీటర్లు మాత్రమే. ఈ ఉల్లంఘనలకు సంబంధించిన జరిమానా మొత్తం రూ.4,305 ఇంకా పెండింగ్‌లోనే ఉంది.
► ఈ ఏడాది జనవరి 24న శంషాబాద్ పరిధిలోని హిమాయత్‌సాగర్ వద్ద మొదటి ఉల్లంఘన నమోదైంది. ఆ రోజు ఉదయం 9.15 గంటలకు ఈ కారు గంటకు 150 కి.మీ. వేగంతో దూసుకుపోతూ లేజర్ గన్‌కు చిక్కింది.
► రెండో ఉల్లంఘన ఈ ఏడాది మార్చి 1న హిమాయత్‌సాగర్ వద్దే నమోదైంది. ఆ రోజు ఉదయం 11.27 గంటలకు 154 కి.మీ. వేగంతో దూసుకుపోతూ లేజర్ గన్‌కు చిక్కింది.
► మార్చి 10న ఉదయం 10 గంటలకు మూడో ఉల్లంఘన నమోదైంది. నార్సింగి పరిధిలో ఓఆర్‌ఆర్‌పై 125 కి.మీ. వేగంతో వెళ్తుండగా లేజర్ గన్‌ఫొటో తీసి ఈ–చలాన్ జారీ చేసింది.