5.4 సెకన్లలో వంద కిలోమీటర్ల వేగం
- ప్రమాదానికి గురైన మెర్సిడెస్ బెంజ్ కారు ప్రత్యేకతలివీ
- 5,461 సీసీ ఇంజన్.. 230 కి.మీ. వేగంతో దూసుకుపోగల సామర్థ్యం
- ఎయిర్ బ్యాగులు సహా ఎన్నో భద్రతా ప్రమాణాలు
- ప్రపంచంలోని అత్యుత్తమ కార్లలో ఇదీ ఒకటి
- నగరంలో మరో 4 ఇదే మోడల్ కార్లు
సాక్షి, హైదరాబాద్: అమిత వేగంతో కారు నడిపిన మంత్రి నారాయణ కుమారుడు నిశిత్ ఘోర రోడ్డు ప్రమాదంలో మరణించాడు. కేవలం కొద్ది సెకన్ల వ్యవధిలోనే ఈ ఘోరం జరిగిపోయింది. ప్రమాదానికి గురైనది మెర్సిడెస్ కంపెనీకి చెందిన బెంజ్ ఏఎంజీ జీ63 మోడల్ కారు. ఐదు నెలల క్రితమే గతేడాది డిసెంబర్ 12న ఈ కారు అత్తాపూర్ ఆర్టీఏ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయింది. ప్రపంచంలోనే అత్యుత్తమ కార్లలో ఇదీ ఒకటి. దీని ధర సుమారు రూ.1.9 కోట్లకు పైగానే ఉంటుంది. కేవలం 5.4 సెకన్లలోనే 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు.
ప్రస్తుతం విస్తృతంగా వినియోగిస్తున్న ఇన్నోవా, ఫార్చునర్ వంటి కార్ల ఇంజన్ సామర్థ్యం 2,400 సీసీ నుంచి 2,600 సీసీ వరకు ఉండగా.. బెంజ్ ఏఎంజీ జీ63 ఇంజన్ సామర్థ్యం ఏకంగా 5,461 సీసీ. అది కూడా 5.5 లీటర్ సూపర్ చార్జ్‌డ్ పవర్‌ఫుల్ ఇంజిన్. ఈ కారు గరిష్ట వేగం గంటకు సుమారు 230 కిలోమీటర్ల పైనే ఉంటుంది. కారు ఎత్తు 1.9 మీటర్లు, బరువు సుమారు 2,550 కిలోలు. యూరో–6 ప్రమాణాలకు అనుగుణంగా జర్మనీలో తయారు చేశారు. భద్రత కోసం ఈబీడీ బ్రేకింగ్ సిస్టమ్‌తోపాటు అత్యుత్తమ ఏర్పాట్లూ ఇందులో ఉంటాయి.
ప్రీసేఫ్ బ్రేకింగ్ సిస్టమ్
మెర్సిడెస్ బెంజ్ కార్లలో ప్రీసేఫ్ బ్రేకింగ్ వ్యవస్థ ఉంటుంది. డిస్ట్రోనిక్ ప్లస్‌గా పిలిచే సాంకేతిక పరిజ్ఞానంతో ఈ బ్రేకింగ్ వ్యవస్థ పనిచేస్తుంది. ప్రమాదకర పరిస్థితులు ఎదురైనప్పుడు 40 శాతం వరకు ఆటోమేటిక్‌గానే బ్రేకింగ్ సిస్టమ్ పని చేస్తుంది. ఇక ఈ వాహనాల్లో రాత్రివేళ రోడ్లు స్పష్టంగా కనిపించేలా ప్రత్యేక ఏర్పాట్లు ఉంటాయి. ‘నైట్ వ్యూ అసిస్టెంట్ ప్లస్’టెక్నాలజీ కలిగిన ప్రత్యేక కెమెరాలు, ఇన్విజిబుల్ ఇన్‌ఫ్రారెడ్ బీమ్స్, ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్స్ ఉంటాయి. డ్రైవర్‌కు రక్షణనిచ్చే ఎయిర్ బ్యాగ్స్, సీట్‌బెల్టుతో పాటు కారులో ఉండే మిగతా ప్రయాణికులకు కూడా రక్షణ కల్పించేలా సీటు బెల్టులు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఉంటాయి.
హైదరాబాద్‌లో మరో 4 వాహనాలు
ఖరీదైన మెర్సిడెస్ బెంజ్ ఏఎంజీ జీ63 మోడల్ కార్లు హైదరాబాద్‌లో మరో 4 మాత్రమే ఉన్నాయి. సినీహీరో అక్కినేని నాగార్జున తనయుడు అఖిల్ వద్ద, జూబ్లీహిల్స్‌కు చెందిన ఎన్.గౌతమ్‌కుమార్, బంజా రాహిల్స్‌కు చెందిన ఎంజీబీ కమోడిటీస్, మాదాపూర్‌కు చెందిన వర్సిటీ ఎడ్యుకేషన్ మేనేజ్‌మెంట్ అనే సంస్థ వద్ద ఈ మోడల్ కార్లు ఉన్నాయి.