
‘పాడి పరిశ్రమాభివృద్ధి’ ఆస్తులపై హైకోర్టుకు..
తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు రద్దు చేయాలని ఏపీ అభ్యర్థన
సాక్షి, హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థ ఆస్తులను తమ రాష్ట్ర పాడి పరిశ్రమాభివృద్ధి సంస్థకు బదిలీ చేసుకుంటూ తెలంగాణ ప్రభుత్వం ఈ ఏడాది మే 6న జారీ చేసిన ఉత్తర్వులపై ఏపీ ప్రభుత్వం హైకోర్టును ఆశ్రయించింది. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యాన్ని బుధవారం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ దిలీప్ బి.బొసాలే, న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్‌రావులతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా ఏపీ సర్కార్ తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపిస్తూ.. పునర్విభజన చట్టం ప్రకారం డెయిరీ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఆస్తుల విభజన ఇంకా జరగలేదన్నారు. దీనిపై కేంద్ర జోక్యాన్ని కోరామని, కేంద్ర స్పందన కోసం ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. హైదరాబాద్ లాలాపేటలోని మిల్క్, డెయిరీ యూనిట్లు, చిల్లింగ్ కేంద్రాలు, సోమాజిగూడలోని అతిథి గృహం బదలాయించుకున్న ఆస్తుల్లో ఉన్నాయని ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఎలా బదలాయించుకుంటారు?
కేంద్ర నిర్ణయం కోసం ఏపీ సర్కార్ ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఆస్తులను ఎలా బదలాయించుకుంటారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. ఇది ఏకపక్ష చర్య కాదా? అని నిలదీసింది. దీనికి రాష్ట్ర అడ్వొకేట్ జనరల్ కె.రామకృష్ణారెడ్డి బదులిస్తూ.. పునర్విభజన చట్ట నిబంధనల ప్రకారమే ఆస్తులను బదలాయించుకున్నామన్నారు. ప్రధాన భవనంలో 4 అంతస్తుల్లో 2 అంతస్తులు తాము, 2 అంతస్తులు ఏపీ ఉపయోగించుకుంటున్నామని తెలిపారు. కామన్ ఫెసిలిటీస్ విషయంలో సంబంధిత కార్యదర్శితో మాట్లాడి తగిన ఉత్తర్వుల జారీకి చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకు కొంత గడువు కోరడంతో ధర్మాసనం అంగీకరించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది.