సగం మందికి అందని జీతాలు
ఆంధ్రా సచివాలయ ఉద్యోగులకు 1న అందని వేతనాలు
ఎస్‌బీహెచ్ సర్వర్ సమస్యే కారణమన్న అధికారులు
రాష్ట్రవ్యాప్తంగా సగం మంది ఖాతాల్లోనూ జమకాని జీతాలు
సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సచివాలయంలో పనిచేసే ఉద్యోగులెవరికీ ఈ నెల 1వ తేదీన వేతనాలు అందలేదు. అలాగే జిల్లాల్లో పనిచేసే ఉద్యోగులు కొంతమందికి కూడా 1వ తేదీన వేతనాలు అందలేదు. శనివారం కావడం వల్ల బ్యాంకులు మధ్యాహ్నం వరకే పనిచేయడం ఇందుకు ప్రధాన కారణమని ట్రెజరీ అధికారులు పేర్కొన్నారు.
ఈ కారణం వల్లే కొంతమంది ఉద్యోగులకు వేతనాలు క్రెడిట్ అయ్యాయని, కొంతమందికి కాలేదని వారు చెప్పారు. సచివాలయంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌లో వేతన ఖాతాలు కలిగిన ఉద్యోగులెవ రికీ వేతనాలు అందలేదని, ఇందుకు ప్రధాన కారణం ఎస్‌బీహెచ్ సర్వర్ పనిచేయకపోవడమేనని ఆర్థిక శాఖ కార్యదర్శి ప్రేమచంద్రారెడ్డి తెలిపారు. ఆర్థిక శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతో పాటు ఆంధ్రా సచివాలయ ఉద్యోగులెవరికీ 1వ తేదీన వేతనాలు ఖాతాల్లో పడలేదు.
తెలంగాణ సచివాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులకు మాత్రం 1వ తేదీన వేతనాలు జమ కాగా ఆంధ్రప్రదేశ్ సచివాలయ ఉద్యోగులకు జీతాలు జమ కాకపోవడం ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. వేతనాలు ఆన్‌లైన్‌లో ట్రాన్స్‌ఫర్ అయ్యే దృష్ట్యా శనివారం కాకపోతే ఆదివారం అయినా అకౌంట్లలో డబ్బులు పడతాయని ఉద్యోగులు ఆశించారు. కొంతమంది ఏటీఎంలకు వెళ్లి డబ్బులు తీసుకుందామని ప్రయత్నిస్తే జీతాలు పడలేదని తేలింది. ఇక కడప, చిత్తూరు, తూర్పుగోదావరి, గుంటూరు జిల్లాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీన వేతనాలు పడలేదు. కడప, చిత్తూరు జిల్లాల్లోని ఉపాధ్యాయులకు, గుంటూరులో పనిచేస్తున్న పంచాయతీరాజ్ ఉద్యోగులకు వేతనాలు ఖాతాల్లో జమ కాలేదు.
ఏపీలో పనిచేస్తున్న ఉద్యోగుల్లో సగం మందికి వేతనాలు అందగా మరో సగం మందికి వేతనాలు అందలేదని అధికార వర్గాలు తెలిపాయి. వేతనాల బిల్లులను సాధారణంగా అన్ని శాఖలు నాలుగు రోజుల ముందుగానే సమర్పిస్తాయి. అయినా గతంలో ఎన్నడూ లేని విధంగా వేతనాలు అందకపోవడంతో ఉద్యోగులు సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఆర్థిక శాఖ అధికారులను సంప్రదించగా.. బ్యాంకులు శనివారం మధ్యాహ్నం వరకే పని చేయడంతో పాటు కొన్ని బ్యాంకుల్లో సర్వర్ సమస్య కారణంగా కొంతమందికి వేతనాలు అందలేదని, సోమవారం జమ అవుతాయని పేర్కొన్నారు.