
'చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదు'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై అధికార సభ్యుల ఎదురుదాడి కొనసాగుతోంది. విపక్ష నేత సంధించిన ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరైన అధికార సభ్యులు తమకు అలవాటైన ఎదురుదాడి విద్యను ప్రదర్శించారు. నోటికి వచ్చినట్టు ఇష్టానుసారంగా మాట్లాడారు. వ్యక్తిగత విమర్శలకు దిగారు. సీఎం చంద్రబాబుతో సహా మంత్రులు సవాళ్ల మీద సవాళ్లు విసురుతూ రెచ్చగొట్టేందుకు ప్రయత్నించారు.
అవిశ్వాసం తీర్మానంపై వైఎస్ జగన్ మాట్లాడుతుండగా అధికార ఎమ్మెల్యేలు పదే పదే అడ్డుపడ్డారు. సోలార్ కుంభకోణంలో భారీ అవినీతి జరిగిందని వైఎస్ జగన్ ఆరోపించగానే టీడీపీ నేతలు మూకుమ్మడిగా ఎదురుదాడికి దిగారు. ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి మాట్లాడుతూ... వైఎస్ జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. గతంలో చెప్పిన విషయాలను మళ్లీ చెప్పే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా స్పీకర్ జోక్యం చేసుకుని చరిత్రలోకి వెళ్లాల్సిన అవసరం లేదంటూ గోరంట్లను మందలించారు. తర్వాత కూడా గోరంట్ల తనదైన శైలిలో ప్రసంగం కొనసాగించారు.