ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మే 23న విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నేతలను గృహనిర్బంధం చేయడం, వారిపై దౌర్జన్యం చేయడంపై హెచ్ఆర్సీని ఆశ్రయించారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో మే 23న విజయవాడలో జరిగిన నిరసన కార్యక్రమం సందర్భంగా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించి నేతలను గృహనిర్బంధం చేయడం, వారిపై దౌర్జన్యం చేయడంపై హెచ్ఆర్సీని ఆశ్రయించారు. చట్టపరంగా వారపై చర్యలు తీసుకోవాలని మానవ హక్కుల కమిషన్ లో ఏపీసీసీ లీగల్ సెల్ చైర్మన్ సుందరరామశర్మ ఆధ్వర్యంలో మంగళవారం ఫిర్యాదు చేశారు. రాష్ట్రంలో కరువు సహాయం వెంటనే అందించాలని, తెలంగాణ చేపట్టిన అక్రమ ప్రాజెక్టులు నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ 23న విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టింది. ఈ కార్యక్రమం కోసం ముందుగానే విజయవాడ పోలీస్ కమిషనర్ నుంచి అనుమతి తీసుకున్నా, పార్టీ నేతలను అరెస్టు చేసి నిరసనను అడ్డుకున్నారని హెచ్ఆర్సీని ఆశ్రయించారు. రఘువీరారెడ్డి, ఎంపీ కేవీపీ రామచంద్రరావు, కేంద్ర, రాష్ట్ర మాజీ మంత్రులను, వివిధ జిల్లాల నుంచి వస్తున్న పార్టీ కార్యకర్తలను నిర్భందించారని తెలిపారు. మెమోరాండమ్ సమర్పించిన వారిలో ఏపీసీసీ ఉపాధ్యక్షులు కే శైలజానాధ్, కె.తులసిరెడ్డి, సూర్యానాయక్, అధికార ప్రతినిధి కె.గంగాభవానీ, ప్రధాన కార్యదర్శి జంగా గౌతమ్, కిసాన్ సెల్ చైర్మన్ కె.రవిచంద్రారెడ్డి ఉన్నారు.
ఏపీసీసీ అధ్యక్షుడు, మాజీ మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, కేంద్ర మాజీ మంత్రి ఎం.పల్లంరాజు, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి, కనుమూరి బాపిరాజు, మాజీ ఎంపీ ఎన్.తులసిరెడ్డి, రాష్ట్ర మాజీ మంత్రి కాసు వెంకట కృష్ణారెడ్డి, దేవినేని నెహ్రూ, లీగల్ సెల్ చైర్మన్ సుందరరామ శర్మ, కిసాన్ సెల్ చైర్మన్ కె.రవిచంద్రారెడ్డి, తదితర నేతలపై పోలీసులు లాఠీచార్జి చేయడంతో పాటు విజయవాడలోని పోలీస్ స్టేషన్లో సాయంత్రం వరకు గృహనిర్బంధంలో ఉంచడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ ను 23న ఉదయం తెనాలిలోనే గృహనిర్బంధం చేసి ఆ జిల్లా నుంచి వస్తున్న వందలాది కార్యకర్తలను కూడా అడ్డుకున్నారు. కేంద్ర మాజీ మంత్రి కిల్లి కృపారాణి, ఏపీసీసీ మహిళా విభాగం అధ్యక్షురాలు సుంకర పద్మశ్రీ, ఇతర ముఖ్య మహిళా నాయకురాళ్లపై పోలీసులు లాఠీ చార్జి చేసి తమ నిరసన కార్యక్రమాన్ని అడ్డుకున్నారని ఇది మానవ హక్కుల ఉల్లంఘించడమేనని, చట్టాన్ని అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని హెచ్ఆర్సీలో ఏపీసీసీ నేతలు ఫిర్యాదుచేశారు.