బాబుది వెన్నుపోటు.. అబద్దాల మూట!
హైదరాబాద్: తెలుగువారి ఆత్మగౌరవాన్ని, పోరాట స్పూర్తిని టీడీపీ మహానాడు పాతరేసిందంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఎన్. రఘువీరారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఏపీలో మూడు రోజుల పాటు టీడీపీ నిర్వహించిన మహానాడుపైనా, చేసిన తీర్మానాలపైన ఏపీసీసీ అధ్యక్షులు ఎన్ రఘీవీరారెడ్డి, మాజీమంత్రి కాసు కృష్ణారెడ్డి, పీసీసీ ఉపాధ్యక్షులు శైలజనాధ్ తదితరులు ఆదివారం ఇందిరాభవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబు ఇంటిపేరు వెన్నుపోటుగా.. మాట అబద్దాల మూటగా.. చంద్రబాబు జమానా అవినీతి ఖజానాగా మారిందని టీడీపీ మహానాడు మరోసారి రుజువు చేసిందన్నారు. టీడీపీ మహానాడు ఆత్మస్తుత్తి-పరనిందలకు వేదిక అయ్యిందంటూ దుయ్యబట్టారు. టీడీపీ మహానాడు సందర్భంగా మందు, మద్యాలను వినియోగించి పవిత్ర స్థలమైన తిరుపతి ప్రాంతాన్ని అపవిత్రంగా మార్చడాన్ని ఏపీసీసీ తీవ్రంగా ఖండిస్తుందని చెప్పారు. కొత్త రాష్ట్రంగా ఏర్పడిన అనంతరం టీడీపీ తొలిసారి చేపట్టిన మహానాడులో రాష్ట్రప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశాలపై దిశానిర్థేశం కరువైందంటూ మండిపడ్డారు. టీడీపీ చేసిన తీర్మానాలన్నీ తూతూ మంత్రంగా ప్రజలను మభ్యపెట్టే విధంగానే ఉన్నాయన్నారు. టీడీపీ తీర్మానాలపై ఏపీ కాంగ్రెస్ పార్టీ ఆదివారం విడుదల చేసిన ఒక పత్రికా ప్రకటనలో ఈ కింది విధంగా పేర్కొంది.
ప్రత్యేక తరగతి హోదాపై తీర్మానం
రాష్ట్ర అసెంబ్లీలో ప్రత్యేక హోదాపై టీడీపీ తీర్మానం రెండుసార్లు చేసింది. అయినా ప్రధాని నరేంద్ర మోదీ హోదాను అమలు చేయకుండా మోసం చేస్తున్నారు. మోదీ చేసినా మోసాన్ని, అన్యాయాన్ని రాష్ట్ర ప్రజల తరపున ఖండించలేని స్థితిలో మహానాడు ఉండటం ప్రజల ఆత్మగౌరవాన్ని అవమానపరిచింది. ఏపీకి ప్రత్యేక హోదాను పోరాడి అమలు చేయించే బాధ్యత తనేదనని చంద్రబాబు చెప్పలేకపోవడం, మోడీకి చంద్రబాబు మోకరిల్లిన వాస్తవం మరోసారి మహానాడు వేదిక తీర్మానం రుజువుచేసింది.
జాతీయ స్థాయిలో టీడీపీ క్రియాశీలం తీర్మానం
జాతీయ స్థాయిలో ఇకపై టీడీపీ క్రియాశీలంగా ఉంటుందని తీర్మానించడంపై చంద్రబాబు ఎన్డీయే ప్రభుత్వంలో భాగస్వామినా, జాతీయ స్థాయిలో తన అసమర్థతను కప్పిపుచ్చుకోనేందుకు రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారా? అనే అనుమానం టీడీపీ తీర్మానం కలుగజేస్తోంది.
తెలంగాణ ప్రభుత్వంతో వివాదాలు వద్దంటూ తీర్మానం
తెలంగాణ ప్రభుత్వం చేపడుతోన్న ప్రాజెక్టుల వలన ఏపీకి ప్రమాదం పొంచి ఉందని.. ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతుంటే.. ఓటుకు నోటు కేసుకు భయపడి రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెట్టేందుకు సిద్ధమయ్యాడని ఈ తీర్మానం తెలియజేస్తోంది.
అవినీతి- పారదర్శక పాలనపై తీర్మానం
గత రెండు సంవత్సరాల టీడీపీ పాలనలో అవినీతి పరాకాష్టకు చేరింది. టీడీపీ టోటల్ దోపిడీ పార్టీగా మారింది.
టీడీపీ ఎన్నికల్లో హామీల కంటే ఎక్కువే చేశామని తీర్మానం
ఏ ఒక్క హామీని అమలు చేయకుండానే అన్నీ అమలు చేసామని మహానాడులో తీర్మానం చేయడం ఆ మహానాడు పచ్చి అబద్దాల నాడుగా చరిత్రలో మిగులుతుంది.
సామాజిక న్యాయం, తెలంగాణ రైతాంగంపై తీర్మానాలు
తెలంగాణలో రైతులకు రుణమాఫీ జరగలేదని, కరువు సాయం అందించలేదని, తెలంగాణ ప్రభుత్వం సామాజిక న్యాయాన్ని పాటించడం లేదని తీర్మానం చేయడం నిజంగా సిగ్గుచేటు.
ఎన్టీఆర్ జపం, తీర్మానం తన నిరంతర వెన్నుపోటులను కప్పిపుచ్చుకునేందుకే..
అధికారం కోసం అక్రమ మార్గాలను ప్రవేశపెట్టిన చరిత్ర చంద్రబాబుది. ప్రస్తుతం బాలకృష్ణను వియ్యంకున్ని చేసుకుని హరికృష్ణ కుటుంబానికి వెన్నుపోటుకి పాల్పడుతున్నట్టు చెబుతున్నారు. టీడీపీ చరిత్రని, తెలుగు జాతి చరిత్రగా చెప్పడం చంద్రబాబు అజ్ఞానికి నిదర్శనమన్నారు.